- ఆదిలాబాద్ జిల్లా సోయా రైతుల సమస్య పరిష్కరించాలని వినతి
ఆదిలాబాద్ టౌన్, వెలుగు: ఆదిలాబాద్ సోయా రైతులు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించాలని కోరుతూ ఎమ్మెల్యే పాయల్ శంకర్ ఆధ్వర్యంలో ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా బీజేపీ ఎమ్మెల్యేలు సీఎం రేవంత్ రెడ్డితో కలిసి గురువారం ఢిల్లీలో కేంద్ర వ్యవహారాలు, ప్రజా పంపిణీ శాఖ మంత్రి ప్రహ్లాద్ జోషిని కలిశారు.
ఈ సందర్భంగా జిల్లా సోయా రైతులు ఎదుర్కొంటున్న సమస్యను కేంద్రమంత్రి దృష్టికి తీసుకెళ్లారు. భారీ వర్షాలు, వాతావరణ పరిస్థితులు అనుకూలించక జిల్లాలో సోయా గింజలు పూర్తిగా రంగు మారాయని, కేంద్ర నిల్వ సంస్థలు (సీడబ్ల్యూసీ) పంటను కొనుగోలు చేయడానికి నిరాకరిస్తున్నాయని తెలిపారు.
ఫలితంగా చిన్న, సన్నకారు రైతులు భారీ నష్టాలు ఎదుర్కొంటున్నారని వివరించారు. ఈ సీజన్‌కు ఎఫ్ఏక్యూ(ఫెయిర్ యావరేజ్ క్వాలిటీ) నిబంధనల్లో ప్రత్యేక సడలింపు ఇచ్చి, రంగు మారిన సోయాను వెంటనే కొనుగోలు చేసేలా అధికారులకు ఆదేశాలు జారీ చేయాలని కోరారు.
సమస్య పరిష్కారానికి చర్యలు తీసుకుంటామని మంత్రి హామీ ఇచ్చినట్లు పాయల్ శంకర్ తెలిపారు. కేంద్రమంత్రిని కలిసిన వారిలో ఎమ్మెల్యేలు మహేశ్వర్ రెడ్డి, రామారావు పటేల్, పాల్వాయి హరీశ్ బాబు తదితరులు ఉన్నారు.
