మైనార్టీల సంక్షేమానికి ప్రభుత్వం పెద్దపీట : డీసీసీ ప్రెసిడెంట్, ఎమ్మెల్సీ శంకర్ నాయక్

మైనార్టీల సంక్షేమానికి ప్రభుత్వం పెద్దపీట :  డీసీసీ ప్రెసిడెంట్, ఎమ్మెల్సీ శంకర్ నాయక్

నల్గొండ అర్బన్ వెలుగు : మైనార్టీల సంక్షేమానికి ప్రభుత్వం పెద్దపీట వేస్తుందని ఎమ్మెల్సీ, డీసీసీ అధ్యక్షుడు శంకర్ నాయక్ అన్నారు. మంగళవారం నల్గొండలోని మంత్రి క్యాంపు కార్యాలయంలో కాంగ్రెస్ పట్టణ అధ్యక్షుడు గుమ్ముల మోహన్ రెడ్డితో కలిసి మీడియాతో మాట్లాడారు. కాంగ్రెస్ అన్ని వర్గాల సంక్షేమం కోసం పనిచేస్తుందన్నారు. రాష్ట్రంలో పేదల సంక్షేమమే ధ్యేయంగా అభివృద్ధి చేస్తూ సీఎం రేవంత్​రెడ్డి ముందుకు సాగుతున్నారని తెలిపారు. బీజేపీ మతతత్వ పార్టీ అని, మైనార్టీలపై దాడులు చేస్తూ ఓటు బ్యాంకు రాజకీయాలకు పాల్పడుతుందని విమర్శించారు. పదేండ్లు అధికారంలో ఉన్న బీఆర్ఎస్ పేదలకు చేసిందేమీలేదన్నారు..

నల్గొండ పట్టణంలోని దర్గా ఘాట్ రోడ్డుపై రాజకీయాలు చేయవద్దని సూచించారు. మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి నల్గొండ పట్టణాన్ని పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చేయడం కోసం ఘాట్ రోడ్డుకు నిధులు మంజూరు చేయించారని తెలిపారు. అనంతరం జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ గా నూతనంగా నియమితులైన డాక్టర్ ఎంఏ హఫీజ్ ఖాన్ ను శాలువా, పూలమాలతో ఘనంగా సన్మానించారు. కార్యక్రమంలో మున్సిపల్​మాజీ వైస్ చైర్మన్ రమేశ్ గౌడ్, టీపీసీసీ ప్రత్యేక ఆహ్వానితులు మహమ్మద్ ఇంతియాజ్ హుస్సేన్, మార్కెట్ కమిటీ చైర్మన్ రమేశ్, మాజీ జడ్పీటీసీ లక్ష్మయ్య, మాజీ కౌన్సిలర్లు, నాయకులు  పాల్గొన్నారు.