ముగిసిన ఎమ్మెల్సీ ఉప ఎన్నికల ప్రచారం

ముగిసిన ఎమ్మెల్సీ ఉప ఎన్నికల ప్రచారం
  •     సభలు, సమావేశాలు బంద్​
  •     ఆగిన ప్రచార ఫోన్​కాల్స్, మెసేజ్​లు 
  •     ఈనెల 27న ఉదయం 8 నుంచి.. 
  •     ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్​ ప్రారంభం

యాదాద్రి, సూర్యాపేట, వెలుగు : నల్గొండ, -వరంగల్, ​-ఖమ్మం పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నికల కీలకమైన ప్రచార ఘట్టం  ముగిసింది. కొన్ని రోజులుగా పట్టభద్రులతో సన్నాహక సమావేశాలు నిర్వహణతో ప్రచారం హోరెత్తింది. ప్రధాన పార్టీలైన కాంగ్రెస్ నుంచి ప్రభుత్వ విప్​ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య, ఎమ్మెల్యేలు కోమటిరెడ్డి రాజగోపాల్​రెడ్డి, కుంభం అనిల్​కుమార్​రెడ్డి, వేముల వీరేశం, మందుల సామేల్, కాంగ్రెస్​ నాయకులు​ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. 

బీజేపీ తరఫున ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు జి.కిషన్​రెడ్డి, ఎంపీలు బండి సంజయ్, డాక్టర్​ కె.లక్ష్మణ్, మాజీ ఎంపీ బూర నర్సయ్యగౌడ్​ ప్రచారం చేశారు. బీఆర్ఎస్​ నుంచి ఆ పార్టీ వర్కింగ్ ​ప్రెసిడెంట్ ​కేటీఆర్, మాజీ మంత్రి గుంటకండ్ల జగదీశ్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు పైళ్ల శేఖర్​రెడ్డి, గొంగిడి సునీత, గాదరి కిశోర్, ఎంపీ అభ్యర్థి క్యామ మల్లేశ్​సహా పలువురు ముఖ్యనేతలు విస్తృతంగా పర్యటించి ప్రచారం నిర్వహించారు. ఎన్నికల కమిషన్​ నిబంధనల మేరకు శనివారం సాయంత్రం 4  గంటలకు ప్రచారం నిలిపివేయాల్సినందున ఎక్కడికక్కడ సమావేశాలు నిలిచిపోయాయి.

ఆగిపోయిన ప్రచార ఫోన్​కాల్స్, మెసేజ్​లు.. 

మూడు ఉమ్మడి జిల్లాల్లో ఈ ఎన్నిక జరుగుతున్నందున పోటీ చేస్తున్న ప్రధాన పార్టీలైన కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ఎస్​అభ్యర్థులు తీన్మార్​మల్లన్న,  ప్రేమేందర్​రెడ్డి, ఏనుగుల రాకేశ్ రెడ్డి సహా 52 మంది అభ్యర్థులు ఓటర్లను కలవలేని పరిస్థితి. అందుకే అభ్యర్థులు అందరూ సోషల్​మీడియానే ఎక్కువగా నమ్ముకున్నారు. గ్రూప్​ కాల్స్​చేస్తూ వాయిస్​ మెసేస్​లతో ఓట్లను అభ్యర్థించారు. దీంతోపాటు బల్క్​ మెసేజ్​లను పంపుతూ ప్రచారం నిర్వహించారు. వీటితోపాటు ఫేస్​బుక్, వాట్సాప్, ఎక్స్, ఇన్​స్ట్రా వంటి సోషల్ ​మీడియాల్లో ప్రచారం చేశారు. శనివారం సాయంత్రం నుంచి సోషల్​మీడియా ద్వారా ప్రచారంపై ఎన్నికల కమిషన్​నిషేధం విధించింది. దీంతో ఫోన్​కాల్స్, బల్క్​మెసేజ్​లు నిలిచిపోయాయి.  

పోలింగ్​కు కొన్ని గంటల సమయమే.. 

ఎమ్మెల్సీ ఉప ఎన్నికల పోలింగ్​కు మరికొన్ని గంటల సమయం మాత్రమే ఉంది. ఈనెల 27న (సోమవారం) ఉదయం 8 నుంచి పోలింగ్​ప్రారంభంకానుంది. ఇప్పటికే బహిరంగ ప్రచారం ఆగిపోవడంతో ఇంటర్నల్​ ప్రచారంపై ఆయా రాజకీయ పార్టీలు దృష్టి పెట్టాయి. తమకు పరిచయమున్న ఓటర్ల ద్వారా ఇతర ఓటర్లను ప్రత్యక్షంగా కలుసుకునే ప్రయత్నాలు ప్రారంభించారు.   

సభలు, సమావేశాలు బంద్​

ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారం ముగిసిందని యాదాద్రి కలెక్టర్​హనుమంతు జెండగే తెలిపారు. ఎన్నికల కమిషన్​ నిబంధనల మేరకు పోలింగ్​కు 48 గంటల ముందు నుంచి బహిరంగ సభలు, సమావేశాలు, ప్రచారాలు నిలిపివేయాలని చెప్పారు. ఎవరైనా నిబంధనలు ఉల్లంఘించి ప్రచారం నిర్వహిస్తే చట్టప్రకారం చర్యలు తీసుకుంటామని తెలిపారు.  
- కలెక్టర్ హనుమంతు జెండగే