ఎమ్మెల్సీ చల్లా వెంకట్రామిరెడ్డి మమ్మల్ని వేధిస్తున్నరు : చంద్రశేఖర్ వేగె

ఎమ్మెల్సీ చల్లా వెంకట్రామిరెడ్డి  మమ్మల్ని వేధిస్తున్నరు  :  చంద్రశేఖర్ వేగె

హైదరాబాద్, వెలుగు: బీఆర్‌‌‌‌ఎస్ ఎమ్మెల్సీ చల్లా వెంకట్రామిరెడ్డి తమను వేధిస్తున్నారని గోల్డ్ ఫిష్ అబోడ్​ ప్రైవేట్ లిమిటెడ్​మేనేజింగ్ డైరెక్టర్ చంద్రశేఖర్ వేగె ఆరోపించారు.  ఎమ్మెల్యే బీరం హర్షవర్ధన్ రెడ్డితో కలసి తనపై తప్పుడు కేసులు బనాయిస్తూ ఇబ్బంది పెడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. వారిద్దరిపై పోలీసులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదని.. పైగా తనపైనే తప్పుడు కేసులు పెట్టడంతో పాటు పీడీ యాక్ట్ కూడా ప్రయోగించారని తెలిపారు. ఇటీవల చల్లా వెంకట్రామి రెడ్డి చేసిన పలు ఆరోపణలపై స్పందిస్తూ.. చంద్రశేఖర్ వేగె గురువారం మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. 

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..చల్లా వెంకట్రామిరెడ్డి, హర్షవర్ధన్ రెడ్డి అబద్ధాలతో తమ కంపెనీపై బురద జల్లే ప్రయత్నం చేస్తున్నారని అన్నారు. వెంకట్రామి రెడ్డి ఎత్తులకు బయపడేది లేదని వాటిని చట్ట బద్దంగా ఎదుర్కొంటామని స్పష్టం చేశారు. న్యాయవ్యవస్థ మీద నమ్మకం ఉందని, తగిన న్యాయం దక్కుతుందని భావిస్తున్నట్లు చెప్పారు. సర్వే నెంబర్​ 85లో గల భూమిపై తన అధిపత్యం సాధించడానికే చల్లా వెంకట్రామిరెడ్డి ఇదంతా చేస్తున్నారని ఆరోపించారు. అసంబద్ద అంశాలను తెరపైకి తెచ్చి గోల్డ్​పిష్​కు ఉన్న పేరు ప్రఖ్యాతలను నాశనం చేయాలని చూస్తున్నారని చంద్రశేఖర్ వేగె పేర్కొన్నారు.