తిడితే మంత్రి పదవి రాదు: దేశపతి శ్రీనివాస్

తిడితే మంత్రి పదవి రాదు:  దేశపతి శ్రీనివాస్

హైదరాబాద్, వెలుగు: మాజీ ప్రధాని పీవీ నరసింహ రావు కాంగ్రెస్ వాదే అయినప్పటికీ, ఆయనను కాంగ్రెస్‌ వ్యక్తిగా హైకమాండ్ గుర్తించలేదని ఎమ్మెల్సీ దేశపతి శ్రీనివాస్ అన్నారు. పీవీ అంత్యక్రియలు కూడా అవమానకర పద్ధతిలో జరిగాయన్నారు. కాంగ్రెస్‌ నుంచి ప్రధానులుగా చేసిన వారందరికీ ఢిల్లీలో స్మారకాలు ఉన్నాయని, పీవీకి మాత్రం ఏర్పాటు చేయలేదని గుర్తుచేశారు. ఆదివారం అసెంబ్లీ మీడియా పాయింట్ వద్ద మీడియాతో ఆయన మాట్లాడారు.

తెలంగాణ ఆత్మ గౌరవాన్ని కాంగ్రెస్ కించపర్చిందని చెప్పే క్రమంలో పీవీని అవమానించిన తీరును హరీశ్‌రావు అసెంబ్లీలో వివరించారన్నారు. పీవీపై తమకు ప్రేమ ఉందని, అందుకే ఆయన శత జయంతి వేడుకలను బీఆర్‌‌ఎస్ సర్కార్ ఘనంగా నిర్వహించిందని గుర్తుచేశారు. హరీశ్‌రావుకు పీవీపై ప్రేమ ఎందుకని కాంగ్రెస్ ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డి మాట్లాడడాన్ని దేశపతి తప్పుబట్టారు. హరీశ్‌రావును తిడితే మంత్రి పదవి వస్తుందని జీవన్‌రెడ్డి భావిస్తున్నారని ఎద్దేవా చేశారు. పార్టీ మారకుండా కాంగ్రెస్‌లోనే ఉన్న జీవన్‌రెడ్డికి మంత్రి అయ్యే అర్హత ఉన్నప్పటికీ, ఇతరులను తిట్టడం ద్వారా ఆ పదవి సాధించలేరన్నారు. సీలేరు విద్యుత్ కేంద్రంతో పాటు 7 మండలాలను కాంగ్రెస్‌, బీజేపీ కుమ్మక్కై ఏపీలో కలిపాయని ఆరోపించారు.