ఇటు పైసల ధీమా.. అటు ప్రభుత్వ వ్యతిరేకత

ఇటు పైసల ధీమా.. అటు ప్రభుత్వ వ్యతిరేకత

భారీ మొత్తంలో రూలింగ్ పార్టీ ఖర్చు
డబ్బు కోసం మిగిలిన పార్టీల తండ్లాట
గ్రాడ్యుయేట్స్ నోట్లకు అమ్ముడుపోరనే ధీమా

వరంగల్​, ఖమ్మం, నల్గొండ గ్రాడ్యుయేట్​ఎమ్మెల్సీ ఎన్నికల బరిలో ఉన్న రూలింగ్​ పార్టీ క్యాండిడేట్​ఇటీవల 3 వేల మందితో నామినేషన్​ వేశారు. వీరిలో వెయ్యి మందిని నల్గొండ టౌన్​ నుంచి తీసుకురాగా, చుట్టు పక్కల గ్రామాల నుంచి మరో 2 వేలమందిని పట్టుకొచ్చారు. టౌన్​నుంచి వచ్చిన వారికి ఒక్కొక్కరికి రూ.500  చొప్పున, రూరల్​ నుంచి వచ్చినవారికి రూ.650 చొప్పున మొత్తంగా ఒకేరోజు రూ. 18 లక్షలు ఖర్చు పెట్టినట్లు పార్టీవర్గాలు చెప్పుకుంటున్నాయి.

ఇదే నల్గొండ జిల్లాలో ఓ నేషనల్​ పార్టీ  తన గ్రాడ్యుయేట్ క్యాండిడేట్​ పరిచయం పేరిట ఓ మీటింగ్​ పెట్టింది. ఇందుకు రూ.80 వేలు ఖర్చయింది. ఆ మొత్తం ఎవరు పెట్టుకోవాలనేదానిపై లీడర్లు కిందా మీద పడ్డరు. చివరికి  పార్టీ టౌన్ ప్రెసిడెంట్ రూ. 40 వేలు పెట్టుకుంటే.. ఇంకో రూ.20 వేలు జిల్లా ప్రెసిడెంట్ భరించిండు. మరో రూ.20 వేలు మరో లీడర్​ నెత్తిన వేసిన్రు. మొత్తం మీద ఓ చిన్న ఫంక్షన్ హాల్​లో సాదాసీదాగా ప్రోగ్రామ్​ ముగించిన్రు. ఖర్చు ఎక్కడ పెట్టుకోవాల్సి వస్తదోనని కొందరు ముఖ్య లీడర్లు ఈ మీటింగ్​కు ఎగ్గొట్టిన్రని పార్టీలో మాట్లాడుకుంటన్రు.

నల్గొండ, వెలుగు : ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఎట్లన్న గెలవాలని కంకణం కట్టుకున్న రూలింగ్​ పార్టీ  పెద్ద మొత్తంలో ఖర్చు పెడుతుండగా, ఆ స్థాయిలో ఖర్చు పెట్టలేని మిగిలిన క్యాండిడేట్లు  ప్రభుత్వ వ్యతిరేకతపైనే ఆశలు పెట్టుకొని ప్రచారం చేస్తున్నారు. గ్రాడ్యుయేట్లు ఆలోచనాపరులు కనుక సామాన్య ఓటర్ల మాదిరి ఓట్లకు నోట్లు పంచాల్సిన పనిలేదని భావిస్తున్నారు. అయినప్పటికీ గత అనుభవాలు మిగిలిన క్యాండిడేట్లను ఒకింత ఆందోళనకు గురిచేస్తున్నాయి. అదీగాక ప్రచారానికి వెళ్లేటప్పుడు వెంట పది మంది రావాలన్నా వాళ్ల ఖర్చే లక్షల్లో ఉంటోందని క్యాండిడేట్లు అంటున్నారు. ‘అభిమానం అభిమానమే.. లెక్క లెక్కే’ అన్నట్లుగా అనుచరుల పరిస్థితి ఉండడంతో కొన్ని నెలల నుంచి ప్రచారం చేస్తున్న పలువురు అభ్యర్థుల చేతి చమురు వదులుతోంది. పెద్దల సభకు వెళ్లాలన్నా పెట్టుబడి పెట్టక తప్పట్లేదనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.

రూలింగ్​ పార్టీ భారీ ఖర్చు..

వరంగల్, ఖమ్మం, నల్గొండ సిట్టింగ్​ఎమ్మెల్సీ స్థానాన్ని ఎట్టి పరిస్థితుల్లో వదులుకోవద్దని రూలింగ్​ పార్టీ భావిస్తోంది. ఈ క్రమంలో టీఆర్​ఎస్​ నుంచి బరిలో ఉన్న పల్లా రాజేశ్వర్​రెడ్డి కరోనా టైం నుంచే సీరియస్​గా గ్రౌండ్​ వర్క్​ చేసుకుంటున్నారు. ప్రభుత్వ, ప్రైవేట్​ కాలేజీలు, స్కూళ్లలోని లెక్చరర్లు, టీచర్లు, గ్రాడ్యుయేట్లను ఆయన ప్రధానంగా టార్గెట్​ చేశారు. ఆయా వర్గాలతో ఒక్క ఉమ్మడి వరంగల్​ జిల్లాలోనే ఇప్పటికి వందకు పైగా  మీటింగులు  నిర్వహించారని పార్టీ వర్గాలు​ అంటున్నాయి. మిగిలిన రెండు ఉమ్మడి జిల్లాలో 50 మీటింగుల వరకు పెట్టినట్లు తెలుస్తోంది.  తక్కువలో తక్కువ ఒక్కో మీటింగ్​కు లక్షకు పైగా ఖర్చు చేసినట్లు సమాచారం. ఇలా లక్షలకు లక్షలు ఖర్చు చేసి మీటింగులు పెట్టేందుకు మిగిలిన పార్టీల అభ్యర్థులు వెనుకాడుతున్నారు. అందుకే ఒకటి, రెండు మీటింగులతో సరిపెట్టుకొని కొన్ని నెలలుగా ఇంటింటి ప్రచారం కొనసాగిస్తున్నారు.  బీజేపీ క్యాండేట్​ గుజ్జుల ప్రేమేందర్​రెడ్డి, టీజేఎస్​అధినేత కోదండరామ్, రాణిరుద్రమ రెడ్డి, చెరుకు సుధాకర్, తీన్మార్​మల్లన్న ​తదితరులంతా గ్రాడ్యుయేట్లను  నేరుగా కలిసేందుకే మొగ్గుచూపుతున్నారు. లేట్​గా ఎంట్రీ ఇచ్చిన కాంగ్రెస్​ క్యాండిడేట్​ రాములునాయక్​ది కూడా ఇదే పరిస్థితి. తీన్మార్​ మల్లన్న అయితే మూడు పాత జిల్లాల పరిధిలో పాదయాత్ర నిర్వహించారు.

బయటికి ధీమా..లోన భయం

ఈ ఎన్నికల్లో క్యాండిడేట్లు చేసే ఖర్చు ఎన్నికల కమిషన్​ పరిధిలోకి రాకపో వడం అధికార పార్టీకి కలిసి వస్తోందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. జీహెచ్ఎంసీ, దుబ్బాక ఎన్నికల్లో దెబ్బతిన్న అనుభవం, గ్రాడ్యుయేట్లలో ప్రభుత్వ వ్యతిరేకత తీవ్రంగా ఉందనే సమాచారంతో ఎమ్మెల్సీ ఎన్నికల్లోనూ టీఆర్ఎస్​ భారీగా ఖర్చు పెడుతోంది. రూలింగ్​ పార్టీ చివరి నిమిషంలో ఓటర్లను ప్రలోభాలకు గురిచేసే చాన్స్​ కూడా ఉందని ఇతర పార్టీల అభ్యర్థులు, ఇండిపెండెంట్లు లోలోన గుబులు పడుతున్నారు. గత ఎమ్మెల్సీ ఎలక్షన్స్​లో కొన్నిచోట్ల ఓటుకు రూ.5వేల చొప్పున పంచారని, కొన్ని టీచర్, ఉద్యోగ సంఘాలకు పార్టీలు, గిఫ్టుల పేరిట భారీగా ముట్టజెప్పారని వార్తలు వచ్చాయి. ఈసారి కూడా అలాంటి ప్రమాదం ఉందని ఇతర పార్టీల అభ్యర్థులు భయపడుతున్నారు. ఇదీగాక టీఆర్ఎస్​తో పాటు కాంగ్రెస్​, బీజేపీ  ప్రతి 25 నుంచి 50 మందికి ఒక ఇన్​చార్జిని పెట్టి ఓటర్ల వివరాలు, ఫోన్​నంబర్లు, మెయిల్​ ఐడీ సేకరిస్తున్నారు. ఓటర్లను మోటివేట్​ చేయడం మొదలుకొని పోలింగ్ బూత్ తీసుకెళ్లే బాధ్యతలను ఈ ఇన్​చార్జిలకు అప్పగించారు. ఈ ఇన్​చార్జిల రూపంలోనూ ఆయా పార్టీలు పెద్దమొత్తంలోనే ఖర్చు చేస్తున్నాయి. మిగిలిన పార్టీల క్యాండిడేట్లకు ఈ ఇన్​చార్జి వ్యవస్థ లేకపోవడంతో ఇది తమ ఓట్లపై ఎక్కడ ప్రభావం చూపుతుందోననే ఆందోళన కనిపిస్తోంది.  ఎవరు ఎంత ఖర్చు పెట్టినా, చివరకు గ్రాడ్యుయేట్లు విచక్షణతో ఓటువేసి తమను గెలిపిస్తారని వివిధ పార్టీల క్యాండిడేట్లు, ఇండిపెండెంట్లు  ధీమా వ్యక్తం చేస్తున్నారు.