
- గత నెల 5 శాతమే పెరుగుదల
- పీవీలు, టూవీలర్లకు ఎక్కువ డిమాండ్
న్యూఢిల్లీ: మనదేశంలో ఆటోమొబైల్ రిటైల్ అమ్మకాలు గత నెలలో ఏడాది లెక్కన దాదాపు 5 శాతం పెరిగాయి. ప్యాసింజర్ వెహికల్స్, టూవీలర్స్ సహా అన్ని వాహన విభాగాలు వృద్ధిని సాధించాయని ఫెడరేషన్ ఆఫ్ ఆటోమోటివ్ డీలర్స్ అసోసియేషన్స్ (ఫాడా) సోమవారం తెలిపింది. గత నెలలో మొత్తం ఆటోమొబైల్ రిజిస్ట్రేషన్లు 20,03,873 యూనిట్లు కాగా, జూన్ 2024లో 19,11,354 యూనిట్లు అమ్ముడయ్యాయి. ఏడాది లెక్కన వీటి సంఖ్య 4.84 శాతం పెరిగింది. ప్యాసింజర్ వెహికల్ (పీవీ) రిటైల్ అమ్మకాలు గత నెలలో 2 శాతం పెరిగి 2,97,722 యూనిట్లకు చేరుకున్నాయి.
గత సంవత్సరం ఇదే కాలంలో ఇవి 2,90,593 యూనిట్లు అమ్ముడుపోయాయి. భారీ వర్షాలు రావడం, మార్కెట్ లిక్విడిటీ తగ్గడం అమ్మకాలపై ఎఫెక్ట్పడిందని ఫాడా ప్రెసిడెంట్ విఘ్నేశ్వర్ తెలిపారు. పన్ను భారం, ఏసీ క్యాబిన్లను తప్పనిసరి చేయడం వల్ల సీవీల అమ్మకాలు కొంతమేర తగ్గాయన్నారు. కొన్ని పీవీ ఓఈఎంలు ఆటోమేటిక్ హోల్‌సేల్ డెబిట్స్ వంటి బిల్లింగ్ విధానాలను ప్రవేశపెట్టాయని, ఫలితంగా ఇన్వెంటరీ దాదాపు 55 రోజుల స్థాయికి పెరిగిందని ఆయన వివరించారు. ‘‘ఈసారి వర్షాలు బాగా పడే అవకాశం ఉన్నందున గ్రామీణ డిమాండ్ పెరగవచ్చు. దీనివల్ల ఆటోమొబైల్ రంగానికి ప్రయోజనం ఉంటుంది.
ఈసారి ఖరీఫ్ ప్రారంభంలో విత్తనాలు వేయడం, సంవత్సరానికి 11 శాతం పెరిగి 262.15 లక్షల హెక్టార్లకు చేరుకుంది. దీనిని బట్టి చూస్తే వ్యవసాయ ఆదాయాలు పెరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. లోతట్టు ప్రాంతాలలో టూవీలర్లకు గిరాకీ పెరగవచ్చు. అయితే భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు, యూఎస్ టారిఫ్‌లు కస్టమర్ సెంటిమెంట్‌ను దెబ్బతీయవచ్చు”అని ఫాడా పేర్కొంది.
ఐదు శాతం పెరిగిన టూవీలర్ సేల్స్
ఈసారి జూన్‌లో టూవీలర్ రిటైల్ సేల్స్ ఏడాది లెక్కన 5 శాతం పెరిగి 14,46,387 యూనిట్లకు చేరుకున్నాయి. కమర్షియల్ వెహికల్(సీవీ) రిజిస్ట్రేషన్లు ఏడు శాతం పెరిగి 73,367 యూనిట్లకు చేరుకున్నాయి. త్రీ-వీలర్ రిటైల్‌లు గత నెలలో 7 శాతం పెరిగి 1,00,625 యూనిట్లకు చేరుకోగా, ట్రాక్టర్ రిజిస్ట్రేషన్లు 9 శాతం పెరిగి 77,214 యూనిట్లకు చేరుకున్నాయి. ఏప్రిల్–-జూన్ కాలంలో, మొత్తం రిటైల్ అమ్మకాలు గత ఆర్థిక సంవత్సరం ఇదే కాలంలో 62,39,877 యూనిట్లతో పోలిస్తే 5 శాతం పెరిగి 65,42,586 యూనిట్లకు చేరుకున్నాయి.
పీవీ అమ్మకాలు గత ఆర్థిక సంవత్సరం ఇదే కాలంలో 3 శాతం పెరిగి 9,71,477 యూనిట్లకు చేరుకున్నాయి. టూవీలర్ రిజిస్ట్రేషన్లు సంవత్సరానికి 5 శాతం పెరిగి 47,99,948 యూనిట్లకు చేరుకున్నాయి. ఏప్రిల్–-జూన్ కాలంలో సీవీ, త్రీ వీలర్ రిటైల్ అమ్మకాలు వరుసగా 1 శాతం, 12 శాతం పెరిగాయి. మొదటి క్వార్టర్లో ట్రాక్టర్ రిజిస్ట్రేషన్లు సంవత్సరానికి 6 శాతం పెరిగి 2,10,174 యూనిట్లకు చేరుకున్నాయి.