‘ఆర్ఎఫ్ సీఎల్’ దందాలో కొప్పుల ఈశ్వర్, కోరుకంటి చందర్ హస్తం 

‘ఆర్ఎఫ్ సీఎల్’ దందాలో కొప్పుల ఈశ్వర్, కోరుకంటి చందర్ హస్తం 

ధర్మారం : రామగుండం ఫర్టిలైజర్స్ అండ్ కెమికల్స్ లిమిటెడ్ (ఆర్ఎఫ్ సీఎల్) కొలువుల దందాలో మంత్రి కొప్పుల ఈశ్వర్, రామగుండం ఎమ్మెల్యే కోరుకంటి చందర్ హస్తం ఉందని కాంగ్రెస్ సీనియర్ నేత, ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి ఆరోపించారు. ఎమ్మెల్యే కోరుకంటి చందర్ ను టీఆర్ఎస్ పార్టీ నుండి వెంటనే సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు. రేపు పెద్దపల్లి జిల్లాలో పర్యటించనున్న సీఎం కేసీఆర్.. ఆర్ఎఫ్ సీఎల్ బాధితులకు సరైన సమాధానం చెప్పాలన్నారు. రాష్ట్రంలో పోలీస్ వ్యవస్థ.. టీఆర్ఎస్ పార్టీకి అనుబంధ సంస్థగా మారిందన్నారు. ఆర్ఎఫ్ సీఎల్ బాధితులకు రూ.50 కోట్లు తిరిగి ఇప్పించే బాధ్యత సీఎం కేసీఆర్ దే అన్నారు.

ఆత్మహత్య చేసుకున్న హరీష్ కుటుంబానికి రాష్ట్ర ప్రభుత్వం తరపున కోటి రూపాయల ఆర్థిక సాయం అందజేయాలని ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి డిమాండ్ చేశారు. గోదావరి ఖని కార్మిక క్షేత్రంలో మావోయిస్టుల అలజడికి రాష్ట్ర ప్రభుత్వమే బాధ్యత వహించాలన్నారు. కరీంనగర్ జిల్లా కేశవపట్నం మండలం అంబాల్ పూర్ గ్రామానికి చెందిన ముంజ హరీష్.. ఆత్మహత్య చేసుకున్న విషయం తెలిసిందే. ఆర్ఎఫ్ సీఎల్ లో కాంట్రాక్టు ఉద్యోగం కోసం దళారులకు రూ.7 లక్షలు ఇచ్చి చేరాడు. ఐదు నెలలు పని చేయగానే కొత్త కాంట్రాక్ట్ సంస్థ ఉద్యోగంలో నుంచి తొలగించింది. దీంతో కలత చెందిన హరీష్ ఆత్మహత్య చేసుకున్నాడు.