బీసీ ఐక్యవేదిక ఓబీసీ సమావేశంలో ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు

బీసీ ఐక్యవేదిక ఓబీసీ సమావేశంలో ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు

ఉమ్మడి  కరీంనగర్ జిల్లాలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో నిర్వహించిన బీసీ ఐక్యవేదిక ఓబీసీ సమావేశంలో ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. 60 శాతం ఉన్న బలహీన వర్గాల అండ లేనిది ఏ రాజకీయ పార్టీకి మనుగడ లేదని వ్యాఖ్యానించారు. తెలంగాణ  ప్రభుత్వం వచ్చి దశాబ్ద కాలం గడిచినా బీసీలకు చేసిందేమీ లేదన్నారు. రాబోయే ఎన్నికల్లో బలహీన వర్గాలకు సముచిత స్థానం కల్పించాలని డిమాండ్ చేశారు. హైదరాబాద్ జిల్లాలోని నియోజకవర్గాలను మినహాయించి.. మిగిలిన 81 నియోజకవర్గాల్లో 50శాతం టికెట్లు బీసీలకే ఇవ్వాలని కోరారు. 

బీఆర్ఎస్ లో బీసీ యాక్షన్ ప్లాన్ జీరో అని చెప్పారు ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి. ఎన్నికల కోసం సీఎం కేసీఆర్ బీసీలకు లక్ష రూపాయల ఆర్థికసాయం అనే పథకాన్ని ప్రవేశపెట్టారని చెప్పారు. తెలంగాణలో ప్రస్తుతం ఉన్న 20 మంది మంత్రుల్లో ముగ్గురు మాత్రమే బీసీలు ఉన్నారని ఆందోళన వ్యక్తం చేశారు. కాంగ్రెస్ ఓబీసీ సమావేశానికి మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్ గైర్హాజరయ్యారు. ఎన్నికల కమిటీలో పొన్నం ప్రభాకర్ కు స్థానం కల్పించకపోవడం బాధాకరమని పలువురు కాంగ్రెస్ నాయకులు వ్యాఖ్యానించారు. 

కేంద్రంలో అగ్రవర్ణ పేదలకు ప్రధాని మోదీ 10 శాతం రిజర్వేషన్లు తీసుకొచ్చారని, తెలంగాణ రాష్ట్రంలోనూ కేసీఆర్ వాటిని అమలు చేస్తున్నారని చెప్పారు ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి. తమ వర్గం వాళ్లు (రెడ్డి) 5 శాతమే ఉంటే విద్యా, ఉద్యోగాల్లో 10శాతం రిజర్వేషన్ కల్పించారని చెప్పారు. బీసీలు మాత్రం 60 శాతం ఉంటే రిజర్వేషన్ కేవలం 25 శాతం మాత్రమే కల్పించారని చెప్పారు. 20 మంది మంత్రుల్లో బీసీలు ముగ్గురే ఉన్నారని, మిగతా వాళ్లంతా రెడ్డి, వెలమ దొరలే ఉన్నారని వ్యాఖ్యానించారు. బీసీలు కేవలం ఎమ్మెల్యే సీట్ల కోసమే కాకుండా..  భవిష్యత్తులో రాజ్యాధికారం ‌కోసం పోరాడాలని పిలుపునిచ్చారు.