కొనుగోలు కేంద్రాల్లో క్వింటాల్ వడ్లకు ఏడున్నర కిలోలు కోత పెడుతున్నారు:ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి

కొనుగోలు కేంద్రాల్లో క్వింటాల్ వడ్లకు ఏడున్నర కిలోలు కోత పెడుతున్నారు:ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి

చొప్పదండి, వెలుగు:  టీఆర్ఎస్ పాలనలో రైతులు వడ్లు పండించడం కన్న కొనుగోలు కేంద్రాలలో వడ్లను అమ్ముకునేందుకే ఎక్కువ కష్టాలు పడుతున్నారని ఎమ్మెల్సీ టి.జీవన్​రెడ్డి, మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్ ఆవేదన వ్యక్తం చేశారు. పీసీసీ అధ్యక్షుడు రేవంత్​రెడ్డి పిలుపు మేరకు రైతుల సమస్యలపై చొప్పదండి నియోజక వర్గం కాంగ్రెస్ ఇంచార్జి మేడిపల్లి సత్యం ఆధ్వర్యంలో రైతు ధర్నా నిర్వహించారు. చొప్పదండిలోని ఎన్టీఆర్ విగ్రహం నుంచి తహసీల్దార్ ఆఫీసు వరకు కాంగ్రెస్ నాయకులు, రైతులు ర్యాలీగా వెళ్లి తహసీల్దార్​కు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా జీవన్​రెడ్డి మాట్లాడుతూ.. రాష్ట్రంలో రైస్ మిల్లర్ల దోపిడీ పెరిగిపోతోందన్నారు. కొనుగోలు కేంద్రాలకు వచ్చిన ధాన్యాన్ని తూకం వేసేటప్పుడు క్వింటాల్​కు ఏడున్నర కిలోలు కోత పెడుతున్నారని ఆరోపించారు. ‘‘జిల్లాకు చెందిన పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ ఎన్నడన్న కొనుగోలు కేంద్రాలు చూశాడా.. అక్కడ రైతులు పడుతున్న కష్టం గురించి తెలుసా?’’ అని ప్రశ్నించారు. కాంగ్రెస్ అధికారంలోకి రాగానే మళ్లీ కళ్లాల వద్దనే ధాన్యం కొంటామన్నారు. టీఆర్ఎస్ ప్రభుత్వం చేస్తున్నది రుణమాఫీ కాదని వడ్డీ మాఫీ పథకమన్నారు. 

టీఆర్ఎస్ నేతలకూ వాటా ఉందా? 

రైతులకు లాభం చేకూర్చిన పార్టీ కాంగ్రెస్ అని అన్నారు. రైతుల వడ్లను తూకం వేసేటప్పుడు అడ్డగోలుగా కోతలు పెడుతుంటే టీఆర్ఎస్ నాయకులు ఎందుకు పట్టించుకోవడం లేదు? ఇందులో వారికి కూడా వాటా ఉందా? అని మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్  ప్రశ్నించారు. నియోజకవర్గ ప్రజలను ఎంపీ, ఎమ్మెల్యే పట్టించుకోవడం లేదన్నారు. కార్యక్రమంలో జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ కోమటిరెడ్డి పద్మాకర్​రెడ్డి, మండల కాంగ్రెస్ అధ్యక్షుడు ఇప్ప శ్రీనివాస్​రెడ్డి, జిల్లా మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు కర్ర సత్యప్రసన్న తదితరులు పాల్గొన్నారు.