కేసీఆర్‌కి సీఎం పదవి అంబేద్కర్ బిక్షే

కేసీఆర్‌కి సీఎం పదవి అంబేద్కర్ బిక్షే

తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు మార్గం చూపింది.. నూతన రాష్ట్రాల ఏర్పాటు ఆర్టికల్ 3ను కేంద్రం పరిధిలోకి వచ్చేలా చేసింది అంబేద్కరే అని కాంగ్రెస్ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి అన్నారు.
సామాజిక తెలంగాణ నిర్మాణం కాకుండా పెట్టుబడి వర్గాల కోసం సీఎం కేసీఆర్ కొమ్ముకాస్తున్నారని ఆయన మండిపడ్డారు. అంబేద్కర్ జయంతి సందర్భంగా జీవన్ రెడ్డి అసెంబ్లీ మీడియా పాయింట్ వద్ద మాట్లాడారు. ‘కేసీఆర్‌కి సీఎం పదవి అంబేద్కర్ బిక్షే. ఎన్ని ఇబ్బందులు వచ్చినా కూడా యూపీఏ సర్కార్ తెలంగాణ రాష్ట్రం ఇచ్చింది. 125 అడుగుల ఎత్తుతో విగ్రహాన్ని ఏర్పాటు చేస్తామని చెప్పి ఐదేండ్లు గడిచింది. ప్రగతి భవన్ పనులు ఏడాదిలో ముగిశాయి. కొత్త సచివాలయం ఏడాదిలో పూర్తయ్యేలా పనులు చేస్తున్నారు. సీఎం కేసీఆర్‌కు అంబేద్కర్ విగ్రహానికి కనీసం దండేసే టైం కూడా దొరకడం లేదు. విగ్రహ నిర్మాణ పనులు అసలు ఎప్పుడు మొదలవుతాయో చెప్పాలి. ఇప్పటి వరకు అగ్రిమెంట్ పూర్తయిందని చెప్పడం సిగ్గు చేటు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుతో యువతకు ఉపాధి అవకాశాలు వస్తాయని భావించారు. కేయూ విద్యార్ధి సునీల్ నాయక్ చనిపోవడం సర్కారుకే సిగ్గు చేటు. సాగర్‌లో రవికుమార్ దంపతుల ఆత్మహత్య, నల్గొండలో శైలజ ఆత్మహత్య చేసుకోవడం దారుణం. విద్యావాలంటరీ వ్యవస్థ కూడా జీతాలు లేక రోడ్డున పడింది. ఫీల్డ్ అసిస్టెంట్‌లు, కాంట్రాక్టు, అవుట్ సోర్సింగ్ సిబ్బంది కూడా కరోనా దెబ్బకు రోడ్డున పడ్డారు. నిరుద్యోగ భృతి ఇస్తామని సీఎం మోసం చేసిండు. ఏడాదికి పది వేల కోట్లు కేటాయిస్తే.. బడుగు బలహీన వర్గాల యువతకు నిరుద్యోగ భృతి ద్వారా భరోసా ఇచ్చినట్లు అవుతుంది’ అని ఆయన అన్నారు.