ఢిల్లీ లిక్కర్ స్కాం: ఇండో స్పిరిట్ కంపెనీలో కవితకు 32 శాతం వాటా

ఢిల్లీ లిక్కర్ స్కాం: ఇండో స్పిరిట్ కంపెనీలో కవితకు 32 శాతం వాటా

ఢిల్లీ లిక్కర్ స్కాంలో ఈడీ మరో చార్జిషీట్ ను దాఖలు చేసింది. ఈ కుంభకోణంలో ఇండోస్పిరిట్ కంపెనీ నిర్వాహకుడు సమీర్ మహేంద్రు  పాత్రపై  మొత్తం 181 పేజీలతో ఈ కొత్త చార్జిషీట్ ను ఈడీ దాఖలు చేసింది. ఇందులోనూ  ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత , మాగుంట శ్రీనివాసులు రెడ్డి, మాగుంట రాఘవ రెడ్డి, ఎం.గౌతమ్, అరుణ్ రామచంద్ర పిళ్లై, బోయినపల్లి అభిషేక్ రావు పేర్లను  ఈడీ ప్రస్తావించింది. చార్జిషీట్ లోని 95, 96, 125వ పేజీల్లో కవిత పేరును  ఈడీ అధికారులు ప్రస్తావించారు. 

ఇండోస్పిరిట్ కంపెనీకి ఢిల్లీలో ఎల్1 లైసెన్సుతో వచ్చిన షాపుల్లో కవితకు వాటా ఉందని ఈడీ పేర్కొంది. సమీర్ కంపెనీ ఇండోస్పిరిట్ లో కవితకు 32 శాతం వాటా ఉన్నట్లు అభియోగం నమోదు చేసింది. మాగుంట శ్రీనివాసులురెడ్డికి కూడా  ఈ కంపెనీలో వాటా ఉందని పేర్కొంది. ఢిల్లీ లిక్కర్ స్కాం వల్ల  ఇండో స్పిరిట్ కంపెనీకి అక్రమంగా రూ.192.8 కోట్లు లాభం వచ్చిందని చార్జిషీట్ లో ఈడీ పేర్కొంది. లిక్కర్ స్కాం కుట్ర ద్వారా సంపాదించిన  ఈ  ఆదాయంలో ఎక్కువ భాగం కవిత, మాగుంట శ్రీనివాసులు రెడ్డికే పోయిందని ఆరోపించింది. లిక్కర్ స్కాం కు సంబంధించి ఢిల్లీలోని ఒబెరాయ్ హోటల్ లో మాగుంట శ్రీనివాసులు రెడ్డి ఏర్పాటుచేసిన మీటింగ్ లో కవితతో పాటు అమిత్ అరోరా, దినేశ్ అరోరా, సమీర్ మహీంద్రు పాల్గొన్నారని ఈడీ చార్జిషీట్ లో ప్రస్తావించింది. కవిత వాడిన ఫోన్ల వివరాలను, వాటిని ఐఎంఈఐ నంబర్లను కూడా ఈడీ ప్రస్తావించింది. ఫోన్లను ధ్వంసం చేసిన అంశాన్ని కూడా చార్జిషీట్ లో పెట్టారు.  కాగా, ఇదే కేసులో గతంలో అమిత్ అరోరా రిమాండ్ రిపోర్టులో కల్వకుంట్ల కవిత పేరును ప్రస్తావించారు.