తెలంగాణలో బీఆర్​ఎస్​ బాధ్యతలు ఎవరికనేది సస్పెన్స్​ : కవిత 

తెలంగాణలో బీఆర్​ఎస్​ బాధ్యతలు ఎవరికనేది సస్పెన్స్​ : కవిత 

తెలంగాణలో బీఆర్​ఎస్​ పార్టీ బాధ్యతలు ఎవరికిస్తారు అన్నది సస్పెన్స్ అని ఎమ్మెల్సీ కవిత వ్యాఖ్యానించారు. తెలంగాణ సెంటిమెంట్ తో తాము అధికారంలోకి రాలేదన్నారు. BRSలో తెలంగాణ పేరు లేదు.. కానీ ప్రజల గుండెల్లో కేసీఆర్  ఉన్నారని పేర్కొన్నారు. ఆంధ్ర ప్రజల్ని తాము తిట్టలేదని.. కేవలం లీడర్లనే తిట్టామని మీడియాతో చిట్ చాట్ లో కవిత చెప్పారు. లిక్కర్ స్కాం విచారణ ఇంకా కోర్టు పరిధిలో ఉంది కాబట్టే ఏం మాట్లాడలేమన్నారు. సీఎం కేసీఆర్​ పనితనం వల్లే తాము రెండుసార్లు అధికారంలోకి వచ్చామని కవిత అన్నారు.  

మమత ను అవమానిస్తే ప్రజలు ఫలితం చూపించారు

బండి సంజయ్ నుంచి బీజేపీలోని ముఖ్య నాయకుల  వరకు అందరూ మహిళలను అగౌరవ పరుస్తున్నారని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. బెంగాల్ లో మమత ను అవమానిస్తే అక్కడి ప్రజలు ఎన్నికల్లో ఫలితం చూపించారని తెలిపారు. బతుకమ్మ గురించి అసహ్యంగా మాట్లాడటం బాధగా ఉందని, బతుకమ్మ బుర్జ్ ఖలీఫా పైకి ఊకెనే ఎక్కిందా అని ప్రశ్నించారు. బీఆర్​ఎస్​ పెట్టంగనే బీజేపీ నేతలకు బ్రెయిన్ ఖరాబ్ అయ్యిందని కామెంట్​ చేశారు. బీజేపీకి బీఆర్​ఎస్​ ఆల్టర్నేట్ అవుతుందన్నారు. బండి సంజయ్ ఆ పదవికి కళంకం తెస్తున్నారని.. బీజేపీ వాళ్లు తప్పులు చేసి గుడులకు పోతున్నారని.. తాము మాత్రం మంచి కోసం పోతమని చెప్పారు. 

నిర్మలా సీతారామన్​ వీక్ రూపీ గురించి మాట్లాడి ఉండాల్సింది

పార్లమెంటులో నిర్మలా సీతారామన్ వీక్ హిందీ గురించి మాట్లాడారని.. కానీ వీక్ రూపీ గురించి మాట్లాడితే బాగుండేదన్నారు ఎమ్మెల్సీ కవిత. అడిగిన వ్యక్తి గురించి మాట్లాడకుండా ప్రశ్నకు సమాధానం చెప్తే బాగుండేదన్నారు. తెలంగాణకు పసుపు బోర్డ్ రాకుండా చేసింది నిర్మలా సీతారామనే అని ఆరోపించారు. తనకు దేశంలోని అన్ని రాష్ట్రాలతో సంబంధం ఉందన్నారు. తెలంగాణలో తెలంగాణ జాగృతి ఉంటుందని, మిగతా రాష్ట్రాల్లో భారత్ జాగృతి ఉంటుందని తెలిపారు. ఆంధ్రలో అట్లతద్దె.. మిగతా రాష్ట్రాల్లో అక్కడి పండుగలు, సంస్కృతి సంప్రదాయాల కోసం జాగృతి పనిచేస్తుందన్నారు కవిత. తమకు జాతీయ వాదం ముసుగు అవసరం లేదన్నారు.

వైఎస్సార్టీపీ, టీడీపీ, బీఎస్పీ .. బీజేపీ విడిచిన బాణాలే

షర్మిలను తెలంగాణలో ఎవరూ సీరియస్ గా తీసుకోవటంలేదన్నారు కవిత. ఎవరైనా లిమిట్ లో ఉండాలని.. అందుకే షర్మిలా పాల్ అంటున్నారని ఎద్దేవా చేశారు. అందరినీ కలిపి బీజేపీని గద్దె దించటం కోసమే బీఆర్​ఎస్​ పెట్టామన్నారు. కాంగ్రెస్ తో కలవాల్సి ఉంటుందా ? లేదా? అనేది పరిస్థితులను బట్టి బీఆర్​ఎస్​ పార్టీలో చర్చించి నిర్ణయం తీసుకుంటామని చెప్పారు కవిత. బీజేపీని వ్యతిరేకించే విషయంలో కేసీఆర్ వెనకడుగు వేయడని.. బరి గీసి కొట్లాడతారని చెప్పారు. బీఆర్ఎస్​ తో బీజేపీకి లాభం జరుగుతుందనే వాదన తప్పన్నారు. వైఎస్సార్టీపీ, టీడీపీ, బీఎస్పీ అన్ని పార్టీలు బీజేపీ విడిచిన బాణాలేనన్నారు. ఎంపీ అర్వింద్ ఎక్కడ పోటీచేసినా అక్కడ ఆయన ఓటమి కోసం ప్రచారం చేస్తానని కవిత వ్యాఖ్యానించారు.