కులగణనకు చట్టబద్ధత కల్పించాలి : ఎమ్మెల్సీ కవిత 

కులగణనకు చట్టబద్ధత కల్పించాలి : ఎమ్మెల్సీ కవిత 

హైదరాబాద్, వెలుగు: కుల గణనకు చట్టబద్ధత కల్పించాలని బీఆర్‌‌‌‌ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. కుల గణన ఎప్పటిలోగా పూర్తి చేస్తారో కూడా ప్రభుత్వం ప్రకటించాలన్నారు. శనివారం హైదరాబాద్‌‌ బంజారాహిల్స్‌‌లోని తన నివాసంలో పార్టీ నాయకులు మధుసూదన చారి, పొన్నాల లక్ష్మయ్య తదితరులతో కలిసి ఆమె మీడియాతో మాట్లాడారు.

కులగణనపై అసెంబ్లీలో ప్రభుత్వం పెట్టిన తీర్మానంలో స్పష్టత లేదన్నారు. తలాతోక లేని తీర్మానం చేయడం పట్ల తాము తీవ్ర నిరసన తెలియజేస్తున్నామని ఆమె ప్రకటించారు. సమగ్ర కుటుంబ సర్వే వివరాలు ఒకే కుటుంబ దగ్గర ఉన్నాయని సీఎం రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలను  కవిత తప్పుబట్టారు. 2011లో దేశవ్యాప్తంగా చేపట్టి కులగణన వివరాలు గాంధీ కుటుంబం దాచిపెట్టుకుందా అని ఆమె ప్రశ్నించారు.

కులగణన చేసిన తర్వాత మూడేళ్ల పాటు యూపీఏ అధికారంలో ఉందని అయినా ఆ నివేదికను బహీర్గతం చేయలేదన్నారు. కాంగ్రెస్ ఇచ్చిన హామీలనే అమలు చేయాలని తాము అడుగుతున్నామని చెప్పారు. ఎమ్మెల్సీ మధుసూదన్ చారి మాట్లాడుతూ.. బ్రిటీష్ హయాంలో 1931లో చివరిసారిగా కులగణన జరిగిందని, కానీ స్వతంత్ర భారత దేశంలో వెనుకబడిన వర్గాల లెక్కలు తీయకపోడం దారుణమన్నారు.

బీసీలకు రావాల్సిన న్యాయపరమైన వాటా రావాలని పదేపదే అడుగుతున్నా కూడా ప్రభుత్వాలు పట్టించుకోకపోవడం బాధాకరమన్నారు. స్థానిక సంస్థల ఎన్నికల ముందే కులగణన ప్రక్రియను పూర్తి చేయాలన్నారు. కులగణనకు చట్టబద్ధత కల్పించి ప్రభుత్వం చిత్తశుద్ధిని నిరూపించుకోవాలన్నారు.