కేజ్రీవాల్​తో కవిత మంతనాలు

కేజ్రీవాల్​తో కవిత మంతనాలు

న్యూఢిల్లీ, వెలుగు: ఢిల్లీ లిక్కర్ స్కామ్​లో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితనే ప్రధాన సూత్రధారి అని, ఢిల్లీ సీఎం కేజ్రీవాల్​తో కలిసి ఆమె కుట్ర పన్నారని సీబీఐ పేర్కొంది. కవితను కస్టడీలోకి తీసుకొని విచారిస్తే మరిన్ని అంశాలు బయటకు వస్తాయని స్పష్టం చేసింది. ఈ మేరకు కస్టడీ అప్లికేషన్​ను రౌస్​ ఎవెన్యూలోని స్పెషల్​ కోర్టులో శుక్రవారం దాఖలు చేసింది. విచారించిన కోర్టు.. కవితను 3 రోజుల సీబీఐ కస్టడీకి అనుమతించింది. 11 పేజీల కస్టడీ అప్లికేషన్​లో సీబీఐ సంచలన విషయాలను వెల్లడించింది. లిక్కర్ పాలసీ రూపకల్పన మొదలు, స్కామ్​లో పలువురి పాత్ర, కేసు దర్యాప్తులో సేకరించిన ఆధారాలు, సహ నిందితుల స్టేట్​మెంట్లను పొందుపరిచింది. 

తమ దర్యాప్తులో భాగంగా సౌత్ గ్రూప్ కు చెందిన లిక్కర్ వ్యాపారి 2021  మార్చి 16న ఢిల్లీ సీఎం అర్వింద్ కేజ్రీవాల్ ను ఆయన ఆఫీసులో కలిశారని సీబీఐ పేర్కొంది. ఢిల్లీలో లిక్కర్ బిజినెస్ చేసేందుకు తాను సుముఖంగా ఉన్నట్లు ఆ వ్యాపారి సీఎంకు వెల్లడించారని, ఈ విషయంలో తెలంగాణ ఎమ్మెల్సీ కవిత మిమ్మల్ని సంప్రదిస్తారని కేజ్రీవాల్ సూచించారని తెలిపింది. అలాగే తమ పార్టీ(ఆమ్​ ఆద్మీ పార్టీ)కి కావాల్సిన నిధులు ఎలా మళ్లించాలో కూడా కవితే వివరిస్తారని లిక్కర్​ వ్యాపారితో కేజ్రీవాల్ చెప్పినట్లు పేర్కొంది. 

ఇందుకు సదరు వ్యాపారి వాంగ్మూలాన్ని కోర్టు దృష్టికి తెచ్చింది. ‘‘కేజ్రీవాల్ సూచనతో ఆ వ్యాపారి 2021 మార్చి 20న హైదరాబాద్ లో కవితను ఆమె ఇంట్లో కలిశారు. ఈ సందర్భంగా.. కేజ్రీవాల్​తో తాము మాట్లాడుతున్నామని, సీఎం టీం ఢిల్లీ లిక్కర్ పాలసీ రూపొందిస్తున్నదని వ్యాపారికి కవిత వివరించారు. అలాగే తనతో పాటు అభిషేక్ బోయినపల్లి, బుచ్చిబాబు, అరుణ్ పిళ్లైతో టచ్​లో ఉండాలని వ్యాపారికి ఆమె సూచించారు. లిక్కర్ బిజినెస్​లో పార్ట్​నర్​ షిప్ కావాలంటే... ఆప్ (ఆమ్​ ఆద్మీ పార్టీ)కు రూ. 100 కోట్లు ముడుపులుగా చెల్లించాల్సి ఉందని, ఇందుకోసం ముందుగా రూ.50 కోట్లు చెల్లించాలని ఆ వ్యాపారికి కవిత చెప్పారు. అనంతరం కవిత సీఏ బుచ్చిబాబు 2021 మార్చి 21న వ్యాపారిని కలుసుకుని రూ.50 కోట్లు చెల్లించాల్సిందిగా డిమాండ్ చేశారు. ఇందుకు తగ్గట్లుగా ఆ వ్యాపారి తన కొడుకు ద్వారా బుచ్చిబాబు, అభిషేక్ బోయినపల్లికి రూ.25 కోట్లు చెల్లించారు. 

ఈ ఒప్పందంలో భాగంగా ఈ వ్యాపారి కొడుకుకు ఇండో స్పిరిట్ హోల్ సేల్ బిజినెస్ లో రూ.32.5 శాతం వాటాను ఇచ్చారు. మరోవైపు పెర్నాల్డ్ రికార్డు ఇండియా ద్వారా ఇండో స్పిరిట్ కు హోల్ సేల్ బిజినెస్ దక్కేలా విజయ్ నాయర్ కీ రోల్ పోషించారు. నిబంధనలకు భిన్నంగా ఇండో స్పిరిట్​కు హోల్ సేల్ లైసెన్సు ఇచ్చారు” అని కవిత కస్టడీ అప్లికేషన్​లో సీబీఐ వివరించింది. వ్యాపారులు కుమ్మక్కయ్యారని, భాగస్వాములు బ్లాక్ లిస్టు అయ్యారని ఆరోపణలు వచ్చినా పట్టిచ్చుకోకుండా అప్పటి ఢిల్లీ డిప్యూటీ సీఎం మనీశ్​సిసోడియా ఒత్తిడి మేరకు ఇండో స్పిరిట్ కు అక్రమ వ్యాపారం కేటాయించినట్లు తేలిందని సీబీఐ పేర్కొంది.