
హైదరాబాద్, వెలుగు: దేశంలో ఫాసిస్టు పాలన నడుస్తోందని.. దీనికి వ్యతిరేకంగా కవులు, కళాకారులు గళమెత్తాలని ఎమ్మెల్సీ కవిత పిలుపునిచ్చారు. ఎన్టీఆర్ స్టేడియంలో నిర్వహిస్తున్న నేషనల్ బుక్ ఫెయిర్‌ను ఆదివారం ఆమె సందర్శించారు. ప్రముఖ కవి, ఎమ్మెల్సీ గోరటి వెంకన్న రచించిన ‘‘వల్లంకి తాళం’’ పుస్తకంపై ఆయనతో కవిత చర్చించారు. దేశంలో ఫాసిస్టు పాలన సాగుతున్నదని, దీనికి వ్యతిరేకంగా ఏం చేస్తే బాగుంటుందో కవులు, కళాకారులు, రచయితలు ఆలోచన చేయాలని కవిత అన్నారు. ‘‘అడవికి గాయమైతే చూస్తూ ఊరుకునే సంస్కృతి మనది కాదు. నల్లమలలో కేంద్రం యురేనియం తవ్వకాలకు ప్రయత్నిస్తే అనుమతిచ్చే ప్రసక్తే లేదని అసెంబ్లీలో తీర్మానం చేశాం. నల్లమల అడవిని, ప్రకృతిని, చెంచుల జీవన శైలిని వల్లంకి తాళంలో వెంకన్న అద్భుతంగా వర్ణించారు. నల్లమలతో నాకు ప్రత్యేక అనుబంధం ఉంది. అక్కడ యురేనియం, వజ్రాల కోసం కేంద్ర ప్రభుత్వం అడవిని తవ్వే ప్రయత్నం చేసింది. తెలంగాణ ఉద్యమ సమయంలో నేను, మరికొందరం కలిసి పెద్ద ఎత్తున ఆందోళన చేశాం. మైనింగ్ లీజు రద్దు చేసే వరకు పోరాటం చేశాం” అని చెప్పారు.
గొప్ప కవులున్న వారసత్వం మనది..
కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కారం తెలుగులో మొదటిసారి తెలంగాణ బిడ్డ సురవరం ప్రతాపరెడ్డికి1955లో వచ్చిందని, ఆ పరంపరను గోరటి వెంకన్న వరకు మన రచయితలు, కవులు కొనసాగిస్తున్నారని కవిత చెప్పారు. సినారె, దాశరథి, ఎన్.గోపి, చేకూరి రామారావు, అంపశయ్య నవీన్, సామల సదాశివ, కాత్యాయని విద్మహే, నిఖిలేశ్వర్, గోరటి వెంకన్న కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డులు సాధించారని తెలిపారు. ఇలాంటి మహానుభావులు, గొప్ప కవులున్న వారసత్వం తెలంగాణదని అన్నారు. తరతరాలు గుర్తుండిపోయేలా మన కవులు రచనలు చేశారని కొనియాడారు. వెంకన్న వారి వారసత్వాన్ని కొనసాగిస్తూ మూలాల్లోకి వెళ్లి అడవిని, చెట్టును, పుట్టను, పక్షిని పరిశీలించి అద్భుతమైన రచనలు చేశారన్నారు. ‘‘వల్లంకి తాళంలోని కవితలను నేను పదేపదే చదివాను. రాష్ట్రంలో వివిధ మాండలికాల్లో మాట్లాడుతారు. అలాంటి మాండలికాల్లో ఉప మాండలికంపై వెంకన్న శ్రద్ధ పెట్టారు. వెంకన్న రచనా శైలి అద్భుతంగా ఉంది. తెలుగులోని తేనెదనాన్ని, కమ్మదనాన్ని మరోసారి పరిచయం చేసినట్టుగా వల్లంకి తాళం ఉంది” అని కొనియాడారు. ఈ చర్చలో జూలూరి గౌరీశంకర్ తదితరులు పాల్గొన్నారు.