- నాకు కాంగ్రెస్ మద్దతు ఉందనేది అబద్ధం: కవిత
- పార్టీ పెట్టడం కాదు.. ప్రజా సమస్యలపైనే నా ఫోకస్
- అధికారం, అవకాశం, ఆత్మగౌరవం నినాదంతో ముందుకెళ్తున్నానని వ్యాఖ్య
- నిజామాబాద్‌లో రెండోరోజు జాగృతి జనం బాట
నిజామాబాద్, వెలుగు: తెలంగాణ జాగృతితో బీఆర్ఎస్ కేడర్ కలిసి నడుస్తున్నదని ఆ సంస్థ అధ్యక్షురాలు, ఎమ్మెల్సీ కవిత పేర్కొన్నారు. తనకు కాంగ్రెస్ మద్దతు ఉందనే ప్రచారం శుద్ధ అబద్ధమని తెలిపారు. ఆదివారం నిజామాబాద్ జిల్లాలో కవిత రెండో రోజు జాగృతి జనం బాట కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మీడియాతో మాట్లాడారు. సొంత విషయాలు కాకుండా పార్టీ కోసం మాట్లాడితే తనను బీఆర్ఎస్నుంచి బయటకు పంపారని తెలిపారు. కానీ.. కొత్త రాజకీయ పార్టీ పెట్టాలని కేసీఆరే తనను పంపినట్టు ప్రచారం జరుగుతున్నదని, అది నిజం కాదన్నారు.
‘‘కేసీఆర్ ఏది చేసినా ఓపెన్‌గా చేస్తరు. ఆయన బిడ్డగా నాది కూడా స్ట్రెయిట్ఫైటే. నన్ను సస్పెండ్ చేసి పంపినప్పటికీ కేసీఆర్‌ను గానీ.. బీఆర్‌ఎస్‌నుగానీ పనిగట్టుకొని విమర్శించను. ఇష్యూ బేస్డ్‌గా కచ్చితంగా విమర్శలు ఉంటాయి” అని అన్నారు. ప్రజలిచ్చిన చాన్స్‌ను కాంగ్రెస్ సద్వినియోగం చేసుకోలేకపోయిందని, ప్రజాదరణ కోల్పోయిన ఆ పార్టీ తనకేమి మద్దతు ఇస్తుందని అన్నారు. తాను రాజకీయ పార్టీ పెట్టడం అటుంచితే.. ప్రజా సమస్యలపైనే ఫోకస్ పెడ్తానని తెలిపారు. సర్వే చేస్తే తన ప్రజాదరణ ఏంటో తెలుస్తదని వ్యాఖ్యానించారు. ధోకేబాజ్‌లతోనే బీఆర్‌ఎస్‌కు నష్టండైనమిక్ సీఎంగా కేసీఆర్ పేరుగాంచినా.. ఆయన చుట్టూ ఉన్న ధోకేబాజ్ నేతల వల్ల బీఆర్ఎస్కు భారీ నష్టం జరుగుతున్నదని కవిత అన్నారు. పార్టీ నుంచి తనను బయటకు పంపడానికి వారే కారకులైనప్పటికీ.. తనను సస్పెండ్ చేసింది మాత్రం కేసీఆరేనని చెప్పారు. గతంలో ఎంపీగా తన ఓటమికి అప్పటి ఎమ్మెల్యేలు ఎవరెవరు కారణమో తనకు తెలుసునని, తన ఓటమికి కారణాలపై పార్టీ రివ్యూ చేయకపోవడం, ఆత్మపరిశీలన చేయకపోవడం వల్ల భారీ మూల్యం చెల్లించుకున్నదని తెలిపారు. 2023 అసెంబ్లీ ఎలక్షన్స్‌లో బీఆర్‌ఎస్ ఓటమికి కూడా సమీక్షించుకోకపోవడమే కారణమని చెప్పారు. ఎమ్మెల్యేల పనితీరు, వారి అవినీతి గురించి తెలుసుకొని ఉంటే బీఆర్ఎస్‌కు ఎదురుండేది కాదన్నారు. మొన్నటి అసెంబ్లీ ఎలక్షన్స్‌లో గెలిచిన కొందరు బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు పార్టీ వదిలి ఎందుకు వెళ్లారో తనకు తెల్వదని చెప్పారు.
అందరికీ అర్థమయ్యే కాన్సెప్ట్‌తోనే ముందుకు..
తాను ‘అధికారం, అవకాశం, ఆత్మగౌరవం’ అనే నినాదంతో ముందుకెళ్తున్నానని కవిత చెప్పారు. ఇదేమీ ఎవరికీ అర్థంకాని కాన్సెప్ట్ కాదని అన్నారు. తెలంగాణ ఫలాలు అందరికీ అందాలన్నదే తమ లక్ష్యమని పేర్కొన్నారు. ప్రెసిడెన్షియల్ ఆర్డర్స్‌కు విరుద్ధంగా జరిగిన గ్రూప్-1 అపాయింట్ మెంట్లపై సుప్రీంకోర్టులో పిటిషన్ వేస్తానని అన్నారు. 8 మంది నాన్‌లోకల్ వ్యక్తులు కీలకమైన ఉద్యోగాలు పొందారని ఆరోపించారు. ఈ విషయంపై ఇప్పటికే సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్‌కు లెటర్ రాశానని, సుమోటోగా తీసుకుంటారేమో చూసిన తర్వాత రిట్ పిటిషన్ వేస్తానని తెలిపారు.
