- ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఘనంగా రిపబ్లిక్ డే వేడుకలు
మెదక్, మెదక్ టౌన్, వెలుగు: ప్రభుత్వ పథకాల ద్వారా మెతుకు సీమలో విప్లవాత్మక అభివృద్ధి సాధించామని మెదక్‌జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ తెలిపారు. సోమవారం పోలీస్ పరేడ్ గ్రౌండ్‌లో 77 రిపబ్లిక్ డే వేడుకలకు ముఖ్య అతిథిగా హాజరై జెండా ఆవిష్కరించారు. అనంతరం పోలీసుల గౌరవ వందనం స్వీకరించి వివిధ రంగాల్లో జిల్లా ప్రగతిని వివరించారు. మహాలక్ష్మి పథకం కింద ఇప్పటివరకు 3 కోట్ల 62 లక్షల సార్లు మహిళలు ఉచిత రవాణా సౌకర్యాన్ని వినియోగించుకున్నారని దీని ద్వారా వారికి రూ.126.57 కోట్ల లబ్ధి చేకూరిందన్నారు.
గృహజ్యోతి ద్వారా ఇప్పటి వరకు 1,28, 811 మంది వినియోగదారులకు జీరో బిల్లు జారీ చేసినట్లు చెప్పారు. ఇప్పటివరకు రూ.84.58 కోట్ల సబ్సిడీ అందజేశామన్నారు. రైతు భరోసా పథకం కింద ప్రతీ రైతుకు ఎకరాకు రూ.6 వేల చొప్పున 2,62,043 మంది రైతుల ఖాతాల్లో రూ.220.84 కోట్లు జమ చేసినట్టు తెలిపారు. రైతు రుణమాఫీ ద్వారా 87, 491 మంది రైతన్నలకు రూ.645.41 కోట్లు రుణమాఫీ చేసినట్లు చెప్పారు.
రాజీవ్ ఆరోగ్యశ్రీ కింద 31, 041 మంది పేదలు, రూ.85.18 కోట్ల విలువైన వైద్య చికిత్సలు పొందారన్నారు. అనంతరం ఉత్తమ పనితీరు కనబరచిన అధికారులు, సిబ్బందికి ప్రశంసా పత్రాలు అందజేశారు. కార్యక్రమంలో ఎమ్మెల్యే రోహిత్ రావు, ఎస్పీ డీవీ శ్రీనివాస్ రావు, అడిషనల్ కలెక్టర్ నగేశ్ పాల్గొన్నారు.
అందరికీ సమాన అవకాశాలు: కలెక్టర్ హైమావతి
సిద్దిపేట రూరల్: అందరికీ సమాన అవకాశాలు అందించాలన్న లక్ష్యంతో ప్రభుత్వం పనిచేస్తోందని సిద్దిపేట జిల్లా కలెక్టర్ హైమావతి అన్నారు. రిపబ్లిక్‌డే సందర్భంగా పరేడ్ గ్రౌండ్ లో నిర్వహించిన వేడుకలకు ఆమె ముఖ్య అతిథిగా హాజరై జెండాను ఆవిష్కరించి పోలీసుల గౌరవ వందనం స్వీకరించారు. అనంతరం మాట్లాడుతూ.. మహాలక్ష్మి పథకం కింద 7 కోట్ల 89 లక్షల మంది మహిళలు ఉచిత రవాణా సౌకర్యాన్ని ఉపయోగించుకొని, రూ.299 కోట్ల 78 లక్షల లబ్ధి పొందినట్లు తెలిపారు.
ఆరోగ్య శ్రీ కింద 26,481 మందికి శస్త్ర చికిత్సలు చేసి రూ. 77 కోట్ల 56 లక్షలు ఖర్చు చేసినట్లు చెప్పారు. ఇందిరమ్మ ఇండ్ల పథకం కింద జిల్లాలో 13 వేల 57 ఇండ్లు మంజూరు కాగా వాటిలో 9 వేల 79 ఇండ్లు ప్రారంభించి 110 ఇండ్లను పూర్తి చేశామని పేర్కొన్నారు. రైతు భరోసా ద్వారా మొత్తం 3 లక్షల 19 వేల మంది రైతులకు ఖాతాల్లో రూ. 355 కోట్ల జమచేశామన్నారు.
యాసంగికి 81 వేల 787 టన్నుల ఎరువులు నిల్వ ఉన్నాయని పేర్కొన్నారు. అనంతరం ఉత్తమ ఉద్యోగులకు ప్రశంస పత్రాలను అందజేశారు. కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ చైర్మన్ లింగమూర్తి, సీపీ రష్మి పెరుమాల్, అడిషనల్ కలెక్టర్ అబ్దుల్ హమీద్, జిల్లా అధికారులు పాల్గొన్నారు.
సంగారెడ్డిలో జెండా ఎగరేసిన కలెక్టర్ ప్రావీణ్య
సంగారెడ్డి, వెలుగు: రిపబ్లిక్ డే సందర్భంగా సంగారెడ్డిలోని పోలీస్ పరేడ్ గ్రౌండ్‌లో కలెక్టర్ ప్రావీణ్య జెండాను ఆవిష్కరించి పోలీసుల గౌరవ వందనాన్ని స్వీకరించారు. జిల్లాలో వివిధ శాఖల ద్వారా అమలవుతున్న సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలు, సాధించిన ప్రగతిని వివరించారు. వేడుకల్లో భాగంగా వివిధ శాఖల ఆధ్వర్యంలో శకట ప్రదర్శనలు నిర్వహించారు. స్వాతంత్ర్య సమరయోధులను ఘనంగా సన్మానించారు.
ఉత్తమ సేవలందించిన అధికారులు, ఉద్యోగులకు కలెక్టర్, టీజీఐఐసీ చైర్‌పర్సన్ నిర్మలరెడ్డి ప్రశంసా పత్రాలను అందజేశారు. పర్యావరణ పరిరక్షణకు కృషి చేస్తున్న 6 స్కూళ్లకు ప్రశంసా పత్రాలు ఇచ్చారు. ఉత్తమ శకటాలుగా ఎంపికైన డీడబ్ల్యూఓ, డీఆర్డీఓ, రవాణా శాఖ, పోలీస్ శాఖలకు జ్ఞాపికలు, సర్టిఫికెట్లు అందజేశారు. కులాంతర వివాహాలు చేసుకున్న 41 జంటలకు రూ.కోటి, 02లక్షల 50 వేల చెక్కులను అందజేశారు.
దివ్యాంగులకు ఉచితంగా ఉపకరణాలు పంపిణీ చేశారు. కార్యక్రమంలో అడిషనల్ కలెక్టర్లు మాధురి, పాండు, సబ్ కలెక్టర్ ఉమాహారతి, రెవెన్యూ డివిజనల్ అధికారులు రాజేందర్, దేవుజా, అధికారులు పాల్గొన్నారు.
