వాడవాడలా రెపరెపలాడిన మువ్వన్నెల జెండా..ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ఘనంగా గణతంత్ర దినోత్సవం

వాడవాడలా రెపరెపలాడిన మువ్వన్నెల జెండా..ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ఘనంగా గణతంత్ర దినోత్సవం

నెట్​వర్క్, వెలుగు :  ఉమ్మడి ఖమ్మం జిల్లాలో సోమవారం వాడవాడలా మువ్వన్నెల జెండా రెపరెపలాడింది. ఖమ్మం, భద్రాద్రికొత్తగూడెం జిల్లా కేంద్రాల్లో కలెక్టర్లు అనుదీప్​ దురిశెట్టి, జితేశ్​ వి పాటిల్, ఖమ్మంలోని క్యాంపు కార్యాలయంలో మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి, కొత్తగూడెంలోని ప్రకాశం స్టేడియంలో సింగరేణి కాలరీస్​ కంపెనీ ఇన్​చార్జి సీఎండీ కృష్ణ భాస్కర్, ఐటీడీఏ కార్యాలయంలో  పీవో బి.రాహుల్ తో పాటు పలు ప్రాంతాల్లో, ఆయా స్కూళ్లలో, ఆఫీసుల్లో సీపీ, ఎస్పీ, అడిషనల్​ కలెక్టర్లు, ఎమ్మెల్యేలు, అధికారులు, నాయకులు జాతీయ జెండాను ఎగురవేశారు. 

ఖమ్మం, కొత్తగూడెంలో స్వాతంత్ర్య సమరయోధులను సత్కరించారు. ఉత్తమ ఉద్యోగులకు ప్రశంస పత్రాలు అందజేశారు. రాష్ట్ర ప్రభుత్వ సంక్షేమ పథకాల స్టాల్స్ ఆకర్షణగా నిలిచాయి. విద్యార్థులు ప్రదర్శించిన సాంస్కృతిక ప్రదర్శనలు ఆకట్టుకున్నాయి.  

పేదల సొంతింటి  కల నెరవేర్చడమే లక్ష్యం :  భద్రాద్రికొత్తగూడెం కలెక్టర్​జితేశ్​ 

భద్రాద్రికొత్తగూడెం, వెలుగు : పేదల సొంతింటి కల నెరవేర్చడమే లక్ష్యంగా ప్రభుత్వం ఇందిరమ్మ ఇండ్ల స్కీమ్​ను ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తోందని భద్రాద్రికొత్తగూడెం కలెక్టర్​ జితేశ్​వి పాటిల్​పేర్కొన్నారు. సీతారామ ఎత్తిపోతల పథకం ద్వారా ఉప కాల్వల పనులు కొనసాగుతున్నాయన్నారు.

 యంగ్​ ఇండియా రెసిడెన్షియల్​ స్కూల్స్​తో పాటు ఎస్టీ, ఎస్సీ, బీసీ, మైనార్టీ సంక్షేమ హాస్టల్స్​తో పేద స్టూడెంట్స్​ మెరుగైన విద్యనందిస్తున్నామని తెలిపారు. దేశంలోని తొలి ఎర్త్​ సైన్సెస్​ యూనివర్సిటీని జిల్లాలో ఏర్పాటు చేసుకున్నామని గుర్తుచేశారు. గృహజ్యోతి పథకం, సన్నబియ్యం, మహాలక్ష్మి, వ్యవసాయ యంత్రీకరణ స్కీంలతో ప్రజలకు మేలు కలుగుతోందని తెలిపారు. 

జిల్లా సమగ్రాభివృద్ధికి చర్యలు  : ఖమ్మం కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి

ఖమ్మం టౌన్​ వెలుగు: ఖమ్మం జిల్లా సమగ్రాభివృద్ధికి పక్కా ప్రణాళికతో చర్యలు చేపడుతున్నామని కలెక్టర్​ అనుదీప్​ దురిశెట్టి తెలిపారు. జిల్లాలో అమలవుతున్న సంక్షేమ పథకాల పురోగతిని వివరించారు. సీతారామ ఎత్తిపోతల పనులు వేగంగా జరుగుతున్నాయని, మంచుకొండ ఎత్తిపోతల పథకాన్ని ఇప్పటికే ప్రారంభించుకున్నామని తెలిపారు.

 వైద్య రంగంలో మధిరలో 100 పడకల ఆసుపత్రిని ప్రారంభించామని, వైరా, కూసుమంచిలలో కొత్త ఆస్పత్రుల నిర్మాణం జరుగుతోందని చెప్పారు. విద్యారంగంలో ‘ఎవ్రీ చైల్డ్ రీడ్స్’ కార్యక్రమం ద్వారా పఠన సామర్థ్యాలను పెంచుతున్నామని, ఎఫ్ఆర్ఎస్ హాజరులో ఖమ్మం జిల్లా రాష్ట్రంలోనే ప్రథమ స్థానంలో నిలవడం గర్వకారణమన్నారు.