
బషీర్బాగ్, వెలుగు: ఉద్యోగ, ఉపాధ్యాయుల పెండింగ్ సమస్యలను పరిష్కరించాలని ఎమ్మెల్సీ మల్క కొమురయ్య రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. నారాయణగూడ కేశవ్ మెమోరియల్ పాఠశాల సమావేశ మందిరంలో ఆదివారం తెలంగాణ ప్రాంత ఉపాధ్యాయ సంఘం రాష్ట్ర కార్య నిర్వాహక వర్గ సమావేశం నిర్వహించారు. ఆయనతోపాటు ఎమ్మెల్సీ ఏవీఎన్.రెడ్డి ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. సీపీఎస్ రద్దు, డీఏలు, హెల్త్ కార్డులు తదితర సమస్యలను తాము, ఉపాధ్యాయ సంఘాలు ఎన్నోసార్లు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లినా నిర్లక్ష్యం చేస్తోందని ఆరోపించారు.
రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగా లేదని బాధ్యత గల పదవిలో ఉన్న సీఎం రేవంత్రెడ్డి మాట్లాడడం సరికాదన్నారు. టీచర్ల డిమాండ్లు నెరవేర్చేవరకు ఉపాధ్యాయ సంఘాలతో కలిసి పోరాటం చేస్తామని హెచ్చిరించారు. కమిటీల పేరుతో కాలయాపన చేయకుండా సమస్యలను వెంటనే పరిష్కరించాలని సంఘం అధ్యక్షుడు హనుమంతరావు, ప్రధాన కార్యదర్శి నవాత్ సురేశ్కోరారు. లేకపోతే ఉద్యమ కార్యాచరణ ప్రకటిస్తామని పేర్కొన్నారు. అనంతరం డిమాండ్లకు సంబంధించిన పోస్టర్ ఆవిష్కరించారు.