కుక్కలు, గాడిదల లెక్కలు చెప్పి.. బీసీల లెక్కలు దాస్తరా? : ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న

కుక్కలు, గాడిదల లెక్కలు చెప్పి.. బీసీల లెక్కలు దాస్తరా? : ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న
  •     కులగణన, డెడికేటెడ్ కమిషన్ రిపోర్టులు వెంటనే బయటపెట్టాలి: ఎమ్మెల్సీ తీన్మార్​ మల్లన్న

హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో కులగణన చేసి నెలలు గడుస్తున్నా ఆ రిపోర్టును ఎందుకు బయటపెట్టడం లేదని ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. మంగళవారం మండలిలో ఆయన మాట్లాడుతూ.. కులగణన సమగ్ర నివేదికతో పాటు బీసీ డెడికేటెడ్ కమిషన్ రిపోర్టును తక్షణం సభ ముందుంచాలని డిమాండ్ చేశారు. నిధులు కేటాయించి సర్వే చేసి, దానిని దొంగ డాక్యుమెంట్‌‌ లా ఎందుకు దాస్తున్నారని ఆయన ప్రశ్నించారు. 

ఆర్టీఐ కింద అడిగినా ఇవ్వడం లేదని మండిపడ్డారు. డెడికేటెడ్ కమిషన్ బీసీ ఏ, బీ, సీ, డీ వర్గాలకు ఏం సూచనలు చేసిందో కనీసం చట్టసభ సభ్యులకైనా తెలియకపోతే ఎలా అని ప్రభుత్వాన్ని నిలదీశారు. రాష్ట్రంలో కుక్కలు, పందులు, గాడిదలు ఎన్ని ఉన్నాయో లెక్కలున్నాయని.. 2 వేల గాడిదలు ఉన్నాయని గత సర్వేలో తేల్చారన్నారు. 

మరి బీసీ కులాల లెక్కలు ఎందుకు లేవని ప్రభుత్వాన్ని మల్లన్న ప్రశ్నించారు. రాష్ట్రంలో ముదిరాజులు, యాదవులు, గౌడ్​లు, పద్మశాలీలు, మున్నూరు కాపులు ఎంతమంది ఉన్నారో తెలియకుండా సంక్షేమ పథకాలు ఎలా అమలు చేస్తారని అడిగారు. సర్వే వివరాలను పబ్లిక్ డొమైన్‌ లో పెట్టాలని, ఏ గ్రామంలో ఏ కులం వాళ్లు ఎంతమంది ఉన్నారో గ్రామ పంచాయతీల్లో పోస్టర్లు అంటించాలన్నారు. 

అప్పుడే సర్పంచులకు, ప్రజలకు పథకాల అమలుపై స్పష్టత వస్తుందన్నారు. బీసీల్లో వచ్చిన చైతన్యం వల్లనే కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిందని, ఆ వర్గాల ఓట్లతో గెలిచిన తాము వాళ్ల లెక్కలు అడగకపోతే ఎలా అని మల్లన్న ప్రశ్నించారు. సర్వే వివరాలను ప్రభుత్వం మహా అయితే రెండేండ్లు దాచిపెట్టగలదని.. ఆ తర్వాత బీరువా తాళాలు పగులుతాయని, ఎలాగైనా లెక్కలు బయటకొస్తాయని హెచ్చరించారు. ప్రభుత్వం ఆత్మరక్షణలో పడకుండా, వెంటనే కులగణన, డెడికేటెడ్ కమిషన్ రిపోర్టులను బయటపెట్టాలని ప్రభుత్వాన్ని ఆయన కోరారు.