బనకచర్లపై బీజేపీది డబుల్ గేమ్ .. చంద్రబాబుతో కలిసి కుట్ర చేస్తున్నది: ఎమ్మెల్సీ విజయశాంతి

బనకచర్లపై బీజేపీది డబుల్ గేమ్ .. చంద్రబాబుతో కలిసి కుట్ర చేస్తున్నది: ఎమ్మెల్సీ విజయశాంతి
  • కేసీఆర్ రాసిచ్చిన స్క్రిప్టే బీజేపీ లీడర్లు చదువుతున్నరు
  • హైదరాబాద్ అభివృద్ధిని అడ్డుకోవద్దు
  • ఇచ్చిన హామీలు కాంగ్రెస్ అమలు చేస్తున్నదని వ్యాఖ్య

హైదరాబాద్, వెలుగు: బనకచర్ల విషయంలో బీజేపీ డబుల్ గేమ్ ఆడుతున్నదని కాంగ్రెస్ ఎమ్మెల్సీ విజయశాంతి ఆరోపించారు. ఏపీ సీఎం చంద్రబాబు మద్దతుతో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఇబ్బంది పెట్టేందుకు బనకచర్ల వివాదాన్ని బీజేపీ పెద్దదిగా చేసి చూపిస్తున్నదని మండిపడ్డారు. తాజా రాజకీయ పరిస్థితులపై ఆదివారం ‘వెలుగు’ దినప్రతికతో ఆమె మాట్లాడారు. బనకచర్ల ప్రాజెక్టు కట్టడం కరెక్టా? కాదా? అనే విషయంపై స్పష్టత ఇవ్వకుండా కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి తప్పించుకుంటూ తిరుగుతున్నారని విమర్శించారు. తెలంగాణకు చెందిన ఎవరైనా.. ఈ రాష్ట్రానికి ద్రోహం చేయాలనుకుంటే వారిని సోనియా, రాహుల్ ఏమాత్రం సహించరని స్పష్టం చేశారు. ఏ కాంగ్రెస్ నేత కూడా రాష్ట్ర ప్రయోజనాలను పణంగా పెట్టే సాహసం చేయరని, ఒకవేళ ఎవరైనా అలా చేస్తే వాళ్లు కాంగ్రెస్ లో కొనసాగలేరని అన్నారు.

రాష్ట్ర ప్రజలకు ద్రోహం చేయొద్దు

కేసీఆర్ రాసిచ్చిన స్క్రిప్ట్​నే బీజేపీ నేతలు చదువుతున్నట్లు అర్థమవుతున్నదని ఎమ్మెల్సీ విజయశాంతి అన్నారు. ‘‘కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం తీరుచూస్తే.. తెలంగాణలోని కాంగ్రెస్ ప్రభుత్వానికి మేలు చేయం.. కానీ, ఇక్కడి ప్రజలకు మాత్రం లాభం చేస్తామన్నట్లు ఉంది. మెట్రో సెకండ్ ఫేజ్ హైదరాబాద్ కు వస్తే కాంగ్రెస్ పార్టీకి కలిగే రాజకీయ ప్రయోజనం ఏంటి? రీజినల్ రింగ్ రోడ్డు వస్తే కాంగ్రెస్ కు ఏం లాభం? ఈ రెండింటిని రాష్ట్రానికి ఇచ్చి క్రెడిట్ ను కేంద్రం తన ఖాతాలో వేసుకోవచ్చు కదా.. రాజకీయ కారణాలతో హైదరాబాద్ అభివృద్ధిని అడ్డుకోవద్దు. ఇక్కడి ప్రజలకు ద్రోహం చేయొద్దు. చాలా సందర్భాల్లో ఇదే విషయాన్ని సీఎం రేవంత్ కేంద్రాన్ని కోరారు. జీహెచ్‌‌‌‌‌‌‌‌ఎంసీలో బీజేపీకి 42 మంది కార్పొరేటర్లు ఉన్నారు. 

ఆ పార్టీని నమ్మి ఓటేసిన హైదరాబాద్ ప్రజలకు మాత్రం కేంద్రం అన్యాయం చేయొద్దు. మెట్రో రెండో దశ, ట్రిపుల్ ఆర్ కు కేంద్రం వెంటనే అనుమతులివ్వాలి. ఓల్డ్ సిటీ అభివృద్ధి కోసం మెట్రో రెండో దశ పనులను త్వరగా ప్రారంభించేందుకు మోదీ సర్కార్ పై ఒత్తిడి తీసుకొస్తాం. దీనికి సంబంధించిన కార్యాచరణకు త్వరలోనే శ్రీకారం చుడతాం. ఇందుకోసం రాజకీయాలకు అతీతంగా త్వరలోనే మెట్రో2.0 సాధన సమితి పేరుతో ఓ ఉద్యమం చేపడ్తాం’’అని విజయశాంతి అన్నారు.

కొందరు అధికారులు ప్రభుత్వానికి చెడ్డపేరు తెస్తున్నరు

కాంగ్రెస్ ప్రభుత్వానికి చెడ్డపేరు తీసుకొచ్చే రీతిలో కొందరు అధికారులు ప్రవర్తిస్తున్నారని ఎమ్మెల్సీ విజయశాంతి ఆరోపించారు. గత బీఆర్ఎస్ సర్కార్ లోని పెద్దలకు సన్నిహితంగా ఉన్నవాళ్లే ఇలా చేస్తున్నారని మండిపడ్డారు. కొందరు అధికారులు ఈ ప్రభుత్వంలోనూ కీలక స్థానాల్లో ఉండి, సర్కార్​కు వెన్నుపోటు పోడిచే ప్రయత్నాలు జరుగుతున్నాయని ఆమె ఆరోపించారు. 

ఈ విషయంలో సీఎం రేవంత్ రెడ్డి అప్రమత్తంగా ఉండాలని సూచించారు. కాంగ్రెస్ పాలనలో జరిగే లోపాలపైనే ప్రతిపక్షాలు ఫోకస్ చేస్తున్నాయని అన్నారు. ప్రభుత్వం మంచి.. మంచి పథకాలు తీసుకొస్తున్నప్పటికీ జనంలో ఆశించిన రీతిలో ఆదరణ రావడం లేదని తెలిపారు. దీనిపై కూడా సీఎం రేవంత్ దృష్టి పెట్టాలని కోరారు.

పదేండ్ల బీఆర్ఎస్ పాపాలను వివరిస్తున్నం

ప్రజలకు ఇచ్చిన హామీలను కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేస్తున్నదని ఎమ్మెల్సీ విజయశాంతి అన్నారు. ‘‘గత పదేండ్ల పాలనలో బీఆర్ఎస్ లీడర్లు చేసిన పాపాలను రాష్ట్ర ప్రజలకు వివరించే బాధ్యత కాంగ్రెస్ తీసుకున్నది. గత పాలకులు చేసిన తప్పులను సరిదిద్దుకుంటూ.. రాష్ట్రాన్ని ఎలా ముందుకు తీసుకెళ్తున్నామో కూడా ప్రజలకు వివరించే బాధ్యత కాంగ్రెస్ పార్టీకి ఉన్నది. ఈ విషయంలో కాంగ్రెస్ పార్టీ గరళాన్ని మింగిన శివుడిలా ఉండదల్చుకోలేదు. త్వరలో జరగబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో బీఆర్ఎస్, బీజేపీ కలిసి పోటీ చేయాలని చూస్తున్నాయి. లోక్​సభ ఎన్నికల్లోనూ బీజేపీకి బీఆర్ఎస్ హెల్ప్ చేసింది. లోకల్​బాడీ ఎన్నికల్లోనూ ఇదే సీన్ రిపీట్ అవుతది. ఈ రెండు పార్టీలు బీసీల విషయంలో విలన్​లు. 

బీసీ రిజర్వే షన్లతో జనంలో కాంగ్రెస్​కు ఆదరణ లభించకుండా రెండు పార్టీలు కుట్ర చేస్తున్నాయి. బీసీలకు మేలు చేసే బిల్లుకు పార్లమెంట్ లో ఆమోదం తెలప కుండా దేశంలో అడ్డగోలుగా నియోజకవర్గాల పునర్విభజన చేసి ప్రతిపక్షాలను దెబ్బతీసే కుట్రకు బీజేపీ పాల్పడుతున్నది”అని విజయశాంతి అన్నా రు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన మొదటి రోజు నుంచే ప్రతిపక్షాలు పసలేని ఆరోపణలు, విమర్శలతో ప్రజలను తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేశాయని మండిపడ్డారు. అయినప్పటికీ.. రాష్ట్ర ప్రజలు ఆ పార్టీలను నమ్మకుండా కాంగ్రెస్ చిత్తశుద్ధికే అండగా నిలుస్తూ వస్తున్నారని తెలిపారు.