
- 17న కొత్త సిస్టమ్ లాంచ్
- ప్రభుత్వాధికారి వెల్లడి
- పైలట్ కింద కర్నాటకలో 2,500 ఫోన్ల రికవరీ
- ఐఎంఈఐ క్లోనింగ్ ఇక కుదరదు
న్యూఢిల్లీ: మొబైల్ ఫోన్లను పోగొట్టుకున్న వారు తమ ఫోన్లను ట్రాక్ లేదా బ్లాక్ చేసుకునేందుకు కొత్త ట్రాకింగ్ సిస్టమ్‌ను ఈ నెల 17 న దేశవ్యాప్తంగా ప్రభుత్వం లాంఛ్ చేయనుంది. సెంటర్ ఫర్ డిపార్ట్మెంట్ ఆఫ్ టెలిమాటిక్స్ (సీడాట్) ఈ కొత్త ట్రాకింగ్ సిస్టమ్ సీఈఐఆర్ (సెంట్రల్ ఎక్విప్మెంట్ ఐడెంటిటీ రిజిస్టర్)ను డెవలప్ చేసింది. ఢిల్లీ, మహారాష్ట్ర, కర్నాటక, నార్త్ ఈస్ట్ టెలికం సర్కిల్స్‌లో పైలట్ ప్రాజెక్టులను అమలు చేశారు కూడా. దేశవ్యాప్తంగా సీఈఐఆర్ సిస్టమ్‌ను మే 17 న లాంఛ్ చేయనున్నట్లు డిపార్ట్మెంట్ ఆఫ్ టెలికం సీనియర్ ఆఫీసర్ ఒకరు వెల్లడించారు. సీఈఐఆర్ సిస్టమ్ రెడీ అయిందని, అయితే లాంఛ్ తేదీ గురించి తాను మాట్లాడలేనని సీడాట్ సీఈఓ రాజ్‌కుమార్ ఉపాధ్యాయ చెప్పారు. ఈ క్వార్టర్లో దేశమంతటా సీఈఐఆర్ సిస్టమ్‌ను అందుబాటులోకి తెచ్చే అవకాశాలున్నాయని అన్నారు. మొబైల్ఫోన్లను పోగొట్టుకున్న వారు ఎవరైనా తమ ఫోన్లను ట్రాక్ లేదా బ్లాక్ చేసుకోవడానికి ఈ కొత్త సిస్టమ్ వీలు కల్పిస్తుందని పేర్కొన్నారు. దేశంలోని అన్ని టెలికం నెట్‌వర్క్‌లలోనూ క్లోన్డ్ మొబైల్స్ కనిపెట్టడానికి తగిన ఫీచర్స్‌ను సీడాట్ యాడ్ చేసింది. ఇండియాలో ఎవరైనా మొబైల్ ఫోన్లను అమ్మాలంటే 15 అంకెల ఐఎంఈఐ నెంబర్ తప్పనిసరిగా ఉండాలని ప్రభుత్వం నిర్దేశించింది.
ఎలా కనిపెడతారంటే....
అప్రూవల్ పొందిన ఐఎంఈఐ నెంబర్ల లిస్టు మొబైల్ నెట్వర్కులకు అందుబాటులో ఉంటుంది. దీంతో ఎలాంటి అన్ ఆధరైజ్డ్ మొబైల్ ఫోన్ తమ నెట్వర్కులో ఎంటరయినా ఆపరేటర్లకు వెంటనే తెలిసిపోతుంది. టెలికం ఆపరేటర్లు, సీఈఐఆర్ సిస్టమ్‌లకు మొబైల్ డివైస్‌కి లింకయిన ఐఎంఈఐ నెంబర్ తెలుస్తుంది. ఈ ఇన్ఫర్మేషన్ సాయంతో ఇప్పటికే కొన్ని రాష్ట్రాలలో పోగొట్టుకున్న లేదా దొంగతనానికి గురయిన మొబైల్ ఫోన్లను సీఈఐఆర్‌తో ట్రాక్ చేస్తున్నారు. మొబైల్ ఫోన్లను దొంగిలించిన దొంగలు చేసే మొదటి పని ఏమిటంటే, ఐఎంఈఐ నెంబర్‌ను మార్చేయడం. దీంతో ఆ మొబైల్ ఫోన్‌ను ట్రాక్ చేయడం లేదా బ్లాక్ చేయడం కష్టతరంగా మారుతుంది. ఇది దేశ భద్రతకు సంబంధించిన సమస్యేనని రాజ్‌కుమార్ ఉపాధ్యాయ పేర్కొన్నారు. తమ వద్ద ఉండే డేటాబేస్‌ల సాయంతో క్లోన్డ్మొబైల్స్ను కనిపెట్టి వాటిని సీఈఐఆర్ సిస్టమ్ బ్లాక్ చేయగలుగుతుందని తెలిపారు.
సీఈఐఆర్ ఎందుకు....
పోయిన లేదా దొంగతనానికి గురయిన మొబైల్ ఫోన్ల రిపోర్టింగ్‌ను సులభం చేయాలనే ఉద్దేశంతో సీఈఐఆర్‌ను డెవలప్ చేశారు. అంతేకాదు, దేశమంతటా అలాంటి మొబైల్ ఫోన్ల వాడకాన్ని బ్లాక్ చేయాలనేది కూడా టార్గెట్టే. ఈ కొత్త సిస్టమ్ రాక వల్ల మొబైల్ ఫోన్ల దొంగతనాలు తగ్గుతాయని అంచనా. పోగొట్టుకున్న లేదా దొంగతనానికి గురయిన మొబైల్ ఫోన్లను ట్రాక్చేయడమూ పోలీసులకు కొంత సులభమవుతుంది.
కర్నాటకలో 2500 మొబైల్స్ దొరికినయ్...
పైలట్ అమలయిన కర్నాటక సర్కిల్లో 2,500 మొబైల్ఫోన్లను సీఈఐఆర్ సిస్టమ్ సాయంతో పోలీసులు రికవరీ చేశారు. వాటిని తిరిగి ఆ మొబైల్ ఫోన్ల యజమానులకు అప్పగించారు. యాపిల్ ఐడీ సాయంతో పోయిన మొబైల్‌ను ట్రాక్ చేసే సదుపాయం యాపిల్‌కు ఇప్పటికే ఉంది. కానీ, ఆండ్రాయిడ్ మొబైల్ ఫోన్లకే అలాంటి సదుపాయమేదీ లేదు. ఇది పెద్ద సమస్యగా మారింది. కొత్త సిస్టమ్ రాకతో ఒకవేళ ఎవరైనా మొబైల్ ఫోన్ దొంగిలించినా, దానిని ఇక మీదట వాడుకోవడం కుదరదు. ఫోన్ల స్మగ్లింగ్‌ను కనిపెట్టడానికి కూడా తగిన మెకానిజం ఈ సీఈఐఆర్ సిస్టమ్‌లో ఉందని, దీని వల్ల ప్రభుత్వ ఆదాయం పోకుండా కాపాడుకోవచ్చని ఉపాధ్యాయ వెల్లడించారు.