న్యూఢిల్లీ: తెలంగాణ స్టార్ బాక్సర్ నిఖత్ జరీన్ ‘గేమ్ రెడీ ఎక్విప్మెంట్’కు మిషన్ ఒలింపిక్ సెల్ (ఎంవోసీ) గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. పారిస్ ఒలింపిక్స్ కోసం కావాల్సిన లేజర్ యూనిట్ బీటీఎల్, యాంకల్ వ్రాప్, ఫుల్ లెగ్ వ్రాప్, హ్యాండ్ రిస్ట్ వ్రాప్, ట్రాలీ బీటీఎల్ లేజర్ యూనిట్ ఈ కిట్‌లో ఉంటాయి. గేమ్ రెడీ ఎక్విప్‌మెంట్‌లో ఉండే పరికరాలన్నీ అధిక తీవ్రత కలిగిన లేజర్ కిరణాలను కలిగి ఉంటాయి. దీనివల్ల పెద్ద కండరాలు పట్టేసినప్పుడు నొప్పిని వెంటనే తగ్గించడం కోసం, గాయాల నుంచి త్వరగా కోలుకోవడానికి ఇవి దోహదం చేస్తాయి.
ఆపరేటర్ లేకుండానే ఈ పరికరాలను బాక్సర్లు ఉపయోగించుకోవచ్చు. ఇక జర్మనీలో ట్రెయినింగ్ కోసం శరత్ కమల్ పెట్టుకున్న అభ్యర్తనను కూడా ఎంవోసీ ఓకే చేసింది. టాప్స్ శిక్షణ కింద అతనికి ఆర్థిక సాయం అందించనుంది. ఆర్చర్లు రిధి, ధీరజ్ బొమ్మదేవరకు సంబంధించిన ఆర్చరీ పరికరాలు, పారా షూటర్ శ్రీహర్ష దేవారెడ్డి, సరితకు వీల్చైర్లు, ఇతర ఉపకరణాలకు, టీటీ ప్లేయర్లు ఆకుల శ్రీజ, మనిక బాత్రా, మనుష్ షా, స్వస్థిక, దియాకు కూడా ఆర్థిక సహాయం అందించనున్నారు.