
విద్యాపరంగా వెనుకబడిన మండలాల్లో ఆరువేల మోడల్ స్కూళ్లను కేంద్ర ప్రభుత్వం 2013లో ఏర్పాటు చేసింది. ఈ మోడల్ స్కూళ్లలో కేంద్రీయ విద్యాలయాల స్థాయిలో మౌలిక సదుపాయాలు, వసతులు కల్పించారు. శాస్త్రీయమైన ఉపాధ్యాయ, విద్యార్థి నిష్పత్తి, ఇన్ఫర్మేషన్ అండ్ కమ్యూనికేషన్ టెక్నాలజీ గరిష్ట వినియోగం, సంపూర్ణ విద్యా వాతావరణం, ఉపాధ్యాయుల పనితీరు, విద్యార్థుల ఫలితాలపై ఎక్కువ దృష్టి పెట్టడం వంటివి ఈ మోడల్ స్కూళ్ల ప్రత్యేకతలు. ఈ పాఠశాలలు 6వ తరగతి నుండి ఇంటర్మీడియట్ వరకు రాష్ట్ర సిలబస్‌ను అనుసరిస్తూ, ఇంగ్లిష్ మీడియంలో నడుస్తున్నాయి. రాష్ట్రంలో 2013-14 విద్యా సంవత్సరంలో 194 మోడల్ స్కూళ్లు ప్రారంభమయ్యాయి.
ఆంగ్ల మాధ్యమంలో హైలీ క్వాలిఫైడ్ ఉపాధ్యాయులచే నాణ్యమైన విద్యను అందించడం ఈ పాఠశాలల ప్రధాన లక్ష్యం. 2013లో 194 ప్రిన్సిపాల్, 2,522 పోస్టు గ్రాడ్యుయేట్ టీచర్ (పీజీటీ), 1,164 ట్రైన్డ్ గ్రాడ్యుయేట్ టీచర్ (టీజీటీ) పోస్టులను రాష్ట్ర ప్రభుత్వం మంజూరుచేసి దశలవారీగా భర్తీ చేసింది. దురదృష్టవశాత్తు, కేంద్ర ప్రభుత్వం 2015-–16లో ఈ పథకం నుంచి వైదొలగి ఆర్థికసహాయం నిలిపివేసింది. అప్పటి నుంచి మోడల్ స్కూళ్ల నిర్వహణ భారం పూర్తిగా రాష్ట్ర ప్రభుత్వంపై పడింది. ప్రస్తుతం 99 మంది ప్రిన్సిపాల్స్, 1956 మంది పీజీటీలు, 753 మంది టీజీటీలు పనిచేస్తుండగా, 95 ప్రిన్సిపాల్, 566 పీజీటీ, 411 టీజీటీ పోస్టులు ఖాళీగా ఉన్నాయి. దాదాపు 1.25 లక్షల మంది విద్యార్థులు ఈ స్కూళ్లలో విద్యనభ్యసిస్తున్నారు.
ఒకటో తేదీన వేతనాలేవీ?
ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు రేవంత్ రెడ్డి సర్కారు గత 18 నెలలుగా రాష్ట్రంలోని ఎనిమిది లక్షల మంది ఉద్యోగ, ఉపాధ్యాయ, పెన్షనర్లకు ప్రతి నెలా ఒకటో తేదీ నాడు ఠంచన్‌గా వేతనాలు, పెన్షన్లు చెల్లిస్తోంది. మోడల్ స్కూల్ టీచర్లు మాత్రం ప్రతి నెలా రెండవ వారం వరకు వేతనాల కోసం నిరీక్షించాల్సి వస్తోంది. గతంలో క్వార్టర్లీ బడ్జెట్ రిలీజ్ చేసేవారు. అప్పుడు ప్రతి మూడు నెలల్లో కనీసం రెండు నెలలైనా సకాలంలో వేతనాలు పొందేవారు. గత కొంతకాలంగా మంత్లీ బడ్జెట్ రిలీజ్ చేస్తున్నారు. రాష్ట్రంలో ఉన్న ప్రిన్సిపాల్స్ అందరూ బిల్స్ సమర్పించిన తర్వాత ఆ బిల్లులకు సరిపోయే బడ్జెట్ లెక్కించి రిలీజ్ చేసే విధానాన్ని అమలు చేస్తున్నారు. దీంతో ప్రతినెలా జీతాల చెల్లింపు ఆలస్యం అవుతున్నది.
పెన్షన్ లేదు, రీయింబర్స్మెంట్ నో!
పేరుకు మాత్రమే ఆదర్శ పాఠశాలల టీచర్స్. వారికి కల్పించిన సౌకర్యాలు గోరంత, సమస్యలు కొండంత. జబ్బు చేసి హాస్పిటల్‌కు వెళ్తే, ఇతర ఉద్యోగ ఉపాధ్యాయ, పెన్షనర్లకి ఇస్తున్న రీయింబర్స్మెంట్ సౌకర్యం మోడల్ టీచర్లకు లేదు. హెల్త్ కార్డ్స్ ఇవ్వలేదు. దురదృష్టవశాత్తు, మోడల్ స్కూల్ టీచర్ చనిపోతే కుటుంబానికి కనీసం ఫ్యామిలీ పెన్షన్ కూడా ఇవ్వడం లేదు. కారుణ్య నియామకం పథకం వర్తించదు. వారసులకు ఉద్యోగం ఇవ్వరు. కుటుంబం రోడ్డున పడాల్సిందే. మిగతా ఉద్యోగులకు ఇస్తున్న రూ.16 లక్షల డెత్ కం రిటైర్మెంట్ గ్రాట్యుటీ సైతం చెల్లించడం లేదు.
ప్రమోషన్లు లేవు
ఈ టీచర్లు నియామకమై పుష్కర కాలం దాటింది. ఈ సుదీర్ఘ కాలంలో కనీసం ఒక్కసారి కూడా ప్రమోషన్లు ఇవ్వలేదు. ఇప్పటివరకు మోడల్ స్కూల్ టీచర్ పోస్టులను నూతన జోనల్ విధానానికి అనుగుణంగా క్యాడర్ రీఆర్గనైజ్ చేసి అలాట్మెంట్ కూడా చేయలేదు. ఈ పని పూర్తిచేస్తే తప్ప, ప్రమోషన్లు కల్పించడం సాధ్యం కాదు. 2013-–18 పీరియడ్‌కు సంబంధించిన సీపీఎస్ పది శాతం మ్యాచింగ్ గ్రాంట్ కూడా ప్రభుత్వం ఇంత వరకు విడుదల చేయలేదు. ప్రాన్ నంబర్స్ ఆలస్యంగా కేటాయించడంతో ఈ పరిస్థితి ఏర్పడిందని చెప్తున్న అధికారులు, ప్రాన్ నంబర్స్ కేటాయించి ఆరేండ్లు దాటినా టీచర్ల అకౌంట్లలో డబ్బు ఎందుకు జమచేయడం లేదో చెప్పడం లేదు.
సీఎం చొరవ చూపాలి!
విద్యాశాఖను సైతం నిర్వహిస్తున్న సీఎం రేవంత్ రెడ్డి మోడల్ స్కూల్ టీచర్లు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారానికి సత్వరం చొరవ చూపాలి. మోడల్ స్కూల్ టీచర్ల జీతాలను వెంటనే 010 హెడ్- ఆఫ్- అకౌంట్‌కు మార్చాలి. ప్రతి నెలా ఒకటో తేదీన వేతనాలు చెల్లించాలి. టీచర్ల అన్ని బెనిఫిట్స్‌ను అమలు చేయాలి. చనిపోయిన మోడల్ టీచర్ కుటుంబాలకు ఫ్యామిలీ పెన్షన్, డెత్ కం రిటైర్మెంట్ గ్రాట్యుటీ మంజూరు చేయాలి. అర్హత కల్గిన పీజీటీలకు ప్రిన్సిపాల్స్‌గా, టీజీటీలకు పీజీటీలుగా ప్రమోషన్లు కల్పించాలి. 2013-–18 మధ్య కాలానికి పెండింగ్‌లో పెట్టిన సీపీఎస్ మ్యాచింగ్ గ్రాంట్ విడుదల చేసి ఉపాధ్యాయుల ప్రాన్ అకౌంట్లలో జమ చేయాలి. సెకండ్ స్పెల్‌లో నియామకమైన మోడల్ టీచర్లకు ఫస్ట్ స్పెల్‌లో అపాయింటైన టీచర్లతో సమానంగా పే ఫిక్స్ చేసి 2025 ఏప్రిల్ నుంచి నగదు చెల్లించాలని పేర్కొంటూ హైకోర్టు జారీ చేసిన ఉత్తర్వులను వెంటనే అమలు చేయాలి. గత 12 ఏండ్లుగా తాము పడుతున్న ఇబ్బందులను సీఎం సానుభూతితో
పరిశీలించి తగు చర్యలు తీసుకోవాలని మోడల్ స్కూల్ టీచర్లం కోరుతున్నాం.
హైకోర్టు చెప్పినా అమలుకావడం లేదు
జూన్ 2013లో జాయిన్ అయిన మొదటి విడత మోడల్ టీచర్లతో సమానంగా సెకండ్ స్పెల్‌లో జాయిన్ అయిన టీచర్లకు వేతన స్థిరీకరణ చేసి, ఏప్రిల్ ఒకటి 2025 నుంచి పెరిగిన శాలరీ చెల్లించాలని ప్రభుత్వాన్ని ఆదేశిస్తూ రాష్ట్ర హైకోర్టు ఈ ఏడాది ఏప్రిల్ 2న ఉత్తర్వులు జారీ చేసింది. ఈ ఉత్తర్వుల అమలుకు అధికారులు ఇంతవరకు ఎలాంటి చర్యలూ తీసుకోకపోవడంతో టీచర్ల తీవ్ర నిరాశా నిస్పృహల్లో ఉన్నారు. ఈ సమస్యలు, ఇబ్బందులు తట్టుకోలేక 2014 నుంచి
చాలామంది మోడల్ స్కూల్ టీచర్లు ఈ కొలువు వద్దంటూ ఉద్యోగాలను వదిలేసి వెళ్లిపోయారంటే పరిస్థితి ఊహించుకోవచ్చు.
- మానేటి ప్రతాపరెడ్డి,
గౌరవాధ్యక్షుడు, టీఆర్టీఎఫ్