ఫోర్జరీలు, ఫేక్ డాక్యుమెంట్లతో రిజిస్ట్రేషన్లు..!

ఫోర్జరీలు, ఫేక్ డాక్యుమెంట్లతో  రిజిస్ట్రేషన్లు..!
  • జగిత్యాల జిల్లాలో రిజిస్ట్రేషన్ ఆఫీసుల్లో ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్న అక్రమాలు
  • ఇటీవల మెట్‌‌పల్లిలో ఏసీబీ రైడ్స్‌‌ 
  • తాజాగా ఫేక్ డాక్యుమెంట్లతో రిజిస్ట్రేషన్‌‌.. కేసు నమోదు
  • డాక్యుమెంట్‌‌​రైటర్లు, ప్రైవేట్​ అటెండర్లతో అక్రమాలకు తెర 

రాయికల్‌‌కు చెందిన పి.రవి ప్రసాద్, పి.శ్రీనివాస్ అన్నదమ్ములు. వారి పేరిట జాయింట్ ప్రాపర్టీ ఉంది. ఈ ప్రాపర్టీపై 2022లో కోర్టు కేసు ఉండగా.. శ్రీనివాస్ తానే రవిప్రసాద్‌‌గా ధృవీకరించుకుంటూ, నకిలీ ఓటర్ ఐడీ సృష్టించాడు. దీనికి తోడు మాజీ కౌన్సిలర్ వి.మహేశ్‌‌ తన లెటర్‌‌ ప్యాడ్‌‌పై ఇద్దరికి ఒకే వ్యక్తి అని ధృవీకరించాడు. ఈ పత్రాల ఆధారంగా జగిత్యాల సబ్ రిజిస్ట్రేషన్ ఆఫీసులో రిజిస్ట్రేషన్ జరిగిందని బాధితుడు రవి ప్రసాద్ రాయికల్ పీఎస్‌‌లో ఫిర్యాదు చేయడంతో ఇటీవల ఆఫీసులో విచారణ చేపట్టారు.

జగిత్యాల, వెలుగు:  జగిత్యాల రిజిస్ట్రేషన్ శాఖలో ఫోర్జరీలు, ట్యాంపరింగ్‌‌లతో రిజిస్ట్రేషన్లలో అక్రమాలు జోరుగా సాగుతున్నాయి. ఇటీవలి మెట్‌‌పల్లి ఏసీబీ రైడ్స్‌‌ తర్వాత అప్రమత్తమైన కొందరు అధికారులు కొత్త రూట్ ఎంచుకున్నట్లు సమాచారం. రిజిస్ట్రేషన్లలో అవినీతికి తెరలేపుతూ, తామెక్కడా చిక్కుకోకుండా కొందరు డాక్యుమెంట్ రైటర్లు, ప్రైవేట్ అటెండర్ల సాయంతో ఫేక్ పత్రాలతో రిజిస్ట్రేషన్లకు సహకరిస్తున్నారని ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. అప్పట్లో జీపీ సెక్రటరీ సంతకాలు ఫోర్జరీ చేసిన సర్టిఫికేట్‌‌లతో రిజిస్ట్రేషన్లు జరిగిన ఘటన వెలుగులోకి రాగా.. తాజాగా ఫేక్ డాక్యుమెంట్లతో రిజిస్ట్రేషన్లు జరగడం కలకలం రేపుతోంది.

కొర్రీల పేరిట దోపిడి

రిజిస్ట్రేషన్ శాఖలో పాత పాస్‌‌ బుక్‌‌ల్లో ఉన్న ల్యాండ్‌‌కు రూ.లక్షల్లో వసూలు చేస్తూ రిజిస్ట్రేషన్లు చేస్తున్నారన్న ఆరోపణలు ఉన్నాయి. లే అవుట్‌‌ల అక్రమ రిజిస్ట్రేషన్లను అరికట్టేందుకు ప్రభుత్వం పార్ట్ రిజిస్ట్రేషన్లు (ఒకే డాక్యుమెంట్‌‌లోని ల్యాండ్‌‌ను ఒక్కరికి మించి ఇవ్వకూడదు) నిషేధించినా, జీపీ పరిధిలోని ల్యాండ్‌‌కు రూ.5 వేల నుంచి, మున్సిపల్ ల్యాండ్ అయితే రూ.10 వేల వరకు మామూళ్లు తీసుకుంటున్నారని సమాచారం. 

ఇంటి పర్మిషన్, బ్లూ ప్రింట్ కొర్రీల పేరుతో మరో రూ.20 వేలకు పైగా వసూలు చేస్తున్నట్లు సమాచారం. కొందరు అవినీతి అధికారులు ఫేక్ అసెస్‌‌మెంట్‌‌ డాక్యుమెంట్లు, జీపీ పర్మిషన్ పత్రాలు, ట్యాక్స్ పేమెంట్ రసీదులు సృష్టించి అక్రమ రిజిస్ట్రేషన్లకు తోడ్పడుతున్నారని ఆరోపణలు ఉన్నాయి. నాన్ లే అవుట్ ఫ్లాట్లు, బ్లాక్‌‌ లిస్ట్‌‌ లో ఉన్న సర్వే నంబర్ల ల్యాండ్ రిజిస్ట్రేషన్లకు రూ.లక్షల్లో మామూళ్లు వసూలు చేస్తున్నారని సమాచారం.

ఇటీవల జరిగిన ఘటనలు కొన్ని.. 

మూడు నెలల కింద వెల్గటూర్ మండలం పైడిపల్లి గ్రామానికి చెందిన ఖ్యాతం బుచ్చయ్య ఇంటి నంబర్ 186 పేరిట నకిలీ ఓనర్‌‌ షిప్ పత్రం తయారు చేశారు. ఇందులో ఫోర్జరీ సంతకాలు, గ్రామ పంచాయతీ స్టాంపులు డమ్మీవని తేలింది. వీటి ఆధారంగా రిజిస్ట్రేషన్ చేసి, బ్యాంకు లోన్‌‌కు కూడా వెళ్లారు. దీనిపై జీపీ సెక్రటరీ గంగాధర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఇలాంటి ఫేక్ ఓనర్‌‌షిప్ సర్టిఫికేట్‌‌లు వందల్లో ఉన్నాయని సెక్రటరీలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

ఇబ్రహీంపట్నం మండలం తిమ్మాపూర్ గ్రామానికి చెందిన సుంకె విష్ణుకు మెట్‌‌పల్లి సాయిరామ్ నగర్ కాలనీలో 266 గజాల స్థలం ఉంది. దీనిని మార్టిగేజ్ చేసేందుకు సబ్ రిజిస్ట్రార్ ఆసిఫుద్దీన్‌‌ను సంప్రదించగా, ఆయన సబార్డినేట్ బానోతు రవిని కలవమన్నారు. రవితో మాట్లాడగా రూ.10 వేలు ఇవ్వాలని చెప్పగా, రూ.5 వేలకు ఒప్పందం కుదిరింది. అనంతరం విష్ణు ఏసీబీ అధికారులను ఆశ్రయించి, వారి సూచనలతో రవికి డబ్బులు ఇవ్వగా, అక్కడే ఏసీబీ అధికారులు రవిని రెడ్‌‌హ్యాండెడ్‌‌గాపట్టుకున్నారు.

ఇల్లీగల్ రిజిస్ట్రేషన్ల సమయంలో లీవ్..?

జగిత్యాల జిల్లాలో జగిత్యాల, కోరుట్ల, మెట్‌‌పల్లి, మల్యాల సబ్‌‌రిజిస్ట్రార్ ఆఫీసులు ఉన్నాయి. ఈ ఆఫీసుల్లో పని చేసే కొందరు అధికారులు, సిబ్బందిపై అవినీతి ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఇల్లీగల్ రిజిస్ట్రేషన్ల సమయంలో కొందరు సబ్ రిజిస్టర్లు లీవ్ పెట్టి కింది స్థాయి అధికారులకు బాధ్యతలు అప్పగించి వెళ్లిపోతున్నారని సమాచారం. మరికొందరు అయితే పంపకాలలో తేడాలు రాకుండా తాము లీవులో ఉన్నప్పుడు రిజిస్ట్రేషన్లు చేయొద్దని రైటర్లకు అనధికారిక ఆదేశాలు జారీ చేస్తున్నట్లు తెలిసింది. ఈ వసూళ్ల కోసం కొందరు ప్రైవేట్ అటెండర్లు, రైటర్లను ఏజెంట్లుగా నియమించుకున్నారు.