
హైదరాబాద్ సిటీలో పలు ప్రాంతాల్లో మోస్తరు నుంచి భారీవర్షం కురిసింది. ఉదయం నుంచి హాట్ హాట్ గా ఉన్న వాతావరణం సాయంత్రానికి ఒక్కసారిగా మారిపోయింది. ఉన్నట్టుండి ఆకాశంలో మేఘాలు కమ్ముకున్నాయి. ఆదివారం (మే18) సాయంత్రం హైదరాబాద్ లోని పలు చోట్ల వానపడింది.
హిమాయత్ నగర్,బషీర్ బాగ్, మియాపూర్ లో మోస్తరు వానలు కురవగా.. చందానగర్, గచ్చిబౌలిలో దంచికొట్టింది. ఇవాళ్టినుంచి మరో మూడు రోజుల పాటు హైదరాబాద్ నగరవ్యాప్తంగా వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అలెర్ట్ చేసింది.
ALSO READ | Rain Alert: ఈ జిల్లాల్లో రానున్న మూడు రోజులు భారీ వర్షాలు.. హైదరాబాద్ లో కూడా..
మరోవైపు తెలంగాణలోని పలు జిల్లాలో ఆదివారం సాయంత్రం వానలు కురిశాయి.మహబూబ్ నగర్ జిల్లాలో భారీ వర్షం కురిసింది.మధ్యాహ్నం నుంచే దక్షిణ తెలంగాణ అంతటా ఎడతెరిపి లేకుండా ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురుస్తున్నాయి. గద్వాల్ జిల్లా రాజోలి మండలం మందొడ్డిలో ఉరుములు , మెరుపులతో భారీ వర్షం కురిసింది. పలుచోట్ల పిడుగులు పడ్డాయి.
ఆదివారం సాయంత్రం మహబూబ్ నగర్ జిల్లాలోని పలు ప్రాంతాల్లో వర్షం కురిసింది. మూసాపేట్ మండలంలో ఉరుములు , మెరుపులతో కూడిన వాన పడింది. నారాయణపేట్ జిల్లాలో కూడి వర్షం పడింది. కరువు పీడిత ప్రాంతాలైన వనపర్తి, గద్వాల్, నారాయణపేట, మహబూబ్ నగర్, రంగారెడ్డి, నాగర్ కర్నూల్ లలో ఈ రాత్రికి మరోసారి వానలు పడే ఛాన్స్ ఉంది.
రంగారెడ్డి జిల్లాలో రానున్న 2గంటల్లో ఉరుములు, మెరుపులు, ఈదురు గాలులతో కూడిన వర్షం కురిసే అవకాశం ఉంది. కొన్ని చోట్ల పిడుగులు పడే అవకాశం ఉంది. వికారాబాద్,సంగారెడ్డి, మహబూబ్ నగర్, మెదక్, కామారరెడ్డి జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులతో వర్షం కురవనుందని ఐఎండీ హెచ్చరించింది. రంగారెడ్డి, నాగర్‌కర్నూల్, సూర్యాపేటలోని కొన్ని ప్రాంతాలు, నల్గొండలో మరో రెండు 2గంటలకు అక్కడక్కడా చిరుజల్లుల నుంచి మోస్తరు వర్షాలు పడే ఛాన్స్ ఉంది.