న్యూఢిల్లీ, వెలుగు: ప్రధానిగా, గుజరాత్ సీఎంగా మోదీ పాతికేళ్ల సుపరిపాలన, అభివృద్ధి ప్రస్థానాన్ని కొత్త తరానికి చాటాలని పార్టీ శ్రేణులకు బీజేపీ చీఫ్ నితిన్ నబీన్ దిశానిర్దేశం చేశారు. ఆదివారం ఢిల్లీలో దీన్ దయాళ్ మార్గ్ (ఎక్స్‌టెన్షన్)లో పార్టీ పదాధికారుల సమావేశం రెండో రోజు కొనసాగింది. ఈ భేటీలో పార్టీ నేషనల్ జనరల్ సెక్రటరీ (సంస్థాగత) బీ.ఎల్. సంతోష్, జాతీయ ఉపాధ్యక్షుడు, జాతీయ ప్రధాన కార్యదర్శులు, వివిధ రాష్ట్రాల అధ్యక్షులు, ఇన్‌చార్జిలు పాల్గొన్నారు.
తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు రాంచందర్‌రావు, మాజీ ఎమ్మెల్సీ పొంగులేటి సుధాకర్ రెడ్డి, ఇతర నేతలు హాజరయ్యారు. మోదీ పుట్టినరోజు సెప్టెంబర్ 17 నుంచి అక్టోబర్ 17 వరకు ( నెల రోజులు) ‘సేవా సంకల్ప అభియాన్’ పేరిట కార్యక్రమాలు చేపట్టాలని అధిష్టానం నిర్ణయించింది. లబ్ధిదారులను నేరుగా భాగస్వాములను చేస్తూ ప్రజాసేవ ద్వారా ఈ ప్రోగ్రాంను సక్సెస్ చేయాలని సమావేశంలో ఏకగ్రీవ తీర్మానం చేశారు.
