- మీర్జాలగూడ నుంచి మల్కాజ్గిరి చౌరస్తా వరకు..
- అడుగడుగునా స్వాగతం పలికిన బీజేపీ శ్రేణులు
- గంట ఆలస్యంగా మోదీ రాక
- ఇయ్యాల నాగర్ కర్నూల్లో, ఎల్లుండి జగిత్యాలలోపర్యటన
హైదరాబాద్/ సికింద్రాబాద్, వెలుగు: ప్రధాని నరేంద్ర మోదీ మల్కాజ్‌గిరిలో శుక్రవారం భారీ రోడ్ షో నిర్వహించారు. సాయంత్రం 6.15 గంటలకు ప్రారంభమైన రోడ్ షో సాయంత్రం 7 గంటల వరకు సాగింది. అయితే, సాయంత్రం 5.15 గంటలకు రోడ్ షో ప్రారంభం కావాల్సి ఉండగా, గంట ఆలస్యంగా మొదలైంది. కేరళ నుంచి సాయంత్రం బేగంపేట ఎయిర్‌పోర్టుకు చేరుకున్న ప్రధాని మోదీ.. అక్కడి నుంచి నేరుగా మల్కాజ్గిరి రోడ్‌షోకు వచ్చారు. మీర్జాలగూడ నుంచి ప్రారంభమైన రోడ్ షో మల్కాజ్గిరి క్రాస్‌రోడ్స్ వరకు సాగింది. దాదాపు1.5 కిలో మీటర్ల మేర 40 నిమిషాల పాటు కొనసాగింది. బీజేపీ శ్రేణులు, మోదీ అభిమానులు భారీగా తరలివచ్చారు. మీర్జాల గూడలో స్వాగత వేదిక ఏర్పాటు చేసి మోదీకి బీజేపీ నాయకులు ఘన స్వాగతం పలకగా, మల్కాజ్గిరి చౌరస్తాలో మరో వేదిక ఏర్పాటు చేసి గ్రాండ్ వెల్కమ్ చెప్పారు. దాదాపు ఒకటిన్నర కిలో మీటర్ల వరకు సాగిన ఈ రోడ్ షోలో ప్రధాన మంత్రి చిరునవ్వుతో ప్రజలకు అభివాదం చేస్తూ ముందుకు సాగారు.
ప్రధాని వాహనంపై సికింద్రాబాద్ లోక్‌సభ నియోజకవర్గ అభ్యర్థి, కేంద్రమంత్రి జీ కిషన్‌రెడ్డి, మల్కాజ్గిరి పార్లమెంట్ నియోజకవర్గ అభ్యర్థి ఈటల రాజేందర్‌కు మాత్రమే అవకాశం కల్పించారు. రోడ్ షో ముగియగానే.. ప్రధాని తన కాన్వాయ్‌లో ఆనంద్‌బాగ్ చౌరస్తా నుంచి కోకాకోలా, లాలాపేట, తార్నాక మీదుగా రాజ్‌భవన్‌కు వెళ్లారు.
రెండు గంటల ముందే చేరుకున్న కార్యకర్తలు...
సాయంత్రం 5.15 గంటలకు మోదీ రోడ్‌షోలో పాల్గొంటారని ముందుగా షెడ్యూల్ ఖరారు చేశారు. దీంతో సాయంత్రం నాలుగు గంటలకే బీజేపీ నాయకులు, కార్యకర్తలు భారీగా మల్కాజ్గిరి, మీర్జాలగూడ ప్రాంతాలకు తరలివచ్చారు. రోడ్డుకు ఇరువైపుల నిలబడి వేచిచూశారు. అయితే మోదీఈ రోడ్‌షోకు గంట ఆలస్యంగా వచ్చారు. ప్రధానమంత్రి రోడ్‌షో నేపథ్యంలో మీర్జాలగూడ నుంచి మల్కాజ్గిరి, అటు ఆనంద్‌బాగ్ చౌరస్తా వరకు రోడ్డుకు ఇరువైపులా పోలీసులు బారికేడ్లు ఏర్పాటు చేశారు. ఇటు మీర్జాలగూడ, అటు మల్కాజిగిరి చౌరస్తాలో రోడ్లను పూర్తిగా మూసివేశారు. రోడ్డుకు రెండు వైపులా బారికేడ్లు ఏర్పాటు చేశారు. పాదచారులకు మాత్రమే రోడ్డుకు ఒక వైపు అనుమతించారు. ఈ రోడ్ షోకు మల్కాజ్ గిరి పార్లమెంటుతో పాటు చుట్టుపక్కల పార్లమెంట్ నియోజకవర్గాల నుంచి బీజేపీ శ్రేణులు హాజరయ్యాయి. రోడ్ షోకు వచ్చిన వారి వాహనాలను దాదాపు కిలోమీటరు దూరంలో పార్కింగ్‌కు అనుమతించారు.
ఎల్లుండి జగిత్యాలలో..
ప్రధాని మోదీ ఆదివారం రాత్రి 7.45కు బేగంపేట ఎయిర్‌పోర్టు కు విరానున్నారు. రాత్రి 8 గంటలకు రాజ్ భవన్ చేరుకొని, అక్కడే బస చేయనున్నారు. సోమవారం ఉదయం 10 గంటలకు రాజ్ భవన్ నుంచి మొదలై..10.15 గంటలకు బేగంపేట నుంచి జగిత్యాలకు వెళ్తారు. 11.15 గంటలకు జగిత్యాలకు చేరుకోనున్నారు. ఉదయం 11.30 నుంచి 12.20 వరకు జరిగే బహిరంగ సభలో ఆయన పాల్గొంటారు. 12.30 గంటలకు ఆయన అక్కడి నుంచి హైదరాబాద్ కు తిరుగుపయనమవుతారు.
నేడు మోదీ సభ
నాగర్ కర్నూల్లో శనివారం ఏర్పాటు చేయనున్న భారీ బహిరంగ సభలో ప్రధాని మోదీ పాల్గొన నున్నారు. ఉదయం 10.45 గంటలకు రాజ్ భవన్ నుంచి ఆయన బయలుదేరి..11 గంటలకు బేగంపేట ఎయిర్‌పోర్టుకు చేరుకుంటారు. మధ్యాహ్నం 12 గంటలకు నాగర్ కర్నూల్లో బహిరంగ సభాస్థలి వద్దకు వస్తారు. అనంతరం ఒంటి గంటకు గుల్బర్గా వెళ్తారు.
