మద్దతు ధర, మార్కెట్..​ రెండూ ఉంటాయని రైతులకు మోడీ భరోసా

మద్దతు ధర, మార్కెట్..​ రెండూ ఉంటాయని రైతులకు మోడీ భరోసా
  • ప్రతిపక్షాలు తప్పుడు ప్రచారం చేస్తున్నాయి
  • రైతులు తమ పంటలను దేశంలో ఎక్కడైనా అమ్ముకోవచ్చు
  • ఎలాంటి నిర్బంధాలు ఉండవు.. దళారీ వ్యవస్థ నుంచి విముక్తి లభిస్తుంది
  • స్టార్టప్స్​ పెట్టేందుకు యువతకు మరింత చాన్స్​ దొరుకుతుంది
  • డెయిరీ రంగంలోనూ మార్పులు వస్తాయని వెల్లడి

న్యూఢిల్లీఅగ్రి బిల్లులపై ప్రతిపక్షాలు తప్పుదోవ పట్టిస్తున్నాయని ప్రధాని నరేంద్రమోడీ మండిపడ్డారు. రైతుల ఓటు బ్యాంకు ఎక్కడ కోల్పోతామోనన్న భయంతో అబద్ధాలు చెప్తున్నాయని విమర్శించారు. ‘‘వాళ్లు(అపోజిషన్​) చాలా ఇబ్బంది పడుతున్నారు. పంటలకు కనీస మద్దతు ధర దక్కదంటున్నారు. మండీలు ఉండయంటున్నారు. ఆ ప్రచారాన్ని ఎవరూ నమ్మొద్దు. కనీస మద్దతు ధర ఇంతకు ముందు ఎట్ల కొనసాగిందో ఇక ముందూ కొనసాగుతుంది. అంతకంటే ఎక్కువ మద్దతు ధర లభిస్తుంది. అగ్రికల్చర్​ మార్కెట్లు(మండీలు) ఎక్కడికీ పోవు. పైగా ఎన్డీయే సర్కారు మొదటినుంచి మండీల మోడ్రనైజేషన్​కు కృషి చేస్తోంది. మండీల వ్యవస్థకు ఈ బిల్లులు ఏ మాత్రం వ్యతిరేకం కావు” అని ఆయన స్పష్టం చేశారు. పంటలకు మద్దతు ధరపై స్వామినాథన్​ కమిషన్​ చేసిన సిఫార్సులను చాలా ఏండ్లు పక్కన పడేసిన పార్టీ (కాంగ్రెస్​).. తాము రైతులకు ప్రయోజనం చేకూర్చే చట్టాలు తెస్తుంటే విమర్శలు చేస్తోందని ప్రధాని దుయ్యబట్టారు. పార్లమెంట్​ ఆమోదించిన రెండు అగ్రి బిల్లులు చరిత్రాత్మకమైనవని, 21వ శతాబ్దానికి ఇవి ఎంతో అవసరమని చెప్పారు. వీటితో రైతులకు పూర్తి స్వేచ్ఛ, రక్షణ లభిస్తుందన్నారు. సోమవారం బీహార్ లో రూ.14,258 కోట్లు విలువైన 9 నేషనల్ హైవే ప్రాజెక్టులకు ఆన్ లైన్ ద్వారా ఆయన శంకుస్థాపన చేశారు. 45,945 గ్రామాలను కనెక్ట్ చేసే ఆప్టికల్ ఫైబర్ ఇంటర్నెట్ సర్వీసెస్ ను కూడా ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. రైతుల ఆదాయాన్ని పెంచేందుకు తాము కట్టుబడి ఉన్నామని చెప్పారు.తాము తీసుకువచ్చిన అగ్రి బిల్లులతో ఆ దిశగా వేగంగా అడుగులు పడుతాయన్నారు.

ఎవరు మీవైపు ఉన్నారో ఆలోచించండి

‘‘దేశంలో చాలా మంది చిన్న సన్నకారు రైతులే. వారికున్న తక్కువ భూమిలో పంటలు పండించడానికి ఎక్కువ ఖర్చు చేయాల్సి వస్తోంది. పంటలకు సరైన మద్దతు కూడా రాని పరిస్థితి. అలాంటి రైతులందరికీ ప్రయోజనం చేకూర్చాలని అగ్రి బిల్లులను కేంద్రం తీసుకువచ్చింది. దీని వల్ల పెట్టుబడి తగ్గుతుంది. సరైన మద్దతు ధర లభిస్తుంది. రైతులు దేశంలో ఎక్కడైనా తమ పంటలను అమ్ముకునే స్వేచ్ఛ ఉంటుంది. ఎవరి నిర్బంధాలు ఉండవు” అని ప్రధాని మోడీ వివరించారు. దళారీ వ్యవస్థ నుంచి రైతులను విముక్తి చేయడానికి తాము ప్రయత్నిస్తుంటే.. ప్రతిపక్షాలు అబద్ధాలు చెప్తూ కాలం గడుపుతున్నాయని విమర్శించారు. ‘‘ఎవరు మీ వైపు ఉన్నారో ఆలోచించండి. ఇన్నేండ్లు దేశాన్ని పాలించిన పార్టీ మీకోసం ఏం చేసిందో పరిశీలించండి. ఆరేండ్లుగా మేం ఏం చేస్తున్నామో ఆలోచించండి” అని రైతులకు సూచించారు.

స్టార్టప్స్​కు చాన్స్​

కొత్త చట్టాలతో రైతులందరికీ ఆధునిక టెక్నాలజీ అందుబాటులోకి, సాగు విస్తీర్ణం పెరుగుతుందని చెప్పారు. యువత కూడా అగ్రికల్చర్​ సెక్టార్​లో అడుగుపెట్టేందుకు ఎక్కువ అవకాశం ఉంటుందని, ఈ సెక్టార్​లో వారు స్టార్టప్స్​ పెట్టుకునే చాన్స్​ లభిస్తుందన్నారు. డెయిరీ రంగంలోనూ మార్పులు  వస్తాయని చెప్పారు. ‘‘అగ్రికల్చర్ సెక్టార్ లో మార్పుల కోసం జూన్ లో తీసుకొచ్చిన ఆర్డినెన్స్ లను ఈ బిల్లులు రీప్లేస్ చేస్తాయి. పలు రాష్ట్రాల్లో రైతులు తమ పంటలకు మంచి రేటు అందుకుంటున్నారని గ్రౌండ్ రిపోర్స్ట్ చెబుతున్నాయి. మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్, చత్తీస్ గఢ్, వెస్ట్ బెంగాల్ లో పంటలు బాగున్నాయి. గత ఏడాదితో పోలిస్తే వారికి ఈ సారి 15 నుంచి 25 శాతం ఎక్కువ ఇన్ కమ్ వస్తుంది’’ అని అన్నారు.  వ్యవసాయ రంగంలో పెద్ద ఎత్తున మార్పుల కోసమే రెండు బిల్లులను తీసుకొచ్చినట్లు ఆయన చెప్పారు.

వచ్చే ఐదేళ్లలో ఇన్ ఫ్రా కోసం రూ.1.10 లక్షల కోట్లు

దేశంలోని వచ్చే నాలుగైదు ఏళ్లలో ఇన్ ఫ్రాస్ట్రక్చర్ కోసం రూ.1.10 లక్షల కోట్లు ఖర్చు చేస్తామని ప్రధాని నరేంద్ర మోడీ అన్నారు. ఇందులో కేవలం హైవేల నిర్మాణం కోసమే రూ.1.9 లక్షల కోట్లు కేటాయించినట్లు చెప్పారు. వెయ్యి రోజుల్లో ఆరు లక్షల గ్రామాలకు ఇంటర్నెట్ సేవలు అందిస్తామని చెప్పారు. డిజిటల్ ట్రాన్సాక్షన్స్ లో ప్రపంచంలోనే ముందున్నామని, ఒక్క ఆగస్టు నెలలోనే యూపీఐ ద్వారా 3 లక్షల కోట్లు ట్రాన్సాక్షన్స్ జరిగినట్లు తెలిపారు. బీహార్ లో నేషనల్ హైవేల నిర్మాణం వేగంగా జరుగుతోందని,  నార్త్, సౌత్ ను కలుపుతూ 6,  తూర్పు, పడమరను కలుపుతూ 5 ప్రాజెక్టులు కొనసాగుతున్నట్లు చెప్పారు