రేపు మోడీకి సియోల్ శాంతి బహుమతి ప్రధానం

రేపు మోడీకి సియోల్ శాంతి బహుమతి ప్రధానం

టెర్రరిజం, వాతావరణ మార్పులు మానవాళికి పెను సవాళ్లుగా మారాయన్నారు ప్రధాని మోడీ. 2 రోజుల పర్యటన కోసం సౌత్ కొరియా వెళ్లిన మోడీ పలు కార్యక్రమాల్లో పాల్గొన్నారు. పారిశ్రామిక వేత్తలతో సమావేశమయ్యారు. రేపు సియోల్ శాంతి బహుమతిని అందుకోనున్నారు ప్రధాని.  ప్రవాసభారతీయులతో సమావేశమైన ఆయన వచ్చే 15 ఏళ్లలో డెవలప్ మెంట్ లో భారత్ టాప్ త్రీలో ఉంటుందన్నారు. సియోల్ శాంతి బహుమతిని 130 కోట్ల ప్రజల తరపున అందుకుంటున్నానని వెల్లడించారు మోడీ. ఆయుష్మాన్ భారత్ తో 50 కోట్ల మంది పేదలకు లబ్ది కలుగుతోందన్నారు. గత నాలుగేళ్లలో భారత్ వేగంగా అభివృద్ధి చెందిందన్నారు. ఏటా.. 5 కొరియా కుటుంబాలను భారత్ లో పర్యటించేందుకు ప్రోత్సహించాలన్నారు.

సియోల్ లో జరిగిన ఇండియా- కొరియా బిజినెస్ సింపోసియంలో మోడీ పాల్గొన్నారు. భారత్ కు కొరియా అత్యంత ప్రాధాన్య దేశమన్నారు ప్రధాని. ఇండియాలో 6 వందలకు పైగా కొరియా కంపెనీలు ఉన్నాయన్నారు. మేకిన్ ఇండియా, స్టార్టప్ ఇండియా పథకాలు మంచి ఫలితాలు సాధించాయన్నారు ప్రధాని. ఇండియా కొరియా స్టార్టప్ హబ్ లో భాగంగా స్టార్టప్ గ్రాండ్ ఛాలెంజ్ ను ప్రారంభించారు.

సియోల్ లోని ప్రఖ్యాత యోన్ సై యూనివర్శిటీలో మహాత్మాగాంధీ విగ్రహాన్ని ఆవిష్కరించారు ప్రధాని మోడీ. ఈ కార్యక్రమంలో సౌత్ కొరియా అధ్యక్షుడు మూన్ జీ ఇన్, ఐక్యరాజ్య సమితి మాజీ ప్రధాన కార్యదర్శి బాన్ కీ మూన్ పాల్గొన్నారు. గాంధీజీ చూపిన శాంతి మార్గం ప్రపంచానికే ఆదర్శమన్నారు మోడీ. విగ్రహాన్ని ఆవిష్కరించడం సంతోషకరమన్నారు.  సౌత్ కొరియా పర్యటనలో భాగంగా గిమ్హి సిటీ మేయర్ సియోంగ్ గాన్ ను కలిశారు ప్రధాని. ఈ సందర్భంగా బోధి వృక్షాన్ని బహుమతిగా ఇచ్చారు మేయర్.

రెండు రోజుల పర్యటనకు దక్షిణకొరియా వెళ్లిన ప్రధాని మోడీకి సియోల్ విమానాశ్రయంలో ఘనస్వాగతం లభించింది. ఎయిర్ పోర్టు నుంచి లొట్టే హోటెల్ కు వెళ్లిన మోడీకి కొరియాలోని ఎన్నారైలు స్వాగతం పలికారు. వారితో కాసేపు మాట్లాడారు ప్రధాని. శుక్రవారం భారత్ సౌత్ కొరియా మధ్య ద్వైపాక్షిక చర్చలు జరగనున్నాయి.