దమ్ముంటే ఆ మాట చెప్పండి: విపక్షాలకు మోడీ సవాల్

దమ్ముంటే ఆ మాట చెప్పండి: విపక్షాలకు మోడీ సవాల్
  • ఆర్టికల్ 370 రద్దుకు వ్యతిరేకమని మ్యానిఫెస్టోలో పెట్టండి
  • జమ్ము కశ్మీర్.. భారత్ కు కిరీటం
  • ప్రజల మద్దతుతోనే అసాధ్యాన్ని సాధించాం
  • మహారాష్ట్ర ఎన్నికల ప్రచారంలో ప్రధాని మోడీ

ముంబై: ప్రధాని నరేంద్ర మోడీ విపక్షాలపై విరుచుకుపడ్డారు. దమ్ముంటే ఆర్టికల్ 370 రద్దుపై వారి వైఖరిని ఎన్నికల మ్యానిఫెస్టోలో పెట్టాలని సవాల్ విసిరారు. కశ్మీర్ కు ప్రత్యేక ప్రతిపత్తిని కల్పించే ఈ ఆర్టికల్ ను పునరుద్ధరించాలన్న డిమాండ్ తో ప్రజల్లోకి వెళ్లాలని అన్నారు. మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా ప్రధాని మోడీ భండారా జిల్లాలోని సకోలి పట్టణంలో బహిరంగ సభ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన.. ప్రజలు మరోసారి  తమ వెంట నిలవాలని కోరారు. తమకు ప్రజల నుంచి వస్తున్న మద్దతు, తమ ప్రభుత్వంపై ఉంచిన నమ్మకం వల్లే గత ప్రభుత్వాలు ఆలోచించడానికే భయపడిన నిర్ణయాలను అమలు చేయగలుగుతున్నామని చెప్పారు.

ప్రజలు కోరుకున్న విధంగా ఆగస్టు 5న ఆర్టికల్ 370ని రద్దు చేశామన్నారు మోడీ. దేశమంతా తమకు మద్దుతుగా నిలవడం వల్లే అసాధ్యమనుకున్న వాటిని సుసాధ్యం చేయగలిగామని చెప్పారు. జమ్ము కశ్మీర్ లో అప్పటి వరకు వెనుకబడిన వర్గాల అభివృద్ధి అనేది పూర్తిగా నిర్లక్ష్యానికి గురైందని అన్నారు. నేడు వాల్మీకి జయంతి సందర్భంగా జమ్ము కశ్మీర్ లోని వాల్మీకి సోదరుల అభ్యున్నతికి కృషి చేస్తానని చెబుతున్నానని అన్నారు.

కేవలం ఓ ప్రాంతంగా చూడట్లేదు

ఇప్పటి వరకు జమ్ము కశ్మీర్ లో ఉగ్రవాద వ్యాప్తి మాత్రమే జరిగిందని, ఐక్యత అన్న భావననే విచ్ఛిన్నం చేసే భావజాలం నడిచిందని ప్రధాని మోడీ అన్నారు. ఇకపై అక్కడ అభివృద్ధికే ప్రాధాన్యం ఉంటుందని చెప్పారు. జమ్ము కశ్మీర్, లఢక్ ను తాము కేవలం ఓ ప్రాంతంలా చూడడం లేదని, భారత్ కు కిరీటంలా భావిస్తున్నామని చెప్పారు మోడీ. ఆ ప్రాంతంలోని అణువణువూ భారత్ ను శక్తిమంతం చేస్తోందని అన్నారు.

మొసలి కన్నీరు కారుస్తున్నారు

‘విపక్ష నాయకులకు సవాల్ విసురుతున్నా. దమ్ముంటే ఆర్టికల్ 370పై మీ స్టాండ్ ప్రకటించండి. దాన్ని మళ్లీ పునరుద్ధరించాలన్న మీ డిమాండ్ ను ఎన్నికల మ్యానిఫెస్టోలో పెట్టండి. ఈ ప్రతిపక్ష నేతలంతా మొసలి కన్నీరు కారుస్తున్నారు’ అని అన్నారు మోడీ. వాళ్ల స్టాండ్ తో ప్రజల్లోకి వెళ్లే ధైర్యం ఆ పార్టీలకు లేదని, ప్రజలు దాన్ని ఆమోదించదన్నారు.