మన ఎకానమీ 700 లక్షల కోట్లకు: మోడీ

మన ఎకానమీ 700 లక్షల కోట్లకు: మోడీ

మనదేశ ఆర్థిక వ్యవస్థ విలువను త్వరలో 10 ట్రిలియన్‌‌ డాలర్ల (దాదాపు రూ.700 లక్షల కో ట్లు)కు తీసుకెళ్తామని, ప్రపంచంలోనే మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా మార్చుతామని ప్రధాని నరేంద్ర మోడీ ప్రకటించారు. ఢిల్లీలో శనివారం జరిగిన ‘గ్లోబల్‌‌ బిజినెస్‌‌ సమిట్‌‌’ వేదికగా తన ఆలోచనలను పంచుకున్నారు . కరెంటు వాహనాల రంగంలో ఇండియా నంబర్‌‌.1గా నిలవాలని, అసంఖ్యాక స్టార్టప్‌ లకు కేంద్రంగా మారాలని ఆకాంక్షించారు. 2014లో అధికారంలోకి వచ్చిన తమ ప్రభుత్వానికి విధానపరమైన స్తంభన, అధిక ద్రవ్యోల్బణం, అధిక కరెంటు ఖాతాలోటు వారసత్వంగా సంక్రమించాయంటూ ఇది వరకటి యూపీఏ ప్రభుత్వాన్ని తీవ్రంగా విమర్శించారు. అయితే గత 4.5ఏళ్లలో సంస్కరణలు తీసుకురావడం ద్వారా దేశ ఆర్థిక వ్యవస్థను సమూలంగా మార్చామని, మార్పు స్పష్టంగా కనిపిస్తోందని అన్నారు .

అందరికీ ఇంధనం..

పునరుత్పాదక ఇంధనం ఉత్పత్తి లో ప్రపంచానికి ఇండియా ఆదర్శంగా నిలిచేలా చేస్తామని మోడీ హామీ ఇచ్చారు . ప్రతి ఒక్క భారతీయుడికీ ఇంధన భద్రత కల్పిస్తామని వాగ్దానం చేశారు. చమురు దిగుమతులపై ఆధారపడటం తగ్గిస్తామని మోడీ ప్రకటించారు. ఎనర్జీ స్టోరేజీ డివైజ్‌‌లు, కరెంటు వాహనాల ఉత్పత్తి లో ప్రపంచ నాయకుడిగా అవతరిస్తామని ఆశాభావం వ్యక్తం చేశారు. లెక్కలేనన్ని స్టార్టప్‌ లు ఏర్పాటయ్యేందుకు చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. ‘‘గత మూడు పారిశ్రామిక విప్లవాలను మనదేశం ఉపయోగించుకోలేదు. నాలుగో పారిశ్రామిక విప్లవంలో మాత్రం చురుగ్గా పాల్గొంటాం . 2014 నుంచి జరిగిన అభివృద్ధిని చూశాక నాలో ఆత్మవిశ్వాసం మరింత  పెరిగింది. ఏదీ అసాధ్యం కాదు. వచ్చే పార్లమెంటు ఎన్నికల్లో మా నినాదం కూడా ఇదే. ఇండియాలో కొన్ని పనులు అసాధ్యమని గతంలో అనేవారు. ఇక్కడ పరిశుభ్రత అసాధ్యమని అని నిందించేవారు. భారతీయులు స్వచ్ఛ భారత్‌ ను సుసాధ్యం చేశారు. అవినీతిరహిత ప్రభుత్వం ఏర్పడటం కుదరదనే విమర్శ కూడా ఉండేది. ప్రజలు దీనిని కూడా సాధ్యంచేసి చూపెట్టారు’’ అని ఆయన వివరించారు. ఎన్డీయే ప్రభుత్వం పరిశ్రమలకు అనుకూలమైన నిర్ణయాలు తీసుకుంటున్నదన్నారు . రూ.40 లక్షల వరకు టర్నోవర్‌‌ ఉన్న వ్యాపార సంస్థలకు జీఎస్టీ రిజిస్ట్రేషన్ అవసరం లేదు. రూ.60 లక్షల వరకు టర్నోవర్‌‌ ఉన్నవి ఆదాయపు పన్ను కట్టాల్సిన అవసరం లేదు. రూ.1.5 కోట్ల వరకు  టర్నోవర్‌‌ ఉన్న కంపెనీలను పరిహార పథకానికి అర్హులని మోడీ చెప్పారు .