మోడీ చెప్పింది కరెక్టే : మబ్బుల్లో రాడార్లు పనిచేయవు

మోడీ చెప్పింది కరెక్టే : మబ్బుల్లో రాడార్లు పనిచేయవు

మబ్బుల్లో రాడార్లు పనిచేయవు  సాంకేతికతను వివరించిన డీఆర్​డీవో, ఇస్రో మాజీ సైంటిస్టులు

మబ్బులు పట్టినప్పుడు రాడార్లు పనిచేయవా? శత్రు దేశం కంటికి విమానాలేవీ చిక్కవా? అంటే ఓ ఇంటర్వ్యూలో ప్రధాని నరేంద్ర మోడీ అవునని చెప్పిన సంగతి తెలిసిందే. మబ్బుల్లో బాలాకోట్​పై దాడి చేశామని, దానికి కారణం మబ్బులున్నప్పుడు రాడార్లు పనిచేయకపోవడమేనని ఇటీవల ఓ ఇంటర్వ్యూలో ఆయన అన్నారు. దానిపై ప్రతిపక్షాలు ఎంతలా విమర్శలు గుప్పించాయో తెలిసిందే. మోడీ వ్యాఖ్యలను చాలా మంది బీజేపీ నేతలు సమర్థించారు. ఆర్మీ చీఫ్​ జనరల్​ బిపిన్​ రావత్​, ఎయిర్​ మార్షల్​ రఘునాథ్​ నంబియార్​ ఆయన మాటలను సమర్థించారు. తాజాగా డీఆర్​డీవో సైంటిస్టులు, అంతరిక్ష పరిశోధకులు ఆయన మాటలే నిజమంటున్నారు. మబ్బుల్లో రాడార్లు పనిచేయలేవని చెబుతున్నారు.

అన్ని వాతావరణాల్లోనూ పనిచేసినా…

‘‘నేటి రోజుల్లో దాదాపు అన్ని రాడార్లూ అన్ని వాతావరణ పరిస్థితుల్లోనూ పనిచేస్తున్నాయి. మబ్బులు పట్టినా భూమిపై ఉన్న అధునాతన రాడార్ల పనితీరు ఏమీ ఆగిపోదు. కానీ, మేఘాలు దట్టంగా అలుముకున్నప్పుడు మాత్రం వాటి పనితీరుపై ప్రభావం పడుతుంది” అని డీఆర్​డీవో మాజీ సైంటిస్టులు రవి గుప్తా ‘టైమ్స్​ ఆఫ్​ ఇండియా’తో చెప్పారు. ఈ విషయంలో ప్రధాని మోడీ చెప్పింది కరెక్టేనన్నారు. ఆకాశంలోని మేఘాలు బాలాకోట్​ ఆపరేషన్​కు ఎలా సాయపడ్డాయో ఓ మామూలు మనిషికి అర్థమయ్యేలా మాత్రమే మోడీ చెప్పారన్నారు. నిజానికి రెండు రకాల రాడార్లున్నాయన్నారు. ‘‘ఒక రకం రాడార్​ను నిఘా కోసం వాడతారు. వాటినే నిఘా రాడార్లు అంటారు. ఇంకో రకాన్ని శత్రువును ట్రాక్​ చేసేందుకు ఉపయోగిస్తారు. వాటిని ట్రాకింగ్​ రాడార్లు అంటారు. నిఘా రాడార్లు మబ్బులున్నా పనిచేస్తాయి. విద్యుదయస్కాంత తరంగాలు నిటారుగా వెళతాయి కాబట్టి మబ్బులను దాటగలుగుతాయి. ఫలితంగా శత్రు విమానాలను పసిగడతాయి. అయితే, దట్టమైన మేఘాలొస్తే మాత్రం వాటి పనితీరు మందగిస్తుంది. అదే ట్రాకింగ్​ రాడార్లయితే దట్టమైన మబ్బుల్లో వేగంగా దూసుకెళుతున్న విమానాల కచ్చితమైన జాడను పసిగట్టలేవు. వాటి పనితీరు తగ్గిపోతుంది. అంతేకాదు, ఏరియల్​ స్ట్రైక్స్​పై శత్రు దేశం కౌంటర్​ అటాక్​ చేసే సామర్థ్యం తగ్గుతుంది. తక్కువ ఎత్తులో వెళుతున్నప్పుడు మాత్రమే సర్ఫేస్​ టు ఎయిర్​ మిసైల్స్​ ద్వారాగానీ, డాగ్​ఫైట్​లో గానీ దాడి చేయడానికి వీలుంటుంది. మబ్బుపడితే డాగ్​ఫైట్​ కూడా చాలా కష్టమవుతుంది” అని స్పష్టం చేశారు.

డీటీహెచ్​ సిగ్నళ్లలాగానే

భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) మాజీ సైంటిస్ట్​, ఇస్రో చైర్మన్​ సలహాదారు తపన్​ మిశ్రా కూడా అదే విషయం చెప్పారు. అహ్మదాబాద్​ స్పేస్​ అప్లికేషన్​ సెంటర్​ డైరెక్టర్​గా పనిచేసిన ఆయన దేశీయ సింథటిక్​ అపర్చర్​ రాడార్​ (ఎస్​ఏఆర్​)కు రూపకల్పన చేశారు. శాటిలైట్​, భూమిపై ఉన్న రాడార్ల పనితీరును వివరించారు. ‘‘అంతరిక్షంలోని నిఘా ఉపగ్రహాల్లోని రాడార్లు నిటారుగా భూమిపైకి చూడగలవు. అంటే సిగ్నళ్లు నేరుగా వస్తాయి. మబ్బులు తక్కువగా ఉన్నప్పుడు మాత్రమే అది సాధ్యపడుతుంది. దానికి మంచి ఉదాహరణ డీటీహెచ్​ సిగ్నళ్లే. కొంచెం మబ్బు పట్టినా డీటీహెచ్​ టీవీలకు సిగ్నళ్లు అందవు. అందుకు భూమిపై ఉన్న రాడార్లు పూర్తిగా విభిన్నం. భూమి నుంచి సిగ్నళ్లు పైకి వెళ్లాలి. అలా వెళ్లిన సిగ్నళ్లు టార్గెట్​ను తాకి మళ్లీ రిఫ్లెక్ట్​ అవ్వాలి. ఇలాంటి పరిస్థితుల్లో మబ్బులు పట్టినప్పుడు రెండు విధాలుగా సిగ్నళ్లు పోతాయి. టార్గెట్​ను సిగ్నళ్లు తాకలేవు. మళ్లీ తిరిగి భూమికి పంపలేవు” అని ఆయన వివరించారు. మోడీ లాజిక్​ ప్రకారం మామూలు విమానాలూ మబ్బుల్లో ఉంటే ఎగరలేవన్న ప్రతిపక్షాల విమర్శలకూ ఆయన వివరణ ఇచ్చారు.

మామూలు విమానాలకు ట్రాన్స్పాండర్లే కీలకం

‘‘స్నేహపూర్వక విమానం (ఫ్రెండ్లీ ఎయిర్​క్రాఫ్ట్​) లేదా ప్రయాణికుల విమానాలను ట్రాన్స్​పాండర్​ మోడ్​లో ట్రాక్​ చేస్తారు. రాడార్​ సిగ్నళ్లు వీక్​గా ఉన్నా ఆ విమానాల్లోని ట్రాన్స్​పాండర్లు స్పందిస్తాయి. సిగ్నళ్లను తీసుకుని మళ్లీ తిప్పి పంపుతాయి. ఇక్కడ రాడార్​ సిగ్నళ్లను ట్రాన్స్​పాండర్లతో రీప్లేస్​ చేస్తారన్నమాట. కాబట్టి మబ్బులు పట్టినా, తేలికపాటి వర్షాలు కురిసినా ట్రాన్స్​పాండర్ల ట్రాకింగ్​ అనేది పటిష్టంగా, కచ్చితంగా ఉంటుంది. ఇంకో విషయమేంటంటే విమానాలు, ఏటీసీ (ఎయిర్​ట్రాఫిక్​ కంట్రోల్​) రాడార్లను ఎల్​ అండ్​ ఎస్​ బ్యాండ్​లో తక్కువ తరంగదైర్ఘ్యం (ఫ్రీక్వెన్సీ) వద్ద మాత్రమే వాడతారు. దాని వల్ల సిగ్నళ్లు ఈజీగానే అందుతాయి” అని చెప్పారు. అదే దాడి చేసేందుకు వెళ్లిన యుద్ధ విమానాల్లో ఆ ట్రాన్స్​పాండర్లను స్విచాఫ్​ చేసి పెడతారని, అప్పుడు ఆ విమానం కదలికల ఆధారంగానే దాని జాడను పసిగట్టాల్సి ఉంటుందని చెప్పారు. ఇప్పుడు అత్యంత అధునాతన యుద్ధ విమానాలు వస్తుండడం, అందులోనూ స్టెల్త్​ (శత్రు దేశాన్ని మభ్యపెట్టే తంత్రం) టెక్నాలజీతో వస్తుండడం వల్ల రాడార్​ సిగ్నళ్లకు అది కనిపించడం కొంచెం కష్టమవుతుందని చెప్పారు. జస్ట్​ కొన్ని తరంగాలు మాత్రమే ఆ విమానం నుంచి సిగ్నళ్లను అందుకుంటాయన్నారు. అదే తీవ్రమైన వాతావరణ పరిస్థితుల్లో అది ఇంకా కష్టమవుతుందని వివరించారు. ఇలాంటి సందర్భాల్లో టార్గెట్​కు దగ్గరగా వచ్చినప్పుడు మాత్రమే శత్రు విమానాన్ని గుర్తించేందుకు వీలుంటుందని, అప్పుడు రియాక్షన్​ టైం చాలా తక్కువగా ఉంటుందని చెప్పారు. కాబట్టి అటాక్​ చేయడానికి, వైరి వర్గం నుంచి తప్పించుకోవడానికి ఇలాంటి మబ్బు పట్టిన వాతావరణ పరిస్థితులు అనుకూలిస్తాయని ఆయన వివరించారు.