తెలంగాణ నలుదిక్కులా అభివృద్ధి చెందాలన్నదే బీజేపీ లక్ష్యం

తెలంగాణ నలుదిక్కులా అభివృద్ధి చెందాలన్నదే బీజేపీ లక్ష్యం

తెలంగాణ ప్రజలు డబుల్ ఇంజిన్ సర్కారు కోరుకుంటున్నారని ప్రధాని నరేంద్రమోడీ అన్నారు. సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్లో జరిగిన విజయ సంకల్ప సభలో పాల్గొన్న ఆయన.. తెలంగాణ అభివృద్ధికి నిరంతరం కృషి చేస్తున్నామని చెప్పారు. అభివృద్ధి ఫలాలు ప్రతి ఒక్కరికి చేరేలా చర్యలు తీసుకోవడంతో పాటు  దశాబ్దాలుగా అణచివేతకు గురైనవారిని భాగస్వామ్యుల్ని చేస్తున్నామని అన్నారు. తెలంగాణ నలుదిక్కులా అభివృద్ధి చెందాలన్నదే బీజేపీ లక్ష్యమన్న ప్రధాని.. రాష్ట్రభివృద్ధి కోసం నిరంతరం కృషి చేస్తున్నట్లు చెప్పారు.

బీజేపీపై పెరుగుతున్న నమ్మకం

తెలంగాణ ప్రజలకు బీజేపీపై నమ్మకం పెరుగుతోందని నరేంద్రమోడీ అన్నారు. 2019 నుంచి రాష్ట్రంలో మద్దతు పెరుగుతున్న విషయాన్ని ఈ సందర్భంగా గుర్తు చేశారు. గ్రేటర్ ఎన్నికల్లో బీజేపీపై నమ్మకముంచిన జనం.. రాష్ట్రంలో డబుల్ ఇంజిన్ సర్కారు కోసం ఎదురుచూస్తున్నారని చెప్పారు. తెలంగాణ ప్రజల ప్రేమాభిమానాలకు ఆయన ధన్యవాదాలు తెలిపారు. జన్ ధన్ ద్వారా  దేశవ్యాప్తంగా 45 కోట్ల బ్యాంకు ఖాతాలు తెరిస్తే.. అందులో కోటికిపైగా జన్ ధన్ అకౌంట్లు తెలంగాణవేనని చెప్పారు.  ముద్ర, స్టాండ్ అప్ ఇండియా ద్వారా ఇచ్చిన లోన్లలోనూ మహిళలకే పెద్దపీట వేశామని చెప్పారు. చిరు వ్యాపారులు, వీధి వ్యాపారులకు కూడా ప్రత్యేక పథకాల ద్వారా చేయూత ఇచ్చామన్నారు. హైదరాబాద్ నగరంలో ఆధునిక సైన్స్ సిటీ ఏర్పాటుకు తాము ఎంతో కాలంగా కృషి చేస్తున్నామని, అలాంటి సైన్స్ సెంటర్ ఒకటి ఇప్పటికే  సిద్ధమైందన్నారు.

తెలుగు మీడియంలో టెక్నాలజీ, మెడికల్ చదువులు

హైదరాబాద్ ఆధునిక సైన్స్ సిటీ ఏర్పాటుకు బీజేపీ ఎంతో కాలంగా కృషి చేస్తోందని ప్రధాని స్పష్టం చేశారు. హైదరాబాద్ లో ఇప్పటికే అలాంటి సైన్స్ సెంటర్ సిద్ధమైందని చెప్పారు. తెలుగు మీడియంలో టెక్నాలజీ, మెడికల్ చదువులు మొదలైతై.. పేద, గ్రామీణ ప్రాంత విద్యార్థుల కల నెరవేరుతుందని చెప్పారు. రామగుండం ఎరువుల కార్ఖానా కూడా ఆత్మ నిర్భర్ భారత్ లో ముఖ్య భాగంగా నిలుస్తోందని, గతంలో మూతబడ్డ ఈ కార్ఖానాను మళ్లీ తెరిపించి ఉత్పత్తి ప్రారంభించామని అన్నారు. ఇది తెలంగాణతో పాటు యావత్ భారత దేశ రైతులకు వరంగా మారుతుందని అభిప్రాయపడ్డారు.

పరాక్రమానికి పుట్టినిల్లు తెలంగాణ

తెలంగాణ పరాక్రమానికి పుట్టినిల్లని, రాష్ట్ర ప్రజలు అంకితభావానికి పెట్టింది పేరని ప్రధాని మోడీ అన్నారు. భద్రాద్రి సీతారాముడి నుంచి యాదాద్రి నరసింహస్వామి దాకా.. ఆలంపూర్ జోగుళాంబ నుంచి వరంగల్ లోని భద్రకాళి దాకా.. రామప్ప నుంచి కాకతీయ తోరణం దాకా తెలంగాణ ఆర్కిటెక్చర్ గర్వం కలిగిస్తుందని చెప్పారు. భద్రాచలం రామదాసు నుంచి పాల్కురికి సోమనాథుడి వరకు ఇక్కడి పుడమి గొప్పతనం గురించి ఎంత చెప్పినా తక్కువేనని, ఇది యావత్ దేశానికి స్ఫూర్తినిస్తుందన్నారు. ఇలాంటి తెలంగాణను అభివృద్ధి చేయడానికి బీజేపీ తొలి ప్రాధాన్యం ఇస్తుందని చెప్పారు. ఆత్మ నిర్భర్ భారత్ సాధన కోసం పని చేస్తున్నామని చెప్పారు. 

కరోనా సమయంలో ప్రతి కుటుంబానికి సాయం

కరోనా సమయంలో తెలంగాణలో ప్రతి కుటుంబానికి సాయం చేశామని, వేగంగా కరోనా వ్యాక్సిన్లు అందించామని వివరించారు. ఉచితంగా రేషన్, పేదలకు ఉచిత వైద్యాన్ని అందించామని, అందుకే సగటు భారతీయుడికి బీజేపీపై విశ్వాసం ఉందన్నారు. తెలంగాణ ప్రజలకు కూడా ఆ నమ్మకం పెరుగుతూనే ఉన్నట్లు కనిపిస్తోందన్నారు. ‘కనుచూపు మేర యువతే కనిపిస్తోంది. మీ ఉత్సాహాన్ని దేశం మొత్తం చూస్తోంది. 2019 ఎన్నికల సమయంలో తెలంగాణలో బీజేపీకి లభించిన మద్దతు పెరుగుతూనే ఉంది’ అని వ్యాఖ్యానించారు.   

తెలంగాణ రోడ్డు రవాణాను మరింత అభివృద్ధి చేస్తాం

రూ.35వేల కోట్ల కంటే ఎక్కువ విలువ చేసే తెలంగాణలోని 5 జల ప్రాజెక్టులపైనా కేంద్ర ప్రభుత్వం పని చేస్తోందని ప్రధాని మోడీ చెప్పారు. గత 6 ఏళ్లలో కేంద్ర ప్రభుత్వం తెలంగాణ రైతుల నుంచి రూ.లక్ష కోట్ల ధాన్యాన్ని సేకరించిందని, ఆ డబ్బులు కూడా చెల్లించామన్నారు. వరి  ధాన్యానికి రూ.80 మద్దతు ధరను పెంచి, దాన్ని క్వింటాకు రూ.2వేలకు చేర్చామన్నారు. హైదరాబాద్ లో ప్రజలకు మరిన్ని రవాణా వసతులను కల్పించడానికి రూ.1500 కోట్లు కేటాయించామని,  వీటితో నాలుగు, ఆరు లేన్ల మరిన్ని ఫ్లై ఓవర్లు, ఎలివేటెడ్ కారిడార్లు అందుబాటులోకి వస్తాయని తెలిపారు. తెలంగాణ రోడ్డు రవాణాను మరింత అభివృద్ధి చేస్తామని హామీ ఇచ్చారు. 350 కిలోమీటర్ల విస్తీర్ణంలో ఉండే రీజనల్ రింగ్ రోడ్డు కూడా హైదరాబాద్ లో  నిర్మించబోతున్నామని చెప్పారు. పల్లెలను నేషనల్ హైవేలతో కలుపుతూ 2700 కిలోమీటర్ల కంటే ఎక్కువ విస్తీర్ణంలో రోడ్లు వేశామన్నారు. తెలంగాణలో ఇప్పుడు 5000 కిలోమీటర్ల పొడవైన హైవే నెట్ వర్క్ వచ్చిందంటే కారణం.. కేంద్ర ప్రభుత్వమే అన్నారు. 

తెలంగాణలో మెగా టెక్స్ టైల్ పార్క్ 

తెలంగాణ రాష్ట్రంలో మెగా టెక్స్ టైల్ పార్క్ రాబోతోందని ప్రధాని మోడీ ప్రకటించారు. టెక్స్ టైల్ పార్క్ ఏర్పాటుతో  రైతులకు ఎంతో మంచి వాతావరణం ఏర్పడుతుందని, యువతకు కూడా ఉపాధి అవకాశాలు పెరుగుతాయన్నారు. తెలంగాణలో బీజేపీ డబుల్ ఇంజన్ సర్కారు ఏర్పడితే.. ఇక్కడ అభివృద్ధి మరింత వేగవంతం అవుతుందన్నారు. 

తెలుగులో ప్రసంగం ప్రారంభించిన మోడీ

సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్ లో నిర్వహించిన విజయ సంకల్ప సభలో ప్రధాని నరేంద్ర మోడీ తెలుగులో ప్రసంగాన్ని ప్రారంభించారు. నాయకులు, కార్యకర్తల్లో జోష్ నింపారు. ‘‘తెలంగాణ బీజేపీని ఆశీర్వదించడానికి చాలా దూరం నుంచి వచ్చిన ప్రతి కార్యకర్తకు, సోదర, సోదరీమణులకు, మాతృమూర్తులకు నా నమస్కారం’’ అంటూ మోడీ తెలుగులో మాట్లాడారు.