
- ఇది ఏఐ యుగం.. 80 ఏండ్లయినా యూఎన్, ఇతర సంస్థలు అప్డేట్ కాకుంటే ఎలా?
- భారత్‌ను, పాక్‌ను ఒకే గాటన కట్టొద్దు
- బ్రెజిల్లో జరిగిన బ్రిక్స్ సమిట్‌లో ప్రధాని ప్రసంగం
- పహల్గాం ఉగ్రదాడిని ఖండిస్తూ బ్రిక్స్ దేశాల డిక్లరేషన్
రియో డీ జెనీరో: భారత్‌ను, పాకిస్తాన్‌ను ఒకే గాటన కట్టొద్దని ప్రపంచ దేశాలకు ప్రధాని నరేంద్ర మోదీ స్పష్టం చేశారు. భారత్ టెర్రరిజానికి బాధిత దేశంగా ఉంటే.. పాకిస్తాన్ టెర్రరిజాన్ని సపోర్ట్ చేస్తున్న దేశమని.. అందుకే బాధితులను, మద్దతుదారులను ఒకే విధంగా చూడొద్దని తేల్చిచెప్పారు. టెర్రరిజాన్ని ఖండించడం తమ సిద్ధాంతమన్నారు. ఇండియా సహా గ్లోబల్ సౌత్ దేశాల పట్ల ద్వంద్వ ప్రమాణాలను పాటించడం మానుకోవాలని హితవు పలికారు.
గ్లోబల్ సౌత్ దేశాలకు అన్ని రకాలుగా అన్యాయం జరుగుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. ఆదివారం బ్రెజిల్ లోని రియో డీ జెనీరో నగరంలో జరిగిన బ్రిక్స్ సమిట్ లో మోదీ ప్రసంగించారు. పహల్గాం ఉగ్రదాడిని ఖండించిన దేశాలన్నింటికీ కృతజ్ఞతలు తెలిపారు. రాజకీయ, వ్యక్తిగత ప్రయోజనాల కోసం టెర్రరిజాన్ని ప్రోత్సహిస్తున్న వారిని వ్యతిరేకించాలని కోరారు. పాకిస్తాన్ తన గడ్డపై నుంచే టెర్రరిస్టులను ఎగదోస్తోందని, టెర్రరిజమే ఆ దేశ విధానమన్న విషయాన్ని ఇదివరకే ఆధారాలతో సహా నిరూపించామన్నారు.
పహల్గాం ఉగ్రదాడికి బ్రిక్స్ ఖండన..
బ్రిక్స్ సమిట్ లో సభ్య దేశాలు ‘రియో డీ జెనీరో డిక్లరేషన్’ విడుదల చేశాయి. టెర్రరిస్ట్ దాడులు ఎక్కడ జరిగినా ముక్త కంఠంతో ఖండిస్తామని ఇందులో ప్రకటించాయి. ‘‘జమ్మూకాశ్మీర్ లో ఏప్రిల్ 22న జరిగిన టెర్రరిస్ట్ అటాక్ ను తీవ్రంగా ఖండిస్తున్నాం. టెర్రరిజాన్ని అన్ని రూపాల్లోనూ వ్యతిరేకిస్తున్నాం. క్రాస్ బార్డర్ టెర్రరిజంతోపాటు ఉగ్రమూకలకు నిధులు అందిస్తూ, సేఫ్ హెవెన్ లుగా ఆశ్రయం కల్పించడాన్నీ ఖండిస్తున్నాం. టెర్రరిజంపై పోరాటంలో కలిసికట్టుగా ముందుకు వెళ్తాం.
ఐక్యరాజ్యసమితి గుర్తించిన టెర్రరిస్టులు, టెర్రరిస్ట్ సంస్థల పట్ల కఠిన చర్యలు తీసుకోవాలని మేం డిమాండ్ చేస్తున్నాం” అని డిక్లరేషన్ లో బ్రిక్స్ దేశాలు పేర్కొన్నాయి. అయితే, ఇందులో ఎక్కడా పాకిస్తాన్ పేరును పేర్కొనలేదు. ఇంతకుముందు 2017 బ్రిక్స్ సమిట్ చైనాలో జరగగా.. అప్పుడు పాకిస్తాన్ లోని లష్కరే తయిబా, జైషే, ఇతర ఉగ్రవాద సంస్థలు ప్రాంతీయ భద్రతకు విఘాతమని డిక్లరేషన్ లో పేర్కొన్నారు. పాకిస్తాన్ పేరును అప్పుడు కూడా నేరుగా ప్రస్తావించలేదు. కాగా, బ్రెజిల్ లో బ్రిక్స్ సమిట్ కు చైనా ప్రెసిడెంట్ జిన్ పింగ్, రష్యా ప్రెసిడెంట్ పుతిన్ గైర్హాజరయ్యారు. వచ్చే ఏడాది బ్రిక్స్ సమిట్ కు భారత్ ఆతిథ్యం ఇవ్వనుంది.
గ్లోబల్ సౌత్ కు ప్రాతినిధ్యం ఏదీ?
ప్రపంచ ఎకానమీలో కీలక పాత్ర పోషిస్తున్న గ్లోబల్ సౌత్ దేశాల పట్ల ప్రపంచ దేశాలు ద్వంద్వ ప్రమాణాలను మానుకోవాలని ప్రధాని మోదీ స్పష్టం చేశారు. అభివృద్ధి, వనరుల పంపిణీ లేదా భద్రతాపరమైన అంశాల్లో తరచూ ఈ ద్వంద్వ ప్రమాణాలకు గ్లోబల్ సౌత్ దేశాలు బాధితులుగా మారుతున్నాయని అన్నారు. ఐక్యరాజ్యసమితి భద్రతా మండలి, డబ్ల్యూటీవో వంటి అంతర్జాతీయ సంస్థల్లో గ్లోబల్ సౌత్ దేశాలకు నిర్ణయాత్మక స్థానం దక్కడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు.
క్లైమేట్ ఫైనాన్స్, సుస్థిర అభివృద్ధి, టెక్నాలజీ యాక్సెస్ వంటి విషయాలు వచ్చే సరికి ఈ దేశాలపైనే భారం వేస్తున్నారన్నారు. అందుకే అంతర్జాతీయ సంస్థల్లో గ్లోబల్ సౌత్ దేశాలకు ప్రాతినిధ్యం, హక్కులు కల్పించాలన్నారు. ‘‘ప్రస్తుతం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వంటి టెక్నాలజీలు వారానికోసారి అప్డేట్ అవుతున్నాయి. కానీ యూఎన్, తదితర సంస్థలు మాత్రం 80 ఏండ్లు అయినా అప్డేట్ కావడం లేదు. 20వ శతాబ్దం నాటి టైప్ రైటర్లను 21వ శతాబ్దం నాటి సాఫ్ట్ వేర్ తో నడపలేం. గ్లోబల్ సౌత్ దేశాలకు ప్రాతినిధ్యం లేని ఈ అంతర్జాతీయ సంస్థలు.. సిమ్ కార్డు ఉండి, నెట్ వర్క్ లేని మొబైల్ ఫోన్ల వంటివే” అని మోదీ చమత్కరించారు.