ఢిల్లీ‑దౌసా‑లాల్ సోట్ సెక్షన్​ను ప్రారంభించిన మోడీ

ఢిల్లీ‑దౌసా‑లాల్ సోట్ సెక్షన్​ను ప్రారంభించిన మోడీ

దౌసా (రాజస్థాన్)/ న్యూఢిల్లీ:  దేశంలోనే అతి పొడవైన ఢిల్లీ–ముంబై ఎక్స్ ప్రెస్ వేలో భాగంగా ఫస్ట్ ఫేజ్ కింద నిర్మించిన ఢిల్లీ–-దౌసా-–లాల్ సోట్ సెక్షన్ ను ప్రధాని నరేంద్ర మోడీ ప్రారంభించారు. ఆదివారం రాజస్థాన్ లోని దౌసా జిల్లా ధన్ వార్ గ్రామం వద్ద ఎక్స్ ప్రెస్ వే ఫస్ట్ ఫేజ్ తో పాటు రూ. 18 వేల కోట్లతో చేపట్టిన మరో నాలుగు ప్రాజెక్టులకు మోడీ రిమోట్ నొక్కి శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేశారు. అనంతరం జరిగిన సభలో ఆయన మాట్లాడారు. హైవేలు, పోర్టులు, రైల్వేస్, ఆప్టికల్ ఫైబర్ ప్రాజెక్టులపై పెట్టుబడులు, మెడికల్ కాలేజీల ఏర్పాటు ద్వారా ఇండస్ట్రీలు, ట్రేడర్లు, చిన్న వ్యాపారులకు ఊతం లభిస్తుందని ప్రధాని అన్నారు. ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్టులపై ఇన్వెస్ట్ మెంట్ చేస్తేనే.. పెట్టుబడులను ఆకర్షించవచ్చని చెప్పారు. ఢిల్లీ–సోహ్నా– దౌసా–లాల్ సోట్ సెక్షన్ ప్రారంభంతో ఈ ప్రాంతంలో ఆర్థిక అభివృద్ధి ఊపందుకుంటుందని చెప్పారు. ఢిల్లీ నుంచి జైపూర్​కు ప్రయాణ సమయం సగం తగ్గుతుందన్నారు. పొద్దున్నే ఢిల్లీకి వెళ్లి.. సాయంత్రం ఇంటికి రావచ్చన్నారు. ఎక్స్ ప్రెస్ వేపై అక్కడక్కడా రూరల్ హట్స్ ఏర్పాటు చేస్తామని, ఇక్కడ స్థానిక చేతివృత్తుల వారు తమ కళాఖండాలు, ఉత్పత్తులను అమ్ముకోవచ్చని చెప్పారు. సరిస్కా, కీలేడియో, రణథంబోర్ నేషనల్ పార్క్ లు, జైపూర్, అజ్మీర్ వంటి ప్రాంతాలకు ఈ ఎక్స్​ప్రెస్ వే ఉపయోగపడుతుందన్నారు. రాజస్థాన్ టూరిజానికి పేరు పొందిందని, ఇకపై ఇక్కడికి టూరిస్టులు మరింతగా వస్తారన్నారు. కార్యక్రమంలో కేంద్ర మంత్రులు నితిన్ గడ్కరీ, గజేంద్ర సింగ్ షెకావత్, వీకే సింగ్, తదితరులు పాల్గొన్నారు. రాజస్థాన్ సీఎం గెహ్లాట్, హర్యానా సీఎం ఖట్టర్ వీడియో లింక్ ద్వారా పాల్గొని మాట్లాడారు.

ఎక్స్ ప్రెస్ వే ప్రత్యేకతలివే.. 

  • ఫస్ట్ ఫేజ్ కింద ఢిల్లీ-–సోహ్నా– దౌసా-–లాల్ సోట్ సెక్షన్ ను 246 కిలోమీటర్ల పొడవున నిర్మించారు. దీనికి రూ. 12,150 కోట్లను ఖర్చు చేశారు. 
  • ప్రస్తుతం ఢిల్లీ నుంచి జైపూర్ ప్రయాణానికి 5 గంటలు పడుతుండగా, ఈ ఎక్స్ ప్రెస్ వే వల్ల ట్రావెల్ టైం సగం వరకూ తగ్గనుంది.
  • ఢిల్లీ నుంచి హర్యానా, రాజస్థాన్, మధ్యప్రదేశ్, గుజరాత్ మీదుగా మహారాష్ట్ర వరకు మొత్తం 1,386 కిలోమీటర్ల పొడవున ఢిల్లీ–ముంబై ఎక్స్ ప్రెస్ వేను నిర్మించనున్నారు. ఢిల్లీ, ముంబై మధ్య ప్రస్తుత హైవేతో 1,424 కిలోమీటర్ల దూరం ఉండగా, కొత్త ఎక్స్ ప్రెస్ వేతో దూరం1,242 కిలోమీటర్లకు (12 శాతం) తగ్గనుంది. ప్రస్తుతం ఢిల్లీ నుంచి ముంబైకి ట్రావెల్ టైం 24 గంటలు పడుతుండగా, ఎక్స్ ప్రెస్ వే పూర్తయితే ప్రయాణ సమయం 12 గంటలకు తగ్గనుంది. 
  • కోటా, ఇండోర్, జైపూర్, భోపాల్, వడోదర, సూరత్ వంటి ప్రధాన సిటీలను ఇది కనెక్ట్ చేస్తుంది. 
  • ఎక్స్ ప్రెస్ వే పూర్తయితే దీని పరిసర ప్రాంతాల్లో గణనీయ అభివృద్ధి జరుగుతుందని, దేశ ఆర్థిక వృద్ధికి ఇది ఊతం అందిస్తుందని పీఎంవో తెలిపింది.