దేశ వ్యాప్తంగా కరోనా వ్యాక్సినేషన్ ప్రారంభించిన మోడీ

దేశ వ్యాప్తంగా కరోనా వ్యాక్సినేషన్ ప్రారంభించిన మోడీ
  • ఫ్రంట్ లైన్ వారియర్లే తొలి హక్కుదారులు
  • వ్యాక్సిన్ వచ్చిందని నిర్లక్ష్యం వీడొద్దు 
  • ఎన్నో సవాళ్ల మధ్య వ్యాక్సిన్ వచ్చింది -ప్రధాని మోడీ

న్యూఢిల్లీ: కరోనా వ్యాక్సనేషన్ డ్రైవ్ ను ప్రధాని మోడీ లాంఛనంగా ప్రారంభించారు. ప్రపంచంలోనే అతిపెద్ద వ్యాక్సిన్ పంపిణీని సరిగ్గా ఉదయం 10.30 గంటలకు శ్రీకారం చుట్టారు. తొలి విడుతగా దేశ వ్యాప్తంగా 3 లక్షల మందికి కరోనా టీకాలు ఇస్తున్నారు. దేశ వ్యాప్తంగా మూడువేల ఆరు కేంద్రాలను ఏర్పాటు చేసి ఫ్రంట్ లైన్ వారియర్లకు టీకాలు ఇస్తున్నారు.  ఈ సందర్భంగా మోడీ మాట్లాడుతూ.. ఎన్నో సవాళ్ల మధ్య కరోనా వ్యాక్సిన్ వచ్చిందన్నారు. వ్యాక్సిన్ తయారు చేసిన సైంటిస్టులకు అభినందనలు తెలియజేశారు. మొదట ఎవరికైతే అవసరమో వారికే వ్యాక్సిన్ ఇస్తున్నాం.. రెండు డోసులు తప్పనిసరిగా వేసుకోవాలని ఆయన సూచించారు. చాలా తక్కువ సమయంలోనే మనవి రెండు వ్యాక్సిన్లు వచ్చాయి. ఇంకా కొన్ని ప్రయోగ దశలో ఉన్నాయని వెల్లడించారు. మన వ్యాక్సిన్లకు ప్రపంచవ్యాప్తంగా విశ్వసనీయత ఉంది.. ప్రపంచ దేశాలన్నీ మన వ్యాక్సిన్ మంచిదని నమ్ముతున్నాయని.. దీనికంటే ముందు అనేక దేశాలు మన దేశంలో తయారైన వ్యాక్సిన్లను పరిశీలించాయని మోడీ వివరించారు.

వ్యాక్సిన్ వచ్చిందని జాగ్రత్తలు మరవొద్దు

వ్యాక్సిన్ పై అసత్య ప్రచారాలు నమ్మొద్దు.. అలాగని జాగ్రత్తలు పాటించడం మానకూడదని ప్రధాని మోడీ హెచ్చరించారు.  ప్రపంచంలోని అతిపెద్ద వ్యాక్సనేషన్ ప్రక్రియ మనదే, మన పరిస్థితులకు అనుగుణంగానే వ్యాక్సిన్లు తయారయ్యాయని తెలిపారు. కరోనాను ఎదుర్కొనేందుకు తీవ్రంగా శ్రమించిన ఫ్రంట్ లైన్ వారియర్లకు కృతజ్ఘతలు తెలిపారు. మీ వల్లే మొత్తం దేశం ఇలా ఉందంటే దానికి ప్రధాన కారణం ఫ్రంట్ లైన్ వారియర్ల శ్రమేనని మోడీ పేర్కొన్నారు. సైంటిస్టులతోపాటు.. డాక్టర్లు, నర్సులు.. హెల్త్ వర్కర్లు.. అంబులెన్స్ డ్రైవర్,.. మొదలు సఫాయి వర్కర్ వరకు అందరి పాత్ర విస్మరించలేనివని ప్రధాని మోడీ  అన్నారు. కరోనాతో యుద్ధానికి దేశం సిద్ధం కావడంలో ఫ్రంట్ లైన్ వారియర్ల కృషి అపారమైనదన్నారు.

ప్రధాని మోడీ నోట గురజాడ అప్పారావు పద్యం

‘‘ దేశమంటే మట్టికాదోయ్.. సొంత లాభం కొంత మానుకు.. పొరుగు వానికి తోడుపడవోయ్‌.. దేశమంటే మట్టి కాదోయ్‌.. దేశమంటే మనుషులోయ్..’’ అన్న గురజాడ అప్పరావు పద్యాన్ని ప్రధాని మోడీ ప్రస్తావించారు. మొత్తం తెలుగులోనే పద్యాన్ని చదివి వినిపించి ఈ పద్యం యొక్క అర్థాన్ని హిందీలో విపులంగా వివరించారు. ఒకటి రెండు వాక్యాలతో ముగిస్తారని భావిస్తే.. మోడీ అనూహ్యంగా పద్యంలోని నాలుగైదు లైన్లు తెలుగులోనే ఒత్తి పలుకుతూ.. పద్యం యొక్క భావాన్ని విడమర్చి చెప్పారు.

తొలి రోజు ఒక్కో సెంటర్లో 100 మందికి వ్యాక్సిన్

ప్రయార్టీ లిస్టు ప్రకారం మొదట హెల్త్​, ఐసీడీఎస్​(ఇంటిగ్రేటెడ్​ చైల్డ్​ డెవలప్​మెంట్​ సర్వీస్) వర్కర్స్​కు  టీకాలు వేస్తున్నారు. దేశవ్యాప్తంగా ఏర్పాటు చేసిన 3,006  కేంద్రాల్లో తొలిరోజు ఒక్కో సెంటర్లో సుమారు 100 మందికి వ్యాక్సిన్​ వేస్తారు. తెలంగాణలో ప్రతి సెంటర్​లో 30 మందికి చొప్పున వ్యాక్సిన్​ వేస్తున్నారు. ప్రపంచంలోనే అతిపెద్దగా జరుగుతున్న వ్యాక్సిన్ డ్రైవ్​ నిరంతరం కొనసాగుతుంది. మొదటి విడతలో భాగంగా పది రోజుల్లో హెల్త్​ వర్కర్స్​కు వ్యాక్సినేషన్​ పూర్తవుతుంది. తర్వాత మిగతా ఫ్రంట్​లైన్​ వర్కర్స్​కు, ప్రయార్టీ లిస్టుకు వ్యాక్సినేషన్​ ఉంటుంది. హెల్త్​ కేర్​, ఫ్రంట్​లైన్​ వర్కర్స్​ కోసం వ్యాక్సిన్​ ఖర్చును తామే భరిస్తామని ప్రధాని మోడీ ప్రకటించారు.  ఇలా 3 కోట్ల మందికి కేంద్రమే టీకా వేయిస్తోంది.

1.65 కోట్ల డోసులు సరఫరా

ఇప్పటికే దేశవ్యాప్తంగా కోటీ 65 లక్షల వ్యాక్సిన్​ డోసులను కేంద్రం సరఫరా చేసింది. ఇందులో ఆక్స్​ఫర్డ్​ యూనివర్సిటీ కనిపెట్టిన, ఆస్ట్రాజెనికా అభివృద్ధి చేసిన ‘కొవిషీల్డ్’ వ్యాక్సిన్​ ఒకటి. ఈ టీకాను మనదేశంలో సీరమ్​ ఇన్​స్టిట్యూట్​ తయారు చేస్తోంది. మరో టీకా ‘కొవాగ్జిన్’. దీన్ని మన హైదరాబాద్​ కంపెనీ భారత్​ బయోటెక్​ రూపొందించింది.   వ్యాక్సినేషన్​ను కేంద్ర ఆరోగ్య శాఖ ఎప్పటికప్పుడు పరిశీలించనుంది. వ్యాక్సిన్​ వేసుకునేవారి పేర్లను ఇప్పటికే ‘కొవిన్​’ వెబ్​సైట్​, యాప్​లో నమోదు చేశారు. వ్యాక్సిన్​ తీసుకోవాలనుకునేవారు తప్పకుండా ఈ వెబ్​సైట్​ లేదా యాప్​లో పేర్లను నమోదు చేసుకోవాల్సి ఉంటుంది. వ్యాక్సిన్​ స్టాక్​, బెనిఫిషియరీస్​ వివరాలు కొవిన్​ వెబ్​సైట్​లో ఉంటాయి. మొదటి డోస్​ తీసుకున్నాక 28 రోజులకు రెండో డోస్​ వేస్తారు. రెండు డోస్​లు తప్పనిసరిగా తీసుకోవాలి. రోజూ ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు వ్యాక్సినేషన్​ ఉంటుంది. ఆయా రాష్ట్రాల్లో పరిస్థితి బట్టి వారంలో 3 నుంచి 4 రోజలు వ్యాక్సిన్​ వేస్తున్నారు. వ్యాక్సినేషన్​ ప్రారంభమైన సందర్భంగా అన్ని కేంద్రాల్లో పండుగ వాతావరణం నెలకొంది. దేశవ్యాప్తంగా ఈ డ్రైవ్​ను ప్రధాని నరేంద్రమోడీ ప్రారంభించగా ఆయా రాష్ట్రాల్లో మంత్రులు, గవర్నర్​లో ప్రారంభించారు. వ్యాక్సిన్​ కోసం ఎగబడొద్దని, ప్రయార్టీ ప్రకారం అందరికీ అందేలా చూస్తామని ప్రధాని మోడీ స్పష్టం చేశారు.

ఇవీ చదవండి

తెలంగాణ బిల్లు పాస్ కావడంలో కీలకపాత్ర జైపాల్ రెడ్డిదే

పోషక విలువలున్నాయని ఎక్కువగా తింటే..

జూనియర్ బ్యాడ్మింటన్‌ ర్యాంకింగ్స్: సామియా @ వరల్డ్‌ నెంబర్-2