ప్రధాని ఛరిష్మాతో మరోసారి పవర్లోకి బీజేపీ 

ప్రధాని ఛరిష్మాతో మరోసారి పవర్లోకి బీజేపీ 
  • సొంత రాష్ట్రంలో ఏడాది నుంచే ప్రభుత్వ వ్యతిరేకతను తగ్గించిన మోడీ  
  • ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లతో బీజేపీకి దగ్గరైన పాటీదార్ లు 
  • కాంగ్రెస్ ప్రచారం చప్పగా.. ఆప్ ప్రభావం అంతంతే 
  • బీజేపీకి నల్లేరు మీద నడకే అయిన రికార్డ్ విజయం 

‘‘ఇక్కడంతా మోడీనే.. ఆయన మ్యాజిక్ మాత్రమే పని చేస్తది”.. ఇదీ ఇటీవల ఓ టీవీ చానెల్ వద్ద గుజరాత్ లోని ఖేడా ప్రాంతానికి చెందిన  ఓ ముస్లిం మహిళ చెప్పిన మాటలు. ఇప్పుడు అసెంబ్లీ ఎన్నికల ఫలితాలను చూస్తే ఇదే నిజమైనట్లు తేటతెల్లం అవుతోంది. గుజరాత్ లో మళ్లీ మోడీ మ్యాజిక్ బ్రహ్మాండంగా పనిచేసినట్లు స్పష్టమవుతోంది. మొత్తంగా గుజరాత్ లో బీజేపీ ఘన విజయం వెనక.. మోడీ మ్యాజిక్, చాకచక్యంగా ప్రభుత్వ వ్యతిరేకతను తగ్గించుకోవడం, పాటీదార్ ల మద్దతు, కాంగ్రెస్ పేలవమైన ప్రదర్శన, అంతగా లేని ఆప్ ఎఫెక్ట్ వంటి ఐదు అంశాలే కీలకం అయ్యాయి.    

అహ్మదాబాద్: గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో ప్రధాని మోడీ విస్తృతంగా క్యాంపెయిన్ చేశారు. అహ్మదాబాద్, సూరత్ లో రెండు భారీ రోడ్ షోలు, రాష్ట్రమంతటా 31 ర్యాలీల్లో పాల్గొన్నారు. సొంత గడ్డపై పార్టీ గెలుపును ప్రతిష్టాత్మకంగా తీసుకున్న ఆయన ఏ ఒక్క చాన్స్ వదులుకోలేదు. అహ్మదాబాద్ లో మోడీ ఏకంగా నాలుగు గంటల్లో 50 కిలోమీటర్ల రోడ్ షో చేశారు. అతి సుదీర్ఘమైన ఈ రోడ్ షోలో 10 లక్షల మంది మోడీకి బ్రహ్మరథం పట్టారు. ఈ రోడ్ షో సక్సెస్ తోనే బీజేపీ విజయం ఖాయమైందన్న చర్చలు మొదలయ్యాయి. ఇక రాష్ట్రమంతటా బీజేపీ ప్రచారంలో పార్టీలోని ఇతర నేతల కన్నా ప్రధాని మోడీ ఫొటో మాత్రమే పెద్దగా కనపడేటట్లు చూసుకున్నారు. బీజేపీతోనే సేఫ్టీ, సెక్యూరిటీ, డెవలప్‌‌మెంట్ అంటూ మోడీ పదే పదే ప్రచారం చేశారు.  2002 నుంచీ బీజేపీ పాలనలో రాష్ట్రంలో శాంతి నెలకొందని గుర్తు చేశారు. అలాగే కాంగ్రెస్ తనను రావణుడని తిడుతోందంటూ చెప్పుకొన్నారు. జాతీయవాదాన్ని కూడా లేవనెత్తారు. రాష్ట్ర ప్రజలను మరోమారు తనవైపు తిప్పుకోవడంలో సక్సెస్ అయ్యారు. కేంద్ర హోం మంత్రి అమిత్ షా కూడా దాదాపు నెల రోజుల పాటు గుజరాత్​లోనే మకాం వేశారు. 

డ్యామేజ్ కు ముందే జాగ్రత్తలు

నిరుడు సెప్టెంబర్ నాటికి, ఇప్పటికి పోలిస్తే గుజరాత్ లో బీజేపీ పరిస్థితి పూర్తిగా వేరు. ఏడాది కిందట రాష్ట్రంలో ప్రభుత్వ వ్యతిరేకత పెరగడం మొదలైంది. దీంతో నష్టం జరగడానికి ముందే ప్రధాని మోడీ చర్యలు చేపట్టారు. సెప్టెంబర్ 11న అకస్మాత్తుగా సీఎం విజయ్ రుపానీని తప్పించి, ఆయన స్థానంలో పటేల్ వర్గం నేత అయిన భూపేంద్ర పటేల్​ను నియమించారు. మొత్తం కేబినెట్​ను కూడా మార్చేశారు. ఉత్తరాఖండ్, కర్నాటకలో సక్సెస్ కావడంతో గుజరాత్​లోనూ మోడీ ఇదే స్ట్రాటజీ ఫాలో అయ్యారు. దీంతో ప్రభుత్వం పూర్తి కొత్తగా కన్పించడంతో ఆటోమేటిక్​గా వ్యతిరేకత మాయమైంది. ఎన్నికల నాటికి పాటీదార్​లను ఆకర్షించడం, అభివృద్ధి పనులతో ప్రచారం కూడా చేసుకోవడంతో ప్రభుత్వ వ్యతిరేకత తప్పి బీజేపీకి గెలుపు నల్లేరు మీద నడకే అయింది. 

మళ్లీ బీజేపీవైపు పాటీదార్ లు    

గుజరాత్ ఓటర్లలో పాటీదార్ కమ్యూనిటీ ఓటర్లే దాదాపుగా 18% వరకూ ఉన్నారు. 40 నుంచి 50 స్థానాల్లో వీరు గెలుపును శాసించే స్థాయిలో ఉన్నారు. కొన్ని దశాబ్దాలుగా కాంగ్రెస్ వెంటే ఉన్నపాటీదార్​లు 1995 నుంచి బీజేపీ వైపు మొగ్గుతూ వస్తున్నారు. పాటీదార్ కోటా ఉద్యమం కారణంగా బీజేపీని వ్యతిరేకించిన వీరు.. 2017 ఎన్నికల్లో మాత్రం తమ ఉద్యమ నాయకుడు హార్దిక్ పటేల్ ఆధ్వర్యంలో కాంగ్రెస్​కు అండగా నిలిచారు.అయితే, కేంద్రంలోని బీజేపీ సర్కారు ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లు తేవడంతో పాటీదార్​లు సంతృప్తి చెందారు. హార్దిక్ పటేల్ బీజేపీ గూటికి చేరారు. పాటీదార్ నేత భూపేంద్ర పటేల్​నే సీఎంగా కొనసాగిస్తామని బీజేపీ ప్రచారం చేయడం కలిసొచ్చింది. దీంతో బీజేపీకి అండగా నిలిచి, పార్టీకి ఘన విజయాన్ని పాటీదార్​లు కట్టబెట్టారు. 

ఈ గెలుపు మోడీదే ప్రధానిపై బీజేపీ నేతల ప్రశంసలు 

న్యూఢిల్లీ/గాంధీనగర్: గుజరాత్ లో బీజేపీ ఘన విజయానికి ప్రధాని మోడీపై ప్రజలకు ఉన్న నమ్మకమే కారణమని ఆ పార్టీ నేతలు అన్నారు. ఈ గెలుపు మోడీదే అని చెప్పారు. మోడీ పాపులారిటీ, క్రెడిబులిటీ, ఆయన లీడర్ షిప్ పై ప్రజలకు ఉన్న నమ్మకంతోనే పార్టీ విజయం సాధించిందని తెలిపారు. ‘‘అభివృద్ధి, ప్రజా సంక్షేమం విషయంలో మోడీకి ఉన్న కమిట్ మెంట్ కు.. బీజేపీ పాలనపై ప్రజలకు ఉన్న నమ్మకానికి నిదర్శనమే ఈ విజయం. గత 20 ఏండ్లలో మోడీ నాయకత్వంలో గుజరాత్ ఎంతో అభివృద్ధి చెందింది. మరోసారి బీజేపీని ఆశీర్వదించిన గుజరాత్ ప్రజలు.. రికార్డు విజయాన్ని అందించారు” అని బీజేపీ చీఫ్ జేపీ నడ్డా ట్వీట్ చేశారు. ‘‘గత రెండు దశాబ్దాలలో మోడీ నాయకత్వంలో గుజరాత్ అద్భుతంగా అభివృద్ధి చెందింది. అందుకే ప్రజలు రికార్డు విక్టరీ ఇచ్చారు. అబద్ధపు హామీలు, ఉచితాలు, బుజ్జగింపు రాజకీయాలు చేసే వారిని తిరస్కరించారు” అని కేంద్ర హోంమంత్రి అమిత్ షా ట్వీట్ చేశారు. మోడీ పాపులారిటీ, క్రెడిబులిటీతో బీజేపీ ఘన విజయం సాధించిందని డిఫెన్స్ మినిస్టర్ రాజ్ నాథ్ సింగ్ ట్వీట్ చేశారు. ‘‘గుజరాత్ ప్రజలు మరోసారి మోడీపై తమకున్న నమ్మకాన్ని చాటిచెప్పారు. దేశ వ్యతిరేక శక్తులను ఓడించారు” అని గుజరాత్ సీఎం భూపేంద్ర పటేల్ అన్నారు. గాంధీనగర్ లో ఆయన మీడియాతో మాట్లాడారు. రాష్ట్రంలో బీజేపీ అభివృద్ధి ట్రాక్ రికార్డును చూసి ప్రజలు ఓటేశారని ఆయన అన్నారు. ప్రజలు తమపై నమ్మకంతో మరోసారి అధికారం ఇచ్చారన్నారు. ‘‘గుజరాత్ వ్యతిరేక శక్తులను ప్రజలు ఓడించారు. జనం తమకు ఎందుకు మద్దతు ఇస్తలేరని కాంగ్రెస్ ఆత్మపరిశీలన చేసుకోవాలి” అని బీజేపీ స్టేట్ చీఫ్ సీఆర్ పాటిల్ అన్నారు.

ఆమ్​ ఆద్మీ పార్టీ.. వట్టి హైప్  

గుజరాత్ లో ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) పట్ల విపరీతమైన హైప్ క్రియేట్ అయింది. కానీ ఎన్నికల ఫలితాలను బట్టి చూస్తే రాష్ట్రంలో బీజేపీ, కాంగ్రెస్ లకు దీటైన పోటీదారుగా ఎదగాలంటే ఆ పార్టీకి ఇంకా చాలా సమయం పడుతుందన్నది తేలిపోయింది. ఆప్ ప్రకటించిన ఉచిత పథకాలను గుజరాత్ ప్రజలు పెద్దగా పట్టించుకోలేదు. ముస్లింలు ఇప్పటికీ కాంగ్రెస్ కే మద్దతుగా నిలిచారు. అయితే, ఓట్ షేర్ పరంగా చూస్తే.. ఆప్ మొదటి ఎన్నికల్లోనే మంచి ప్రారంభాన్ని నమోదు చేసింది. సూరత్, తదితర కొన్ని ప్రాంతాల్లో బీజేపీకి దీటుగా నిలిచింది. అయితే, ఆప్ కారణంగా ఈ ఎన్నికల్లో బీజేపీ మరికొంచెం కష్టపడి పనిచేయాల్సి వచ్చింది.

కాంగ్రెస్.. ముందే అస్త్ర సన్యాసం 

పోయిన ఎన్నికలతో పోలిస్తే ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ప్రచారం చప్పగా సాగింది. ఆ ఎన్నికల్లో నెల రోజుల పాటు విస్తృతంగా పర్యటించి పార్టీలో జోష్ నింపిన రాహుల్ గాంధీ.. ఈసారి ఒక్క రోజే ప్రచారంలో పాల్గొన్నారు. తిరిగి మధ్యప్రదేశ్​లో భారత్ జోడో యాత్రను కొనసాగించారు. దీంతో గుజరాత్​లో మోడీకి దీటైన నేతలు లేక కాంగ్రెస్ ప్రచారం ‘సైలెంట్’గా సాగింది. దీంతో ఓటర్లు కూడా కాంగ్రెస్ ను పెద్దగా పట్టించుకోలేదు. కాంగ్రెస్ ముందే అస్త్ర సన్యాసం చేయడంతో ప్రతిసారీ ఆ పార్టీకి ఓటేసేవాళ్లు కూడా ఈసారి ఆప్ వైపు మొగ్గేందుకు దారి తీసింది. ఖర్గే, మిస్త్రీ లాంటి కాంగ్రెస్ నేతలు మోడీని రావణుడంటూ తిట్టడంతో వాటిని మోడీ ప్రచారం చేసుకుని ప్రజలను తనవైపు తిప్పుకోవడంలో సక్సెస్ అయ్యారు.