రేపటి నుంచి 7 రోజులు అమెరికాలో మోడీ టూర్

రేపటి నుంచి 7 రోజులు అమెరికాలో మోడీ టూర్

ప్రధాని నరేంద్రమోడీ  రేపటి నుంచి  27 వరకు  అమెరికాలో  పర్యటించనున్నారు.  ఈ టూర్ లో  అమెరికా అధ్యక్షుడు  డొనాల్డ్ ట్రంప్, మోడీ ఒకే  వేదికపై  కనిపించనున్నారు. అటు  ఐక్యరాజ్య సమితి  సర్వసభ్య సమావేశంలో  ప్రధాని  ప్రసంగించనున్నారు. శనివారం  ఢిల్లీ నుంచి  నేరుగా హ్యూస్టన్  వెళ్తారు.  అక్కడ  రౌండ్ టేబుల్  సమావేశాల్లో  పాల్గొంటారు. సెప్టెంబర్  22న  హౌడీ  మోడీ పేరుతో  హ్యూస్టన్ లో  జరిగే  మెగా ఈవెంట్ లో ప్రధాని  మోడీ, అమెరికా  అధ్యక్షుడు  ట్రంప్  ఒకే వేదికపై  కలిసి పాల్గొననున్నారు.

హౌడీ  మోడీ  అంటే ….హౌ డూ యూ  డూ  మోడీ అన్న  అర్థంలో  హ్యూస్టన్  మెగా ఈవెంట్ కు  ఈ పేరు పెట్టారు. NRG  స్టేడియంలో  జరిగే  ఈ కార్యక్రమంలో  50 వేల మంది  NRIలు  పాల్గొననున్నారు . వీరితో  పాటే  యూఎస్ ప్రభుత్వ ఉన్నతాధికారులు, గవర్నర్లు,  కాంగ్రెస్ మెంబర్లు,  మేయర్లు  ఇలా అన్ని ర్యాంకుల  అధికారులు, నేతలు  పాల్గొననున్నారు.

ట్రంప్ కీలక ప్రకటన?

ఈ మెగా  షోలో  అమెరికా అధ్యక్షుడు  ట్రంప్  కీలక ప్రకటన  చేసే అవకాశం  ఉన్నట్లు  తెలుస్తోంది. భారత్ అమెరికా  వాణిజ్య బంధాన్ని  మరింత  పెంచేలా  ఈ ప్రకటన  ఉంటుందని చెబుతున్నారు.  గతంలో  వాణిజ్య ప్రాధాన్యాన్ని  అమెరికా ఉపసంహరించుకుంది.  అయితే  దాన్ని తిరిగి  పునరుద్ధరించే  అవకాశం ఉన్నట్లు  అనుకుంటున్నారు. దీనిపై  మీడియా ప్రతినిధులు  ట్రంప్ ను అడగగా..  తనకు  మోడీకి   స్నేహబంధం  మాత్రమే  ఉందని చెబుతూ పరోక్షంగానే  మాట్లాడారు.

ఐక్య రాజ్యసమితిలో ప్రసంగం

మరోవైపు  ఈ నెల  24న  ఐక్యరాజ్య సమితి  ప్రధాన కార్యదర్శి  ఆంటోనియో గుటెరస్  ఇచ్చే విందుకు   ప్రధాని మోడీ హాజరవుతారు. మహాత్మాగాంధీ 150 జయంతి  ఉత్సవాల నేపథ్యంలో  150 మొక్కలు  నాటుతారు. పలువురు పారిశ్రామికవేత్తలు,  ప్రతినిధి  బృందాలతో  భేటీ అవుతారు. ఐక్యరాజ్య సమితిలో  ఈ నెల 27న  జనరల్  అసెంబ్లీని మోడీ  ఉద్దేశించి ప్రసంగిస్తారు. అక్కడ ఆరోగ్యం,  ఉగ్రవాదం,  వాతావరణ సమస్యలపై  ప్రధాని మాట్లాడుతారు. ఈ సందర్భంగా కశ్మీర్ అంశం ప్రస్తావనకు వచ్చే అవకాశం ఉంది.

రెండోసారి ట్రంప్ – మోడీ మీట్

ఆ తర్వాత  మరోసారి  ట్రంప్ తో    మోడీ భేటీ  అవుతారు. అంటే  వచ్చేవారంలో మోడీ,  ట్రంప్  రెండుసార్లు  సమావేశం  కానున్నారు. గత  3 నెలల్లో  మోడీ, ట్రంప్  రెండుసార్లు   భేటీ అయ్యారు. జపాన్ లో  జీ 20 సమిట్,  ఫ్రాన్స్ లోని  జీ 7  సమిట్  సందర్భంగా  ప్రత్యేకంగా  సమావేశమయ్యారు.