ఓట్ బ్యాంక్‌కు కూటమి బానిసత్వం: ప్రధాని మోదీ

ఓట్ బ్యాంక్‌కు కూటమి బానిసత్వం: ప్రధాని మోదీ

బక్సర్​(బిహార్​): విపక్షాలు తనను భయపెడుతున్నాయని, అయినా టెర్రరిజం, అవినీతి అంతానికి ధ్యైర్యంగా పోరాడుతున్నానని ప్రధాని మోదీ తెలిపారు. ఓటు బ్యాంకును కాపాడుకునేందుకు ముస్లింల ఎదుట ఆ పార్టీ ముజ్రా (మొఘల్​ సామ్రాజ్యంలో వేశ్యలు చేసే నృత్యం) చేస్తున్నదని విమర్శించారు. దళితులు, వెనుకబడిన వర్గాల రిజర్వేషన్లను లాక్కోవడానికి ఇండియా కూటమి ప్రయత్నిస్తున్నదని ఆరోపించారు. దానిని అడ్డుకొని తీరుతామని శపథం చేశారు. బిహార్​లోని బక్సర్, కరకట్​, పాటలీపుత్ర లోక్​సభ నియోజకవర్గ ఎన్నికల ర్యాలీల్లో మోదీ పాల్గొన్నారు. 

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. విపక్ష కూటమి అధికారంలోకి రాగానే మొదట రాజ్యాంగాన్ని మార్చాలని నిర్ణయించిందని, ముస్లింల రిజర్వేషన్లను కోర్టు కూడా కొట్టివేయకుండా మార్పులు చేసేందుకు ఈ విధమైన నిర్ణయం తీసుకున్నదని ఆరోపించారు. రాజ్యాంగాన్ని మార్చబోమని లిఖితపూర్వకంగా చెప్పాలని తాను డిమాండ్​ చేస్తే కూటమినుంచి ఎలాంటి స్పందన లేదని చెప్పారు. ఒకవేళ కూటమి అధికారంలోకి వస్తే ఆర్జేడీకి మద్దుతుగా ఉన్న యాదవులుసహా వెనుకబడినవర్గాల వారందరూ రాజ్యాంగపరమైన హక్కులు కోల్పోతారని అన్నారు.

ఓటమి దిశగా విపక్ష కూటమి

విపక్షాల కూటమి ఓటమి దిశగా పయనిస్తోందని మోదీ అన్నారు. జూన్​ 4న ఫలితాలు వెలువడే సమయంలో ఆర్జేడీ, కాంగ్రెస్​ కార్యకర్తలు ఒకరి బట్టలు ఒకరు చించుకోవడం చూస్తారని ఎద్దేవా చేశారు. కాంగ్రెస్​ ఓటమి బాధ్యతను మల్లికార్జున్​ ఖర్గేపై వేసి రాజ కుటుంబం (సోనియాగాంధీ కుటుంబం) విదేశాలకు విహారయాత్రకు వెళ్లిపోతుందని అన్నారు. బిహార్​ ప్రజలను పంజాబ్​, తెలంగాణలో కాంగ్రెస్​, తమిళనాడులో డీఎంకే, బెంగాల్​లో టీఎంసీ నేతలు వలస జీవులంటూ అవమానిస్తుంటే ఆర్జేడీ నోరుమెదపడంలేదని మోదీ మండిపడ్డారు. 

ప్రతిపక్ష కూటమి ‘ఓటు జీహాద్’​లో మునిగి తేలుతున్నదని, ముస్లింలకు రిజర్వేషన్లు కట్టబెట్టాలని చూస్తున్నదని ఫైర్​ అయ్యారు. ఓబీసీ జాబితాలో అనేక ముస్లిం గ్రూప్స్​ను చేర్చాలనే బెంగాల్​ సర్కారు నిర్ణయాన్ని కలకత్తా హైకోర్టు కొట్టివేసిందని తెలిపారు. యూపీఏ పాలనలో దేశ ప్రజలకు ఉచితంగా తిండిగింజలు కూడా ఇవ్వలేకపోయారని ఎద్దేవా చేశారు. రాబోయే ఐదేండ్లలో బిహార్​ అభివృద్ధిని వేగవంతం చేయడంతోపాటు నాణ్యమైన విద్యుత్తును అందిస్తానని, అర్హులకు పక్కా గృహాలు నిర్మించి ఇస్తానని హామీ ఇచ్చారు. మీరు వేసే ఓటు లోకల్​ ఎంపీని మాత్రమే ఎన్నుకునేందుకు కాదని, బలమైన ప్రధానిని ఎంపిక చేసుకోవడానికి అని, ప్రజలందరూ ఆలోచించి ఓటు వేయాలని కోరారు.