
ఉద్యోగాలు ఊడిపోతున్నాయి. లే-ఆఫ్స్ ఐటీ ఉద్యోగుల్లో వణుకుపుట్టిస్తున్నాయి. ఒక్క ఏప్రిల్ నెలలోనే 23 వేల 486 మంది ఉద్యోగులను ఐటీ కంపెనీలు ఉద్యోగాల నుంచి తొలగించాయి. అంతేకాదు.. 2025లో ఇప్పటివరకూ.. ఈ నాలుగు నెలల వ్యవధిలో 112 ఐటీ కంపెనీలు 51 వేల 28 మందిని ఉద్యోగాల నుంచి తొలగించిందంటే ఐటీ ఉద్యోగుల పరిస్థితి ఎంత దయనీయంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. లే-ఆఫ్స్ చేసిన కంపెనీల్లో టెక్ దిగ్గజ కంపెనీలైన మెటా, గూగుల్, ఇంటెల్ కూడా ఉన్నాయి.
మార్చి నెలాఖరు వరకూ ఈ లేఆఫ్స్ కారణంగా 27వేల మంది ఉద్యోగులు జాబ్స్ కోల్పోయారు. Layoffs.fyi వెబ్ సైట్ ఈ డేటాను బయటపెట్టింది. ఎప్పటి నుంచో ఉన్న కంపెనీలు మాత్రమే కాదు కొత్తగా స్టార్ట్ చేసిన స్టార్టప్ ఐటీ కంపెనీలు కూడా ఉద్యోగులను తొలగించాయని సదరు వెబ్ సైట్ పేర్కొంది. 2025లో ఉద్యోగులను తొలగించిన ఐటీ కంపెనీల జాబితాలో ఇంటెల్ ముందు వరుసలో ఉంది. తమ వర్క్ ఫోర్స్లో 20 శాతం తగ్గించుకుంటామని ఇంటెల్ ప్రకటించింది. ఈ నిర్ణయం వల్ల 22 వేల మంది ఉద్యోగులపై ప్రభావం పడింది. ఇండియాలో సెకండ్ హ్యాండ్ కార్లు అమ్మే Cars24 కంపెనీ కూడా 200 మంది ఉద్యోగులను తొలగించింది. ఏఐ ప్లాట్ ఫామ్ GupShup ఏప్రిల్ నాటికి 200 మంది ఉద్యోగులను తొలగించింది.
ఇలా ఒకరిద్దరు కాదు.. వేలాది మందిని ఐటీ కంపెనీలు ఉద్యోగాల నుంచి తొలగిస్తున్నాయి. ‘‘ప్రాజెక్టులు లేవు.. పనితీరు సరిగ్గా లేదు” అని పేర్కొంటూ సైలెంట్లేఆఫ్స్ చేపడుతున్నాయి. ప్రాజెక్టులు, స్కిల్స్ లేవని చెబుతూ రిజైన్ చేయాలని బెంచ్పై ఉన్న ఉద్యోగులపై ఒత్తిడి తెస్తున్నాయి. వాళ్లతో ఎలాగోలా రిజైన్ చేయించి, ఇంటికి పంపించి వేస్తున్నాయి. రానున్న రోజుల్లో ఈ లేఆఫ్స్మరింత పెరిగే అవకాశం ఉందని చెబుతున్నారు.
ఐటీ రంగాన్ని కుదిపేస్తున్న సైలెంట్ లేఆఫ్స్కు ముఖ్య కారణం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) అని నిపుణులు చెబుతున్నారు. ప్రస్తుతం ఐటీ రంగంలో ఏఐ వినియోగం పెరిగింది. మనుషులు చేయాల్సిన పనులు మొత్తం ఏఐ టూల్స్ చేస్తున్నాయి. దీంతో కంపెనీలు తమ ప్రొడక్షన్ కాస్ట్ను తగ్గించుకోవడంలో భాగంగా ఉద్యోగులను తొలగిస్తున్నాయి. ఉద్యోగులను తొలగిస్తే జీతాల భారం తగ్గుతుందని భావిస్తున్నాయి.
బెంచ్పై ఉన్న ఉద్యోగులతో బలవంతంగా రాజీనామాలు చేయిస్తున్నాయి. ఐటీ కంపెనీల్లో ఏఐ కారణంగానే చాలా మంది ఉద్యోగాలు కోల్పోతున్నారని, రానున్న రోజుల్లో ఏఐ వాడకం మరింత పెరుగుతుందని నిపుణులు అంటున్నారు. ఐటీ రంగంలో నిలదొక్కుకోవాలంటే లేటెస్ట్ టెక్నాలజీని ఎప్పటికప్పుడు నేర్చుకోవాలని, స్కిల్స్ పెంచుకోవాలని సూచిస్తున్నారు. ఏఐ, రోబోటిక్స్, మెషీన్ లర్నింగ్, డేటా అనలిటిక్స్ వంటి కోర్సులు నేర్చుకున్నోళ్లకు ఉద్యోగావకాశాలు ఎక్కువగా ఉండే చాన్స్ ఉందని చెప్పారు.