ప్రజలు కష్టపడుతున్నా కాంగ్రెస్ పట్టించుకోలే : మోడీ

ప్రజలు కష్టపడుతున్నా కాంగ్రెస్ పట్టించుకోలే : మోడీ

వేల కోట్ల ప్రజాధనాన్ని లూటీ చేసింది: మోడీ

తల్లులు, అక్కచెళ్లెళ్లు, బిడ్డల ఆశీర్వాదమే నాకు రక్ష

అభివృద్ధికి డబుల్ ఇంజిన్ ప్రభుత్వం అవసరమని కామెంట్

కర్నాటకలో  ఎక్స్‌‌‌‌ప్రెస్‌‌ వే ను ప్రారంభించిన ప్రధాని

మద్దూర్/ న్యూఢిల్లీ : పేదల బతుకుల్లో మార్పు తేవడానికి తాను పాటుపడుతుంటే.. ప్రతిపక్షాలు మాత్రం తన సమాధి తవ్వడంలో బిజీగా ఉన్నాయని ప్రధాని నరేంద్ర మోడీ అన్నారు. ప్రజల ఆశీర్వాదమే తనకు పెద్ద రక్ష అని చెప్పారు. త్వరలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న కర్నాటకలో ప్రధాని మోడీ ఆదివారం పర్యటించారు. రూ.8,480 కోట్లతో 118 కిలోమీటర్ల మేర నిర్మించిన బెంగళూరు - మైసూరు ఎక్స్‌‌‌‌ప్రెస్‌‌ వే ప్రాజెక్టును ఆయన ప్రారంభించారు. మాండ్యా జిల్లాలోని మద్దూరులో జరిగిన సభలో మాట్లాడారు. అంతకుముందు మాండ్యా సిటీలో ప్రధాని రోడ్ షో నిర్వహించారు. రాష్ట్రం వేగంగా అభివృద్ధి చెందేందుకు డబుల్ ఇంజిన్ ప్రభుత్వం అవసరమని చెప్పారు. ‘‘దేశ అభివృద్ధి, ప్రజల ప్రోగ్రెస్ కోసం డబుల్ ఇంజిన్ ప్రభుత్వం ప్రయత్నిస్తుంటే..  కాంగ్రెస్, దాని మిత్రపక్షాలు ఏం చేస్తున్నాయో తెలుసా? మోడీకి సమాధి తవ్వడంపై కాంగ్రెస్ కలలుగంటోంది” అని విమర్శించారు.

నాడు లూటీ చేసిన కాంగ్రెస్

‘‘2014కి ముందు కేంద్రంలో కాంగ్రెస్ ఆధ్వర్యంలోని సంకీర్ణ ప్రభుత్వం.. పేదల కష్టాలను, బాధలను ఎన్నడూ పట్టించుకోలే. పేదల అభివృద్ధి కోసం ఉద్దేశించినవేల కోట్ల నిధులను.. కాంగ్రెస్ ప్రభుత్వం లూటీ చేసింది” అని ఆరోపించారు.  

ప్రపంచంలోనే అతిపెద్ద రైల్వే ప్లాట్‌‌ఫామ్‌‌..

ప్రపంచంలోనే అతిపెద్ద రైల్వే ప్లాట్‌‌ఫామ్‌‌ను ప్రధాని మోడీ జాతికి అంకితం చేశారు. శ్రీ సిద్ధరూధ స్వామీజీ హుబ్బలి స్టేషన్‌‌లో 1,507 మీటర్ల పొడవున్న ప్లాట్‌‌ఫామ్‌‌ను రూ.20 కోట్లతో నిర్మించారు. ఇటీవల గిన్నిస్ బుక్ వరల్డ్ రికార్డుల్లోకి కూడా ఇది ఎక్కింది. ఇదే కార్యక్రమంలో రూ.530 కోట్లతో ఎలక్ట్రిఫికేషన్ పూర్తి చేసుకున్న హొసపేట్– హుబ్బలి – టినియాఘాట్ సెక్షన్‌‌ను కూడా జాతికి అంకితం చేశారు. హుబ్బలి – ధర్వాద్ స్మార్ట్ సిటీ ప్రాజెక్టులో రూ.520 కోట్లతో చేపట్టనున్న పలు పనులకు ప్రధాని శంకుస్థాపనలు చేశారు. రూ.1,040 కోట్లతో చేపట్టనున్న ధర్వాద్ మల్టీ విలేజ్ వాటర్ సప్లై స్కీమ్‌‌కు పునాదిరాయి వేశారు. అలాగే ఇండియన్ ఇన్‌‌స్టిట్యూట్ ఆఫ్  టెక్నాలజీ ధర్వాద్ పర్మినెంట్ క్యాంపస్‌‌ను మోడీ ప్రారంభించారు.

మహాత్ముడికి నివాళి

దండి యాత్ర వార్షికోత్సవం సందర్భంగా మహాత్మా గాంధీకి ప్రధాని నివాళులర్పించారు. ‘‘గాంధీజీకి, దండి యాత్రలో పాల్గొన్న వారందరికీ నివాళులర్పిస్తున్నా. ఇది మన దేశ చరిత్రలో ఒక ముఖ్యమైన సంఘటన” అని ప్రధాని ట్వీట్‌‌ చేశారు.

దేశంలో ప్రజాస్వామ్యాన్ని బలహీన పరచలేరు

కేంబ్రిడ్జి యూనివర్సిటీ వేదికగా దేశంలో ప్రజాస్వామ్య పరిస్థితులపై రాహుల్ గాంధీ చేసిన కామెంట్లపైనా ప్రధాని స్పందించారు. ‘‘లండన్ నేల మీది నుంచి భారత ప్రజస్వామ్యంపై ప్రశ్నలు లేవనెత్తడం దురదృష్టకరం. ఏ శక్తి కూడా ఇండియన్  డెమోక్రసీని బలహీనపరచలేదు. కానీ.. దేశ ప్రజాస్వామ్యంపై దాడి చేసేందుకు కొందరు నిరంతరం ప్రయత్నిస్తూనే ఉన్నారు. ఈ వ్యక్తులు భగవాన్ బసవేశ్వరుడిని, కర్నాటక ప్రజలను అవమానిస్తున్నారు. అలాంటి వారికి కర్నాటక దూరంగా ఉండాలి” అని సూచించారు.