
ఆ రాత్రి పాకిస్థాన్ కు కాళరాత్రి అయ్యుండేది
పాకిస్థాన్ ను కోలుకోలేని దెబ్బతీసేవాళ్లం
మా హెచ్చరికలతోనే పాకిస్థాన్ దిగొచ్చింది
ఇపుడు పాకిస్థాన్.. ఇండియా అంటే భయపడే పరిస్థితి వచ్చింది
గుజరాత్, రాజస్థాన్ ప్రచారంలో ప్రధాని మోడీ కామెంట్స్
గుజరాత్: బీజేపీతోనే దేశ రక్షణ సాధ్యమౌతుందన్నారు ప్రధాని నరేంద్ర మోడీ. గుజరాత్ లో నిన్న ఎన్నికల ప్రచారం నిర్వహించిన మోడీ .. భూమి పుత్రునికే ఓటేయాలని కోరారు. గుజరాత్ పాటన్, రాజస్థాన్ లోని చిత్తోర్ ఘర్, బర్మార్ సభల్లో పాల్గొన్నారు ప్రధాని మోడీ. టెర్రరిస్టులపై దాడులను కాంగ్రెస్ చులకన చేసే ప్రయత్నం చేసిందని విమర్శించారు.
పాకిస్తాన్ F16 యుధ్ద విమానాన్ని కూల్చి… ఆ తర్వాత పరిస్థితుల్లో పాకిస్థాన్ కు పట్టుబడిన భారత ఫైటర్ పైలట్ అభినందన్ అప్పగింత గురించి ప్రస్తావించారు ప్రధానిమోడీ. అభినందన్ ను కనుక వెనక్కి తిరిగి ఇచ్చి ఉండకపోతే ఆ రాత్రే పాకిస్థాన్ కు కాళరాత్రి అయి ఉండేదన్నారు. అభినందన్ ను ప్రాణాలతో ఇవ్వకపోతే… పాకిస్థాన్ ను కోలుకోలేని దెబ్బ తీస్తామని… ఇండియా చేయబోయే ఆ దాడి పాకిస్థాన్ కు ఎప్పుడూ బాధపడుతూ ఉండాల్సి వస్తుందని ఆ రోజు రాత్రి తాను చేసిన హెచ్చరికలను గుర్తుచేశారు మోడీ. అమెరికా మీడియాలోనూ వచ్చిన కథనాలను గుర్తుచేశారు మోడీ. ప్రధాని మోడీ 12 ఎయిర్ మిసైల్స్ ను సిద్ధం చేశారని.. పాకిస్థాన్ అభినందన్ ను తిరిగివ్వకపోతే ఆ దేశం చెడు ఫలితాలను చూడాల్సి ఉంటుందంటూ అమెరికన్ మీడియాలో కథనాలు వచ్చాయన్నారు. తాము చేసిన ఒత్తిడి ఫలితంగానే అభినందన్ ను ప్రాణాలతో అప్పగించారని.. అన్నారు మోడీ.
“పాకిస్థాన్ పదే పదే తమ దగ్గర అణుబాంబులు ఉన్నాయని చెబుతూ వస్తుంది. మరి మనమేమైనా వాటిని దీపావళి పండుగ కోసం దాచుకున్నామా… మన దగ్గర లేవా.. అవసరమైతే ఉపయోగించమా..? ఐదేళ్ల బీజేపీ పాలనలో ఇండియా అంటే కవ్వించడం మానేసి భయపడే పరిస్థితికి పాకిస్థాన్ వచ్చింది” అని మోడీ అన్నారు.
తాను గుజరాత్ లో పుట్టిపెరిగానన్న మోడీ… సొంత మనిషిగా సేవ చేస్తానని.. బీజేపీ ఎంపీ అభ్యర్థులందరినీ గెలిపించాలని కోరారు.