
హైదరాబాద్, వెలుగు: ఈ మధ్య వాట్సాప్‌లో ఓ వార్త చక్కర్లు కొడుతోంది. అదే మోడీ స్కూటీ యోజన. పదో తరగతి పాసైన ఆడపిల్లలందరికీ ఈ పథకం కింద స్కూటీని ఇస్తారంటూ తెగ హల్చల్ చేస్తోంది ఆ వార్త. ఈ నెల 30 చివరి తేదీ అంటూ కొందరు ఆ వార్తను ఫార్వర్డ్ చేస్తున్నారు. దీంతో చాలా మంది స్టూడెంట్లు ఎట్ల దరఖాస్తు చేసుకోవాలంటూ అడుగుతున్నారు. ఇంకొందరు నెట్ సెంటర్లకెళ్లి సర్కార్ యోజన వెబ్సైట్లో దరఖాస్తులను నింపే ప్రయత్నం చేస్తున్నారు. ఆ పథకాన్ని మిస్సయిపోతున్నామని బాధపడుతున్నారు. కానీ, అమ్మాయిలూ.. బాధపడాల్సిన అవసరమే లేదు. ఎందుకంటే కేంద్ర ప్రభుత్వం అలాంటి పథకాన్నే ప్రవేశపెట్టలేదు. వాట్సాప్, ఫేస్‌బుక్‌లలో హల్చల్ చేస్తున్న ఆ వార్త వట్టి పుకారు మాత్రమేనని అధికారులు తేల్చి చెబుతున్నారు. నిజంగా కేంద్రమే ఆ పథకాన్ని ప్రవేశపెట్టి ఉంటే, ప్రభుత్వమే నేరుగా దానిపై ప్రచారం చేస్తుందని వివరిస్తున్నారు. జనానికి చేరువయ్యేలా టీవీలు, పేపర్లలో ప్రకటనలు ఇస్తుందంటున్నారు. అంతేకాదు, ఈ ఏడాది మే నుంచే పథకం ప్రారంభమైందని, సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్న ఆ వార్తలో చెబుతున్నారు. కానీ, నిజానికి లోక్‌సభ ఎన్నికల నేపథ్యంలో మే 23 దాకా కోడ్ అమల్లో ఉంది. రెండో సారి మోడీ అధికారం చేపట్టింది మే 30న. కాబట్టి ఏ పథకాన్నీ ప్రవేశపెట్టేందుకు అవకాశమే లేదు. రెండు నెలలుగా ప్రభుత్వమూ దానిపై ఎలాంటి ప్రకటనా చేయలేదు.
మోడీ ఫొటోను వాడుకొని
నిజానికి తమిళనాడులో గత ఏడాది ఆ రాష్ట్ర ప్రభుత్వం అమ్మ స్కూటీ యోజనను ప్రారంభించింది. మాజీ సీఎం జయలలిత 70వ జయంతి సందర్భంగా, ప్రధాని నరేంద్ర మోడీ చేతుల మీదుగా ఆ పథకాన్ని మొదలుపెట్టారు. రెండున్నర లక్షలోపు ఆదాయం ఉన్న వితంతువులు, దివ్యాంగుల కోసం తీసుకొచ్చిన పథకం ఇది. దీంతో కొందరు మోడీ ఫొటోను వాడుకుని స్కూటీ యోజన అంటూ ప్రచారం చేస్తున్నారు. కొన్ని పత్రికలూ, వెబ్సైట్లూ ఆ వార్త వేయడంతో జనం గందరగోళానికి గురవుతున్నారు. రాజస్థాన్ ప్రభుత్వం కూడా ఛాత్రా స్కూటీ యోజన పేరిట, ప్రతిభ ఉన్న విద్యార్థినులకు సబ్సిడీ మీద స్కూటీలు అందిస్తోంది. అది కూడా ఆ రాష్ట్రం వరకే పరిమితం. 2016లో కాశ్మీర్ సర్కార్ కూడా స్కూటీ స్కీంను అమలు చేస్తోంది. చదువులో విద్యార్థినులను ప్రోత్సహించేందుకు ఈ పథకాన్ని ప్రవేశపెట్టారు. కాబట్టి మోడీ స్కూటీ యోజన పథకం అన్నది వట్టి మాటేనని, విద్యార్థినులెవరూ నమ్మవద్దని అధికారులు సూచిస్తున్నారు. పథకం ఉంటే ప్రభుత్వమే నేరుగా ప్రచారం చేస్తుందని
చెబుతున్నారు.