మహారాష్ట్ర ప్రజలందరికీ మోదీ సారీ చెప్పాలి: రాహుల్ గాంధీ

మహారాష్ట్ర ప్రజలందరికీ  మోదీ సారీ చెప్పాలి: రాహుల్ గాంధీ

సాంగ్లీ: మహారాష్ట్రలోని సింధుదుర్గ్ జిల్లాలో ఛత్రపతి శివాజీ విగ్రహం కూలిపోయిన ఘటనలో ప్రధాని మోదీ మహారాష్ట్రలోని ప్రతి పౌరుడికీ క్షమాపణ చెప్పాలని లోక్‌‌‌‌సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ డిమాండ్ చేశారు. పెద్ద నోట్ల రద్దు, అగ్రి చట్టాలు, జీఎస్టీపై కూడా ఆయన క్షమాపణలు చెప్పాలన్నారు. గురువారం మహారాష్ట్రలోని సాంగ్లీలో కాంగ్రెస్  దివంగత నేత పతంగరావు కదమ్‌‌‌‌ విగ్రహాన్ని ఆవిష్కరించిన తర్వాత ఆయన మాట్లాడారు. విగ్రహం కూలిపోవడం శివాజీ మహారాజ్‌‌‌‌కు అవమానమని   మండిపడ్డారు. సింధుదుర్గ్ జిల్లాలో నిరుడు డిసెంబర్లో మోదీ ప్రారంభించిన శివాజీ విగ్రహం పోయిన నెల 26న కూలింది. 

దీంతో శివాజీకి మోదీ ఇటీవల క్షమాపణలు చెప్పారు. ఈ నేపథ్యంలో మోదీపై రాహుల్ విమర్శలు గుప్పించారు. ‘‘శివాజీ విగ్రహాన్ని నిర్మించే కాంట్రాక్టును అర్హత లేని ఆర్‌‌‌‌ఎస్‌‌‌‌ఎస్‌‌‌‌ వ్యక్తికి ఇచ్చినందుకా..? అవినీతికి పాల్పడినందుకా..? దేని కోసం ప్రధాని క్షమాపణ చెప్పారు..?’’ అని ప్రశ్నించారు. అన్ని కాంట్రాక్టులు అదానీ, అంబానీలకు మాత్రమే ఎందుకు ఇస్తున్నారో కూడా చెప్పాలన్నారు. కేవలం ఇద్దరు వ్యక్తులకే ప్రయోజనం కల్పిస్తుండడంతో దేశంలో చిన్న, మధ్య తరహా వ్యాపారాలు మూతపడుతున్నాయని ఆయన మండిపడ్డారు. 

సాంగ్లీ సభకు ఉద్ధవ్ థాక్రే డుమ్మా

సాంగ్లీలో రాహుల్ గాంధీ సభకు మిత్రపక్షమైన శివసేన (యూబీటీ) చీఫ్ ఉద్ధవ్ థాక్రే గైర్హాజరయ్యారు. ఈ సభకు కాంగ్రెస్ చీఫ్ ఖర్గే, సీనియర్ నేతలు సుశీల్‌‌‌‌కుమార్ షిండే, పృథ్వీరాజ్ చవాన్, ఎన్సీపీ (ఎస్పీ) చీఫ్ పవార్ హాజరయ్యారు. కానీ, ఉద్ధవ్ పార్టీ నేతలెవరూ హాజరు కాకపోవడం చర్చనీయాంశమైంది.