
- మానవత్వానికి అవమానం జరిగితే ఊరుకుంటారా?
- పాలస్తీనాపై స్పష్టమైన వైఖరి తెలియజేయాలని డిమాండ్
న్యూఢిల్లీ: గాజాలో జరుగుతున్న నరమేధంపై ప్రధాని మోదీ మౌనంగా ఉండడం సిగ్గుచేటని కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ లీడర్ సోనియాగాంధీ మండిపడ్డారు. పిరికితనం, భయంతో ప్రధాని మోదీ రాజ్యాంగ, నైతిక విలువలను వదిలిపెడుతున్నారని అన్నారు. గాజా ప్రజలకు అనుకూలంగా భారత్ స్పష్టమైన , ధైర్యమైన వైఖరిని తీసుకోవాలని డిమాండ్ చేశారు.
ప్రముఖ హిందీ పత్రిక ‘దైనిక్ జాగరణ్’లో సోనియాగాంధీ రాసిన వ్యాసం ‘గాజా సంకట్ పర్ మూక్ దర్శక్ మోదీ సర్కార్’ అనే శీర్షికతో మంగళవారం ప్రచురితమైంది. ‘‘1974లో ఇందిరా గాంధీ నాయకత్వంలో పాలస్తీనా ప్రజల ఏకైక, చట్టబద్ధమైన ప్రతినిధిగా పాలస్తీనా లిబరేషన్ ఆర్గనైజేషన్ (పీఎల్‌వోను)ను గుర్తించిన మొదటి అరబ్‌యేతర దేశంగా భారతదేశం అవతరించింది. 1988లో పాలస్తీనాను అధికారికంగా గుర్తించిన మొదటి దేశాల్లో భారత్ ఒకటి’ అని ఆమె పేర్కొన్నారు. 2023 అక్టోబరు 7న ఇజ్రాయెల్‌లోని మహిళలు, పిల్లలపై హమాస్ జరిపిన దాడిని ఖండించి తీరాలని చెప్పారు.
భారత్ వైపు గ్లోబల్ సౌత్ చూపు
అమెరికా అండతోనే గాజాపై ఇజ్రాయెల్ దాడులు కొనసాగిస్తున్నదని సోనియాగాంధీ తెలిపారు. యూఎన్ జనరల్ అసెంబ్లీ తీర్మానాలను పూర్తిగా విస్మరించిందని, జాతి విధ్వంస చర్యలను నిరోధించాలని అంతర్జాతీయ న్యాయస్థానం ఇచ్చిన ఆదేశాన్ని కూడా ఇజ్రాయెల్ పెడచెవిన పెట్టిందని అన్నారు. కుటుంబ వ్యాపారాలు, రియల్ ఎస్టేట్ కోసమే కొందరు ఈ దాడులకు పురిగొల్పుతున్నారని అమెరికాపై పరోక్ష విమర్శలు చేశారు. పాలస్తీనా పౌరులను ఇజ్రాయెల్ హతమారుస్తున్న తీరు నిజంగా మానవత్వానికి వ్యతిరేకంగా జరుగుతున్న తీవ్రమైన నేరమని పేర్కొన్నారు.
ఈ పరిస్థితుల్లో ఇజ్రాయెల్‌ను అంతర్జాతీయ న్యాయస్థానంలో నిలబెట్టేందుకు దక్షిణాఫ్రికా ధైర్యంగా ముందడుడు వేసిందని చెప్పారు. ఈ పరిస్థితుల్లో గాజాలో మానవత్వానికి జరుగుతున్న ఘోర అవమానాన్ని మోదీ సర్కారు మౌనంగా చూస్తూ ఉండడం సరికాదని సోనియాగాంధీ అన్నారు. మోదీ సర్కారు తీరుతో భారత దేశ ప్రజలు తీవ్ర నిరాశకు గురయ్యాయని చెప్పారు. పాలస్తీనా అంశంపై నాయకత్వం కోసం గ్లోబల్ సౌత్ మరోసారి భారత్ వైపు చూస్తున్నదని సోనియాగాంధీ తెలిపారు.