
దేశానికి కాంగ్రెస్ వెన్నుపోటు పొడుస్తోందటూ ఫైర్
చైనా ప్రెసిడెంట్‌కు దంగల్ నచ్చింది.. దాద్రిలో బబితా ఫొగట్దే గెలుపు
హర్యానా ఎన్నికల ప్రచారంలో ప్రధాని
‘‘హిమాలయ నదుల్లో మనకు దక్కాల్సిన నీళ్లలో మెజార్టీ వాటాను పాకిస్తాన్ వాడుకుంటోంది. ఈ తంతు 70 ఏండ్లుగా జరుగుతున్నా గత ప్రభుత్వాలేవీ పట్టించుకోలేదు. ఇకపై ఈ ఆటలు సాగనివ్వం. పాక్‌కు వెళ్లే మన నీళ్లను ఆపేస్తాం’’అని ప్రధాని నరేంద్ర మోడీ చెప్పారు. ఆ నీళ్లను హర్యానా, రాజస్థాన్‌కు తరలిస్తామని, ఈ పోరాటానికి తానే నాయకత్వం వహిస్తానని, నీళ్లు రప్పించే పూచీ తనదేనని హర్యానా రైతులకు ప్రధాని హామీ ఇచ్చారు. హర్యానా అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా మంగళవారం చార్కి దాద్రిలో జరిగిన బహిరంగ సభలో మాట్లాడారు. హర్యానా, మహారాష్ట్రలో పార్టీ గెలుపుపై ధీమా వ్యక్తం చేస్తూ.. దేశం ఈసారి రెండు దీపావళులు చూడబోతున్నదని, ఒకటి దీపాల పండుగైతే, రెండోది బీజేపీ విజయానికి గుర్తుగా కమలం పూలతో జరుపుకునేదని మోడీ చెప్పారు.
370పై పుకార్లు మానండి
జమ్మూకాశ్మీర్‌కు స్పెషల్ స్టేటస్ కల్పించే ఆర్టికల్ 370 రద్దు నిర్ణయాన్ని ప్రజలందరూ సమర్థిస్తుంటే, కాంగ్రెస్ పార్టీ మాత్రం విదేశాల్లో పుకార్లు పుట్టిస్తోందని ప్రధాని ఆరోపించారు. ‘‘మోడీని తిట్టడానికి విదేశాల నుంచి తిట్లను దిగుమతి చేసుకోండి. తప్పులేదు. కానీ దయచేసి దేశానికి వెన్నుపోటు పొడవకండి’’అని కాంగ్రెస్ నేతలనుద్దేశించి మోడీ అన్నారు.
దంగల్ చూశానని జిన్‌పింగ్ చెప్పారు
అవకాశం దక్కాలేగానీ మన ఆడపిల్లలు మగవాళ్లకంటే ఎందులోనూ తక్కువకాబోమని నిరూపిస్తారని, దాద్రి అసెంబ్లీ స్థానం బీజేపీ అభ్యర్థి, స్టార్ రెజ్లర్ బబితా ఫొగట్ అందుకో ఉదాహరణ అని మోడీ చెప్పారు. ‘‘హర్యానా ఆడబిడ్డల సత్తా ప్రపంచానికి చాటిన ‘దంగల్’సినిమాను తాను కూడా చూశానని చైనా ప్రెసిడెంట్ జిన్‌పింగ్ నాతో చెప్పారు. ఆ క్షణం నేను చాలా గర్వంగా ఫీలయ్యా’’అని ప్రధాని తెలిపారు. ప్రధాని నరేంద్ర మోడీ మాటలకు బబిత సంతోషంతో కన్నీళ్లు పెట్టారు. బేటీ బచావో బేటీ పడావో ప్రోగ్రామ్ హర్యానాలో బాగా సక్సెస్ అయిందని, అమ్మాయిల సంఖ్య పెరగడంతో సెక్స్ రేషియో మెరుగుపడిందని, ఇంత బాగా పనిచేసిన మనోహర్ లాల్ ఖట్టర్‌నే మరోసారి సీఎంగా గెలిపించాలని మోడీ ప్రజలకు విజ్ఞప్తి చేశారు.
నోట్ల రద్దు, జీఎస్టీ వల్లే ఉద్యోగాలు పోయాయ్
యవత్మల్(మహారాష్ట్ర): పెద్ద నోట్ల రద్దు, జీఎస్టీ లాంటి తప్పుడు ఆర్థిక విధానాల వల్లే దేశంలో చాలా మంది ఉద్యోగాలు పోయాయని కాంగ్రెస్ నాయకుడు రాహుల్‌గాంధీ విమర్శించారు. మహారాష్ట్ర యవత్మల్‌లో మంగళవారం జరిగిన ఎన్నికల ప్రచార సభలో ఆయన మాట్లాడారు. మోడీ సర్కార్ అధికారంలో ఉన్నంతవరకు నిరుద్యోగ సమస్యకు పరిష్కారం దొరకదన్నారు. ఎకానమీని నడిపించేది ప్రజలేకాని అంబానీ, అదానీలు కాదన్నారు. వచ్చే ఆరునెలల్లో ఉద్యోగాలు కోల్పోనున్న యువత సంఖ్య రెట్టింపు అవుతుందని, ఈ డ్యామేజీని సరిచేసేందుకు మహారాష్ట్ర ఎన్నికలు ఓటర్లకు వచ్చిన అవకాశమని రాహుల్ చెప్పారు.