సమతామూర్తి ప్రోగ్రామ్​లో ఈక్వాలిటీ ఎక్కడ?

సమతామూర్తి ప్రోగ్రామ్​లో ఈక్వాలిటీ ఎక్కడ?

హైదరాబాద్, వెలుగు: సమతామూర్తి రామానుజ విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమంలో ప్రధాని మోడీ అసమానతలను ప్రదర్శించి, బీజేపీ రాజకీయ సభగా మార్చారని సీఎల్పీ నేత భట్టి విక్రమార్క అన్నారు. ఆదివారం అసెంబ్లీ మీడియా పాయింట్ వద్ద ఆయన మాట్లాడారు. అందరూ సమానమేనని చాటి చెప్పే రామానుజుల ఫిలాసఫీకి వ్యతిరేకంగా.. మిగతా పార్టీలు, అన్ని వర్గాల వారిని భాగస్వామ్యం చేయకుండా.. కార్యక్రమాన్ని బీజేపీ తన రాజకీయ వేదికగా మార్చిందన్నారు. సమతా మూర్తి విగ్రహ ప్రతిష్టాపనకు మోడీ బీజేపీ నేతగా వచ్చారా.. ప్రధాని హోదాలో వచ్చారా.. అని ప్రశ్నించారు. ప్రధానికి విమానాశ్రయంలో స్వాగతం పలికే దగ్గర నుంచి వీడ్కోలు పలికే వరకు మోడీ పర్యటన మొత్తం బీజేపీ కార్యక్రమంలా సాగిందని భట్టి ధ్వజమెత్తారు. బీజేపీ మినహా మిగతా పార్టీల నేతలు ఎవరూ రాకుండా భద్రత పేరిట ఎస్పీజీ అధికారులతో కట్టుదిట్టం చేయడం ఈక్వాలిటీకి వ్యతిరేకంగా...రామనుజాచార్యులకు జరిగిన అవమానంగా పేర్కొన్నారు. సమానత్వం ప్రదర్శించాల్సిన చోట అసమానతలు చూపి, విభజించు.. రాజకీయ లాభం పొందు అనే బీజేపీ, ఆర్ఎస్ఎస్ వాదాన్ని ప్రదర్శించి మోడీ రామానుజాచార్యులతో పాటు తెలంగాణ రాష్ట్రాన్ని అవమానించారని ఫైర్​అయ్యారు. ప్రధాని నిజంగా సమతామూర్తి స్ఫూర్తిని పొందితే దేశంలో ఉన్న అన్ని రాష్ట్రాలను  ఒకే విధంగా చూడాలన్నారు. ఉత్తర, దక్షిణ రాష్ట్రాలను వేరు వేరుగా చూడటం తగదన్నారు. ఉత్తరాది, బీజేపీ పాలిత రాష్ట్రాలకు అత్యధికంగా నిధులు కేటాయిస్తూ దక్షిణాది రాష్ట్రాలకు నిధులు ఇవ్వకుండా చిన్న చూపు చూస్తూ మోడీ వివక్ష చూపుతున్నారని విమర్శించారు. రామానుజాచార్యుల ఫిలాసఫిని సైతం రాజకీయ లాభం కోసం వాడుకోవడంపై ప్రజలు ఆలోచించాలని భట్టి విజ్ఞప్తి చేశారు.