అనాథలకు ఆరోగ్యశ్రీ కార్డులు : కలెక్టర్ కుమార్ దీపక్

అనాథలకు ఆరోగ్యశ్రీ కార్డులు : కలెక్టర్ కుమార్ దీపక్

మంచిర్యాల,  వెలుగు: అనాథ పిల్లల రక్షణ, ఆరోగ్య సంరక్షణకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని మంచిర్యాల కలెక్టర్ కుమార్ దీపక్ అన్నారు. గురువారం కలెక్టరేట్ లో జిల్లా మహిళ, శిశు, వయోవృద్ధులు, దివ్యాంగులు, ట్రాన్సో జెండర్ల సంక్షేమశాఖ అధికారి రౌఫ్ ఖాన్, బాలల సంరక్షణ సమితి అధికారి ఆనంద్​తో కలిసి అనాథ పిల్ల లకు ఆరోగ్యశ్రీ కార్డులు అందించారు. 

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఆరోగ్యశ్రీ ట్రస్ట్ సీఈవో, వైద్యశాఖ సహకారంతో జిల్లా బాలల పరిరక్షణ విభాగం, జిల్లా సంక్షేమశాఖ సమన్వయంతో జిల్లాలోని 6 సంరక్షణ కేంద్రాల్లో ఉన్న 85 మంది అనాథ పిల్లలకు ఆరోగ్యశ్రీ కార్డులు అందించామని తెలిపారు. జిల్లాలోని బాలల సంరక్షణ కేంద్రాల్లో ఆశ్రయం పొందుతున్న అనాథలందరికీ ఆరోగ్య సేవలు ఉచితంగా అందిస్తామన్నారు.  ఈ కార్డు ద్వారా ఎక్కడైనా రూ.10 లక్షల వరకు ఉచితంగా కార్పొరేట్ వైద్యం పొందవచ్చన్నారు. కార్యక్రమంలో జిల్లా ఆరోగ్యశ్రీ సమన్వయకర్త డాక్టర్ రాధిక, సిబ్బంది పాల్గొన్నారు.

విద్యార్థుల ఆరోగ్యం పట్ల ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలి

జైపూర్(భీమారం), వెలుగు: విద్యార్థుల ఆరోగ్యం పట్ల ప్రత్యేక శ్రద్ధ వహించాలని కలెక్టర్ సూచించారు. గురువారం ఆయన భీమారంలోని ప్రభుత్వ గిరిజన ఆశ్రమ పాఠశాల, ప్రైమరీ, జడ్పీ హై స్కూళ్లను జిల్లా గ్రామీణాభివృద్ధి అధికారి కిషన్, ఎంపీడీవో మధుసూదన్​తో కలిసి పరిశీలించారు. విద్యార్థుల ఆరోగ్యం పట్ల ప్రత్యేక శ్రద్ధ వహించాలని, నాణ్యమైన విద్యాబోధన అందించాలని అధికారులకు సూచించారు.

 విద్యార్థుల హాజరు శాతం పెంచడంతో పాటు వారి సంఖ్య పెంచేందుకు టీచర్లు కృషి చేయాలన్నారు. ప్రైమరీ స్కూల్ విద్యార్థులతో మాట్లాడి మధ్యాహ్న భోజనం మెనూ, విద్యాబోధన గురించి అడిగి తెలుసుకున్నారు. వన మహోత్సవంలో భాగంగా మొక్కలు నాటారు. పీహెచ్ సీ బిల్డింగ్ నిర్మాణ పనులు పరిశీలించారు.